నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి వివిధ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. రానున్న అయిదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను రెండింతలు చేసేందుకుగాను ప్రముఖ సోషల్ మడియా దిగ్గజం ఫేస్బుక్ ప్రణాళికలు రచిస్తోంది. అంతేకాకుండా సంస్థ నిర్దేశించుకున్న వైవిధ్యమైన లక్ష్యాల్లో భాగంగా అమెరికాలో నల్లజాతీయులు, స్పానిష్ మూలాలున్న (హిస్పానిక్) ఉద్యోగుల సంఖ్యను సైతం రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టకుంది. 2024 నాటికి అమెరికాలోని ఫేస్బుక్ కార్యాలయాల్లో సగానికిపైగా స్థానిక మైనారిటీ (తక్కువ ప్రాతినిధ్యం) వర్గాలకు చెందిన ఉద్యోగులను నియమించాలనే ఆలోచనలో ఉంది. ‘రానున్న అయిదేళ్లలో మా శ్రామికశక్తిలో కనీసం 50 శాతం మహిళలు, నల్లజాతీయులు, హిస్పానిక్, స్థానిక అమెరికన్లు, పసిఫిక్ ద్వీపవాసులు, ప్రత్యేక ప్రతిభావంతులు (దివ్యాంగులు), సీనియర్ సిటిజెన్స్ ఉండేలా కార్యచరణ రూపొందిస్తున్నాం’ అని ఫేస్బుక్ చీఫ్ డైవర్సిటీ అధికారిణి మాక్సిన్ విలియమ్స్ తన బ్లాగ్లో పేర్కొన్నారు. ఫేస్బుక్ తన వార్షిక నివేదికతో పాటుగా రానున్న అయిదేళ్లలో సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాలకు సంబంధించిన నివేదికలను విడుదల చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 36.9 శాతం మహిళా ఉద్యోగులు ఉన్నట్లు సంస్థ వార్షిక నివేదికలో వెల్లడించింది. సీనియర్ లీడర్షిప్ స్థాయిలో 32.6 శాతం, సాంకేతికపరమైన విభాగాల్లో 23 శాతం మహిళా ఉద్యోగులు ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. మరోవైపు మొత్తం శ్రామికశక్తిలో నల్లజాతీయులు 3.8 శాతం, హిస్పానిక్స్ 5.2 శాతంగా ఉన్నారు.
మైనారీటీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫేస్బుక్ నిర్ణయం

Related tags :