NRI-NRT

వసంతకృష్ణప్రసాద్‌కు తానాలో రాజకీయ సెగ

YSRCP MLA Vasantha KrishnaPrasad Faces Telugu NRIs Rage In TANA 2019

* పోలవరంపై ప్రవాసుల నిలదీత
* జై తెదేపాతో పాటు జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ప్రవాసులు
* తానాలో మూడో రోజు రాజకీయ వేదికపై రభస
* ధాటిగా బదులిచ్చిన వసంత

కృష్ణా జిల్లా వైకాపా శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్‌కు 22వ తానా మహాసభల ముగింపు రోజు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రాజకీయ వేదికలో ప్రవాసుల నుండి రాజకీయ సెగ తగిలింది. పోలవరం పూర్తి చేస్తారా? చేయరా? అంటూ ప్రవాసులు తెదేపాకు అనుకూలంగా వైకాపాకు, జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వసంతను నిలదీశారు. ఏ సందర్భంలోనూ తొణకకుండా కృష్ణప్రసాద్ చాలా ధాటిగా వారి ప్రశ్నలకు బదులు ఇచ్చారు. టంగుటూరి అంజయ్య హయాంలో శంఖుస్థాపన చేసిన పోలవరాన్ని ఇన్ని రోజులు పూర్తి చేయకుండా నాంచడం సిగ్గుచేటు అని, అసలు దాన్ని పూర్తి చేస్తారా? చేయరా? అంటూ సత్తిరాజు సోమేశ్వరరావు అనే ప్రవాసుడు వసంతను నిలదీశారు. దీనికి బదులు చెప్పే క్రమంలో వసంత మాట్లాడుతూ మైలవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా ప్రతి సోమవారం సమీక్షలని, రైతులకు ఉచిత విహారాలని పోలవరానికి ప్రభుత్వ సొమ్ములతో బస్సులు పెట్టి మరీ ప్రభుత్వాదాయాన్ని దుర్వినియోగం చేసి పోలవరం కాలయాపనకు కారకులయ్యారని తెలిపారు. దీనికి నిరసనగా వేడుకల్లో పాల్గొన్న ప్రవాసులు జై తెదేపా అంటూ నినాదాలు అందుకున్నారు. వసంత ఎక్కడా కూడా తన ప్రసంగాన్ని ఆపకుండా 2022 కల్లా పోలవరాన్ని పూర్తి చేసి తీరుతామని అన్నారు. అనంతరం కృష్ణా జిల్లాకు NTR పేరును పెడతారని జగన్ తన పాదయాత్రలో వాగ్ధానం చేశారని, అదెందుకు పూర్తి చేయలేదని ప్రవాసులు మరో ప్రశ్న సంధించగా, తాము అధికారంలోకి వచ్చిన్ 40రోజులు కూడా కాలేదని ఆగష్టులో జిల్లాల పునర్విభజనలో ఏపీలోని 13జిల్లాలు 25 అవుతాయని, ఆ సందర్భంలో కృష్ణా జిల్లా పేరు మార్చి తీరుతామని తెలిపారు. అనంతరం తానా అధ్యక్షుడు వేమన సతీష్ 2009 తానాలో “తానాలో తన్నులాట” శీర్షికన అప్పటి రాజకీయ వేదికపై వార్తలు వచ్చాయని, నేటి చర్చావేదిక కూడా దానికి తగ్గలేదని సర్దిచెప్పి సభను ముగించారు. ఈ చర్చావేదికలో మల్లు భట్టి విక్రమార్క, రసమయి బాలకిషన్, గన్ని కృష్ణ, కోమటి జయరాం, నాదెళ్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.