NRI-NRT

న్యూజెర్సీలో ఎన్నారై తెదేపా సమావేశం

NRI TDP Meeting In New Jersey

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏం చేయలేరని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో నాట్స్‌ మాజీ అధ్యక్షులు, ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం సీనియర్‌ నాయకులు మన్నవ మోహన్‌ కృష్ణ ఆధ్వర్యంలో న్యూజెర్సీ తెలుగుదేశం కార్యకర్తలతో సోమవారం మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌ బాబు, కొల్లు రవీంద్ర, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆనంద్‌ బాబు మాట్లాడుతూ..‘దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌.1 చేయాలన్న సంకల్పం చంద్రబాబుది. ఆ ఉద్దేశంతోనే రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు. చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఎవరూ ఆందోళన చెందకండి. గెలుపోటములు సహజం. చంద్రబాబు మార్గదర్శకంలో పార్టీ మరింత పురోగతి చెందేలా అందరం సమష్టిగా కృషి చేద్దాం’ అని పిలుపునిచ్చారు.మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..‘ గత ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం కార్యకర్తలు చేసిన సేవలు అమూల్యమైనవి. శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేలా తెదేపా పనిచేస్తుంది. కార్యకర్తలను పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుంది’ అని తెలిపారు.గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ..‘ తెదేపా ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలందరూ అండగా నిలవాలి. తెదేపాకి ఇలాంటి సంక్షోభాలు కొత్తకాదు. పార్టీకి మళ్లీ పూర్వవైభవం వస్తుంది’ అని అన్నారు.ఈ కార్యక్రమంలో గుంటూరు తెదేపా సీనియర్‌ నాయకులు సుఖవాసి శ్రీనివాసరావు, ఎన్‌ఆర్‌ఐ నాయకులు శ్రీహరి మందాడి, వంశీ వెనిగళ్ల, మోహన్‌ కుమార్‌ వెనిగళ్ల, రమేశ్ నూతలపాటి, చంద్ర కొణిదెల, సురేశ్‌ బొల్లు, రాజేశ్‌ బేతపూడి, న్యూజెర్సీ తెదేపా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులందరినీ న్యూజెర్సీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఘనంగా సత్కరించింది.