టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలన కేవలం ఓవర్ డ్రాఫ్ట్ పైనే బతికి బట్టకట్టగలిగిందని ఆరోపించారు.
పోతూపోతూ ప్రభుత్వం నెత్తిన అప్పును గుమ్మరించి పోయారని ధ్వజమెత్తారు. ఏపీకి ప్రస్తుతం సుమారు రూ.3.62 లక్షల కోట్ల అప్పు ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర రెవెన్యూ లోటును రూ.66వేల కోట్లకు చేర్చిందని ఆరోపించారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిరంగాలను పరిశీలిస్తే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించలేదన్నారు. అన్నిరంగాల్లో తిరోగమనమే తప్ప పురోగతి లేదన్నారు.
గత ఐదేళ్లలో భారీగా అప్పులు చేశారని మండిపడ్డారు. లోటు బడ్జెట్ నిధుల్నీ తేలేకపోయారని విమర్శించారు. మౌలిక రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ఎఫ్ఆర్ బీఎం పరిమితిని దాటి అప్పులు చేసిందన ధ్వజమెత్తారు.
విద్యుత్ లాంటి రంగాలు పూర్తిగా కుదేలయ్యాయని ఆరోపించారు. ఆశాఖకు ఉన్న బకాయిలను సైతం పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఇకపోతే పౌరసరఫరాలాంటి శాఖల నిధులను పసుపు-కుంకుమకు వాడేశారని ఆరోపించారు. చంద్రన్న కానుకల కోసం ఖర్చుపెట్టిన సొమ్ముకూడా చంద్రబాబు భర్తీ చేయకుండా వెళ్లిపోయారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని అన్ని శాఖల్లోనూ పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్ లో పెట్టేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కేవలం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి పోయారని చెప్పుకొచ్చారు. అంగన్‌వాడీలు, మధ్యాహ్నా భోజన పథకం బిల్లులతోపాటు హోంగార్డుల జీతాలను ఆయన పెండింగ్‌లో పెట్టారని రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ కి ప్రస్తుతం రూ.3.62లక్షల కోట్ల అప్పు ఉందని తెలిపారు. అలాగే రెవెన్యూ లోటు సుమారు రూ.66వేల కోట్ల రూపాయలు వరకు ఉందన్నారు. ఈ సమస్యలన్నింటిని తమ ప్రభుత్వం అధిగమిస్తుందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను సాధించుకుంటామన్నారు. అధైర్యపడకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.