మందులతో పనిలేకుండా క్యాన్సర్ కణితులను నిర్మూలిస్తే? ఆశ్చర్యంగా అనిపించినా ఇది సాధ్యమేనని నిరూపించారు కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఇందుకు ఇ-కొలి బ్యాక్టీరియాను అస్త్రంగా మలచుకొన్నారు. కొన్నిసార్లు మన రోగనిరోధక కణాలు తమకు తామే క్యాన్సర్ కణాలను గుర్తించి, చంపేస్తుంటాయి. అయితే కణితులు వీటి కంట పడకుండా తప్పించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. సీడీ47 అనే జన్యువు నుంచి విడుదలయ్యే ప్రోటీన్లను తమ మీద పొరలా అమర్చుకొని రోగనిరోధక వ్యవస్థ కళ్లు గప్పేస్తుంటాయి. దీన్ని ఛేదించటానికే శాస్త్రవేత్తలు ఇ-కొలి బ్యాక్టీరియాను ఉపయోగించుకున్నారు. వీటిని జన్యుపరంగా మార్పు చేసి.. ఎలుకల కణితుల్లోకి జొప్పించారు. వీటి నుంచి వెలువడే నానోబాడీలు క్యాన్సర్ కణాలకు అతుక్కుపోయి సీడీ47 ప్రోటీన్ల పొరను కప్పేస్తాయి. దీంతో రోగ నిరోధక కణాలు క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటి పని పడతాయి. వినూత్నమైన ఈ పద్ధతి ఇప్పటికిప్పుడు అందుబాటులోకి రాకపోయినా మున్ముందు సంప్రదాయ మందుల దుష్ప్రభావాలేవీ లేకుండా క్యాన్సర్లకు కచ్చితమైన చికిత్స చేయటానికి ఉపయోగపడగలదన్నది పరిశోధకుల భావన.
ఇక క్యాన్సర్ చికిత్సకు మందులు అక్కర్లేదు
Related tags :