భారీగా కురుస్తున్న వర్షాలతో గంగానదికి వరద పోటెత్తుతోంది. రిషికేశ్ వద్ద గంగామాత ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రిషికేశ్ వద్ద గంగానది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదీ తీరంలో నివసించే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఉత్తరాఖండ్‌లోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మంగళవారమే హెచ్చరించింది. పలుచోట్ల కొండ చరియలు కూడా విరిగి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకులు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయలోనూ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అసోంలోని దాదాపు పది జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. దీంతో అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల ధాటికి అనేక చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో లోతట్టుప్రాంతాల్లో పలు చోట్ల ప్రజలు గల్లంతయినట్లు సమాచారం. మరికొన్ని గంటల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ప్రముఖ వాతావరణ సంస్థ స్కైమేట్ హెచ్చరించింది.
వరదనీరుతో ఉరకలేస్తున్న గంగ
Related tags :