NRI-NRT

TeNF ఆధ్వర్యంలో లండన్‌లో బోనాలు

TeNF UK Celebrates Telangana Bonalu In London

తెలంగాణ ఎన్నారై ఫోరం (టీఈఎన్ఎఫ్) ఆధ్వర్యంలో లండన్లోని కాన్ఫోర్డ్ కళాశాలలో ఆదివారం వైభవంగా ఎనిమిదో సంవత్సర బోనాల జాతర నిర్వహించారు. ఈ సంబురాలకు బ్రిటన్ నలుమూలల నుంచి 600లకుపైగా తెలంగాణ కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు లండన్ ఎంపీలు వీరేంద్రశర్మ, సీమా మల్హోత్రా, భారత రాయభార కార్యాలయ ఉన్నతాధికారి కే ఈవోమ్ ముఖ్య అతిథు లుగా హాజరై మాట్లాడారు. భారతీయ సంస్కృతి ప్రచారంలో తెలుగువారు మొదటిస్థానంలో ఉన్నారని ఎంపీ వీరేంద్రశర్మ తెలిపారు. ఎనిమిదేండ్లుగా లండన్ బోనాల వేడుకల్లో పాల్గొనడం గర్వంగా ఉందని చెప్పారు. ఇంగ్లాండ్ గడ్డపై తన నియోజకవర్గంలో బోనాలు నిర్వహించడం, హిందూ సంప్రదాయాల్లో తాను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఎంపీ సీమా మల్హోత్రా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో తొలిసారిగా బోనాలు 2011లో నిర్వహించిన తనకు సహకరించి.. ఇప్పుడు విశ్వవ్యాప్తంగా బోనాల నిర్వహణకు దోహదపడుతున్న వారందరికీ తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపకుడు, చైర్మన్ గంప వేణుగోపాల్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఆచార, సంప్రదాయాలను ప్రచారంచేయడాన్ని సేవగా సంస్థ స్వీకరిస్తున్నదని, నియమ నిబంధనల మేరకు కలిసివచ్చే అందరితో సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి సుధాకర్గౌడ్ తెలిపారు. ఉపాధ్యక్షులు ప్రవీణ్రెడ్డి, రంగు వెంకట్ మాట్లాడుతూ.. విదేశాల్లో పుట్టిపెరిగే భారతీయ సంతతి కోసం మన పండుగలు నిర్వహించడం చాలాముఖ్యమన్నారు. స్థానిక లక్ష్మీనారాయణ గుడిలో కార్యదర్శి, మహిళాసభ్యుల ఆధ్వర్యంలో దుర్గామాతకు బోనం, ఒడిబియ్యం సమర్పించారు. లండన్ పురవీధుల్లో తొట్టెలు, బోనాల శోభాయాత్రను కన్నులపండువగా నిర్వహించారు. కాన్ఫోర్డ్ కళాశాల ఆడిటోరియంలో మీనాక్షి అంతరి అధ్యక్షతన వీరేంద్రవర్మ, శ్రీవాణి.. మహంకాళి మాతకు బోనాలు సమర్పించి పూజలు జరిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారతనాట్యం, గీతాలాపన, చిన్నారుల నృత్య ప్రదర్శన, ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తులను అలరించాయి. భక్తులకు తెలంగాణ శాఖహార, మాంసాహార భోజనాలు ఏర్పాటుచేశారు.