* ఈనెల 11 నుండి ప్రాంరంభం కానున్న రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా సజావుగా పూర్తి అర్థవంతంగా జరిగేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరూ అన్ని విధాలా సహకరించాలని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారామ్ విజ్ఞప్తి చేశారు.
* బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్ నగరంలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జూలై 12న ఉదయం 11 గంటలకు సభలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
* తాడికొండలో వైసీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి-బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఫ్లెక్సీలో ఎంపీ సురేష్ ఫొటో చిన్నగా వేశారని ఆయన అనుచరులు మండిపడ్డారు. ఓ వ్యక్తిపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
* ఐదేళ్లలో విడతల వారీగా మద్యపాన నిషేధాన్ని విధించే దిశగా ఏపీలోని జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా.. మందుబాబులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం మద్యం అమ్మకాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఈ సమయాన్ని కుదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లిక్కర్ ను అమ్మాలని భావిస్తోంది. దీంతో 4 గంటలు మద్యం అమ్మకాలు తగ్గుతాయి. దీంతో, సాధారణ అమ్మకాలతో పోలిస్తే లిక్కర్ అమ్మకాలు భారీ స్థాయిలో తగ్గనున్నాయి.
* పోలవరంపై ఒడిశా పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారణకు స్వీకరించింది. ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది ఆరు వారాల గడువు కోరారు. అయితే ధర్మాసనం నాలుగు వారాల గడువు మాత్రమే ఇచ్చింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీనిపై జస్టిస్ ఎన్వీ రమణ త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసింది.
*అమెరికాలోని వాషింగ్టన్‌లో భారీ వర్షాలతో హఠాత్తుగా వరదలు పోటెత్తడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్‌లోని బేస్‌మెంట్ మొత్తం వరద నీటితో నిండిపోయిందని ఫాక్స్ న్యూస్ వార్త ప్రచురించింది. నగరంలో రోడ్లన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయని, కార్లు మూడువంతుల వరకూ నీటిలో మునిగిపోయాయని వార్తలు వెలువడ్డాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న దేశమైనా ప్రకృతి భీభత్సానికి తాను వణికిపోక తప్పడం లేదంటూ స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. వేలాదిమందిపై వరద ప్రభావం తీవ్రంగా పడింది
* ఈసారి బడ్జెట్ స్టార్టప్ కంపెనీల అభివృద్ధికి పలు చర్యలను ప్రకటించడం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇలాంటి కంపెనీలు మరింత సులువుగా వ్యాపారం చేసుకునేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. స్టార్టప్‌లకు నిధులు అందించే ఏంజెల్ ఇన్వెస్టర్లకు ఐటీ అధికారుల నుంచి ఇబ్బందులు రాకుండా చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబరు నుంచి కొత్త ట్యాక్స్ రిటర్నుఫారాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
* కొత్త ఉద్యోగాలు కల్పించడంలో ఎన్డీయే సర్కార్ ఘోరంగా విఫలమైందన్న ప్రతిపక్షాల విమర్శలకు కేంద్రం సమాధానం చెప్పింది. గత రెండేళ్లలో కొత్తగా మూడు లక్షల 81 వేల ఉద్యోగాలను భర్తీచేసినట్టు 2019–-20 బడ్జెట్ డాక్యుమెంట్లలో ప్రకటించింది.
* జమ్మూకాశ్మీర్ పరిస్థితిపై ఆఫీస్ ఆఫ్ యూఎన్ హైకమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ( ఓహెచ్‌సీహెచ్‌ఆర్) తాజాగా రిలీజ్ చేసిన రిపోర్ట్‌పై ఇండియా తీవ్రంగా స్పందించింది. అదంతా తప్పుల తడకని పేర్కొంది. క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని నివేదికలో ప్రస్తావించలేదని అభ్యంతరం వ్యక్తంచేసింది.
* మహారాష్ట్రతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నది ఉధఅతి పెరుగుతోంది. మంగళవారం పోలవరం ప్రాజెక్టు వద్ద 600 మీటర్ల వెడల్పు మేరకు గోదావరి ప్రవహిస్తోంది. దీంతో వరద ప్రవాహానికి కాఫర్ డ్యామ్ వరకూ వెళ్లేందుకు నిర్మించిన అప్రోచ్ రోడ్డు మునిగిపోయింది. కాఫర్ డ్యామ్ వద్ద గోదావరి వెడల్పు 2400 మీటర్లు ఉండగా, ఇందులో 2200 మీటర్ల మేర కాఫర్ డ్యామ్ ను అధికారులు ఏర్పాటు చేశారు.
* మహారాష్ట్ర రాజధాని ముంబయిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ముంబయి జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటి వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా 40 మందికి పైగా మృతి చెందారు.
* కృష్ణా జిల్లా మైలవరం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన 180 మంది ప్రత్తి రైతులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ మైలవరం మండల నాయకులు చాట్ల సుధాకర్ రావుల సుబ్బారావు వజ్రాల వెంకట రెడ్డి డిమాండ్ చేశారు
* అనంతపురం పట్టణంలోని నారాయణ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. ర్యాగింగ్‌లో భాగంగా జూనియర్లు, సీనియర్ల మధ్య ఘర్షణ జరగడంతో… కాలేజీ సిబ్బంది రెచ్చిపోయారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. అంతేకాకుండా విద్యార్థులకు కాలేజీ లెక్చరర్లు వాతలు కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ గొడవలో పలువురు విద్యార్థులు గాయపడ్డట్టు సమాచారం.
* శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా నియమించబడిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ మొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. జిల్లా సందర్శనలో భాగంగా మంగళవారం ఉదయం రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాసుతో కలసి ఆరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయంగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ విశిష్టతను అర్చకులు శంకర శర్మ మంత్రికి వివరించారు.
*మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని గ్రామీణ సీఐ సురేష్ కుమార్, ఎస్సై రాజశేఖర్‌రెడ్డికి సూచించారు. తాడిపత్రి మండలం వీరాపురంలో పోలింగ్ రోజున తెదేపా నాయకుడు చింతా భాస్కర్‌రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు చంద్రబాబు నాయుడు మంగళవారం వీరాపురం గ్రామానికి రానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో గ్రామంలో భద్రత ఏర్పాట్లను డీఎస్పీ పరిశీలించి పలు సూచనలు చేశారు.
*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాదం బహిరంగ లేఖ రాశారు. అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10శాతం రిజర్వేషన్ లో కాపులకు 5శాతం కేటాయిస్తామని గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టిందని, క్షేత్రస్థాయిలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు కావడం లేదన్నారు. హామీలు నెరవేర్చమన్నందుకు కాపు నాయకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. 2019 ఎన్నికల్లో కాపు జాతి మీ వైపు మొగ్గు చూపారన్నారు. కాపు జాతి సహాయం పొందినట్లు భావిస్తే అసంపూర్తిగా ఉన్న రిజర్వేషన్ ను పూర్తి చేయండని కోరారు.
*ఇంటర్మీడియేట్ అడ్మిషన్లకు ఈ నెల 31తో గడువు ముగియనుంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శి కాంతిలాల్ దండే సోమవారం అధికారులకు జారీ చేశారు. 2019-20 విద్యాసంవత్సరానికి అన్ని జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఈ నెల 31తో అడ్మిషన్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎటువంటి పొడిగింపులు ఉండవని తెలిపారు.
*తుంగభద్ర జలాశయం జలకళతో ఉప్పొంగుతోంది. రాత్రి తొమ్మిది గంటల నుంచి డ్యాంకు 3600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో తుంగభద్ర జలాశయం నీటితో కళకళలాడుతోంది. కర్నాటకలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రభావం పెరుగుతోంది. దీంతో కర్నూలు జిల్లా రైతుల్లో ఖరీఫ్ సీజన్ సాగు ఆశలు రేకెత్తాయి.
* హిమాలయ పర్వత ప్రాంతాలైన ఐదు రాష్ట్రాల్లో పర్వతారోహకులకు తోడ్పాటు అందించేందుకు ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులను(ఐటీబీపీ) మోహరించామని ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశాల్ చెప్పారు. ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్వతారోహకుల రక్షణ కోసం తమ ఐటీబీపీ బలగాలను నియమిస్తున్న డీజీ వెల్లడించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిటోరాఘడ్ పరిధిలోని నందాదేవి వద్ద ఏడు పర్వతాలపై 11 మంది పర్వతారోహకులు గల్లంతు అయ్యారని, వారికోసం తాము గాలించగా ఏడుగురి మృతదేహాలు దొరికాయని దేశాయ్ చెప్పారు.
*పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణమైన కాపర్ డ్యామ్పై నుంచి వరద పొంగి పొర్లుతోంది. 3రోజులు క్రితం (పోలవరం ప్రాజెక్ట్ అథార్టీ) పీపీఏ కమిటీ పనులను పరిశీలించింది.
*అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు, మాజీ ఎంపీటీసీని నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. చర్ల మండలం కొత్తూరు గ్రామంలో నల్లూరి శ్రీనివాస్ అనే టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతను మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఆయన ఇంటికి వచ్చిన మావోయిస్టులు ఆయన్ను తమవెంట తీసుకెళ్లారు. దీంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
*రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈనెల 14, 15 తేదీల్లో శ్రీహరికోట పర్యటనకు వస్తున్నారని కలెక్టర్ శేషగిరిబాబు చెప్పారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీహరికోటలో ఈనెల 15 తెల్లవారు జామున 2.51కి చంద్రయాన్-2ని ప్రయోగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి వస్తున్నారని చెప్పారు. ఈనెల 14న తిరుపతి నుంచి హెలిక్యాఫ్టర్లో బయలు దేరి సాయంత్రం 4.25 గంటలకు శ్రీహరికోటకు చేరుకొంటారని తెలిపారు.
*ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) ద్వారా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చేందుకు ఈనెల 13, 14 తేదీల్లో ఆయా జిల్లాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. నియామక పత్రాలు అందుకున్న వారు ఈనెల 15న పాఠశాలల్లో చేరాలి.
*వ్యూహప్రతివ్యూహాలతో కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. కుమారస్వామి మంత్రివర్గంలో ఇటీవల చేరిన ఇద్దరు స్వతంత్రులు నగేష్, ఆర్.శంకర్లు సోమవారం మంత్రి పదవులకు రాజీనామా చేసి భాజపాకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు.
*తెలంగాణ కొత్త సచివాలయం, శాసనసభ నిర్మాణాలను వచ్చే జూన్ 2 నాటికి పూర్తి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. నిర్మాణాలను సత్వరమే ప్రారంభించాలని, ఇందుకోసం సచివాలయ ప్రస్తుత భవనాల కూల్చివేతను వెంటనే ప్రారంభించాలని తీర్మానించింది.
*రైలు సర్వీసుల నిర్వహణలో తొలిసారిగా ప్రైవేటు రంగం కాలుమోపనుంది. దిల్లీ-లఖ్నవూ మార్గం ఇందుకు ప్రయోగాత్మక వేదిక కానుంది. తేజస్ ఎక్స్ప్రెస్ రైలును ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
*రాష్ట్రంలో బీసీలలో కొనసాగుతున్నా.. ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) జాబితాలో చోటు దక్కని 15 కులాల్ని వెంటనే చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ను రాష్ట్ర బీసీ కమిషన్ కోరింది. ఓబీసీ జాబితాలో లేకపోవడంతో విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఫలాలు లభించడం లేదని తెలిపింది.
*రాజధాని హైదరాబాద్కు ఎప్పుడూ తాగునీటి సమస్య రాకుండా ఉండేలా ప్రత్యేక జలాశయం నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జలాశయం నిర్మాణంపై సీఎం సోమవారం ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు.
*పలు రంగాల్లో ప్రపంచానికి మార్గదర్శనం చేసిన విశ్వగురువు అనిపించుకున్న చరిత్ర భారతదేశానికి ఉందని, అయితే ఆధునికత అనేది బీసీ కుల వృత్తులను మింగేసిందని జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ భగవాన్లాల్ సహాని ఆవేదన చెందారు.
*జమ్మూకశ్మీర్లో పరిస్థితిపై ఐరాస మానవ హక్కుల కమిషన్ కార్యాలయం (ఓహెచ్సీహెచ్ఆర్) విడుదల చేసిన నివేదికను భారత్ సోమవారం తీవ్రంగా ఖండించింది. ఆ రాష్ట్రంపై సాగుతున్న తప్పుడు, దురుద్దేశపూరిత వాదనకు ఇది కొనసాగింపేనని విమర్శించింది. పాకిస్థాన్ నుంచి వెలువడుతున్న ఉగ్రవాదమే అసలు సమస్య అని, దాన్ని ఈ నివేదిక విస్మరించిందని దుయ్యబట్టింది.
*రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు వెబ్ఆప్షన్ల గడువు ఈ నెల 10తో ముగియనుంది. ప్రాధాన్య క్రమంలో వైద్యకళాశాలల్ని ఎంపిక చేసుకున్న అనంతరం.. బుధవారం రాత్రికే తొలివిడత ప్రవేశాల ఫలితాలను వెల్లడించడానికి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సర్వం సిద్ధం చేసింది.
*కాల వ్యవధి ముగిసిన డిపాజిట్ సొమ్ము చెల్లింపులో జరిగిన జాప్యానికిగాను వడ్డీ చెల్లిస్తున్నందున, అదనంగా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ పేర్కొంది. కాల వ్యవధి పూర్తయిన సొమ్ముతోపాటు, జరిగిన జాప్యానికి 7 శాతం వడ్డీ, ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలంటూ సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేషన్ను కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎంఎస్కే జైశ్వాల్ తీర్పు వెలువరించారు.
*తిరుపతికి వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానం నాలుగున్నర గంటలు ఆలస్యంగా బయలుదేరిన సంఘటన సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రయాణికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
*కృష్ణా ట్రైబ్యునల్ అవార్డును సవాల్ చేస్తూ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు దాఖలు చేసిన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. సంబంధిత పిటిషన్లను సోమవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం విచారించింది.
*దేశంలోని 10 రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.5,239 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ తెలిపారు. ఇందులో అత్యధికంగా త్రిపురకు రూ.1858.70 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
* ఎన్నికల విధుల అనంతరం తిరుగు బదిలీలు చేపట్టాలంటూ ఆందోళనబాట పట్టిన తహసీˆల్దార్లు మంగళవారం నుంచి వర్క్ టు రూల్ పాటించేందుకు సిద్ధమయ్యారు. నిబంధనల ప్రకారం ఉదయం 10.30 గంటలకు విధులకు హాజరై తిరిగి సాయంత్రం 5 గంటలకు విధులు ముగించుకుని వెళ్లిపోవాలని నిర్ణయించారు.
*రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం మెదక్ జిల్లాలో పలు చోట్ల 4 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. పాపన్నపేట, టేక్మల్, శంకరంపేటలో వర్షం పడింది. రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ అర్బన్, సిద్దిపేట, ములుగుతోపాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి.
*తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ద్వారా నాన్ క్లినికల్ విభాగంలో ఎంపికైన 76మంది సహాయ ఆచార్యుల్లో 72మందిని వేర్వేరు ప్రభుత్వ వైద్యకళాశాలు, వాటి అనుబంధ ఆస్పత్రుల్లో నియమించారు.
*పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎం.ఫిల్ పార్ట్-1 ప్రీ పీహెచ్డీ పరీక్షలను ఈ నెల 10, 11, 12వ తేదీల్లో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని మూడు కేంద్రాలకు సంబంధించినవారికి ఈ పరీక్షలు హైదరాబాద్లోని ప్రధాన కేంద్రంలో ఉంటాయని వర్సిటీ ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
*గోదావరికి సోమవారం ఉదయం నుంచి వరద పెరిగింది. ఫలితంగా ఎగువ కాఫర్డ్యామ్ రక్షణ పనులు జరిగే ప్రాంతానికి దారితీసే మార్గం మీదుగా నీరు ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్తగా డ్యామ్ వద్ద రక్షణ పనులు చేస్తున్న వాహనాలను ఒడ్డుకు రప్పించారు.
* ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాలు ఈ ఏడాది అక్టోబరు31 నుంచి నవంబరు3 వరకు ముంబయిలో జరుగనున్నాయి. ఈ మేరకు సంఘ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానించారు. ఈ నెల 6 నుంచి విశాఖలో నిర్వహిస్తోన్న సమావేశాలు సోమవారంతో ముగిశాయి. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ ఈనెల 15నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని సమావేశాల్లో నిర్ణయించారు.
*పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎం.ఫిల్ పార్ట్-1 ప్రీ పీహెచ్డీ పరీక్షలను ఈ నెల 10, 11, 12వ తేదీల్లో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని మూడు కేంద్రాలకు సంబంధించినవారికి ఈ పరీక్షలు హైదరాబాద్లోని ప్రధాన కేంద్రంలో ఉంటాయని వర్సిటీ ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
*జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్షకు ఎంపికైన విద్యార్థుల ప్రతిభా పత్రాలను జిల్లా విద్యాధికారికి పంపించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. డీఈవో కార్యాలయాలనుంచి వాటిని ప్రధానోపాధ్యాయులు తీసుకొని విద్యార్థులకు అందించాలని కోరారు.
* బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఇవాళ అంగరంగవైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, మేయర్ రామ్మోహన్ దంపతులు, తదితరులు ఎల్లమ్మ కల్యాణమహోత్సవాన్ని తిలకించారు. ఎల్లమ్మ కళ్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు అశేషంగా వచ్చిన భక్తులతో బల్కంపేట పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
11 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు – తాజా వార్తలు – 07/09
Related tags :