Politics

కమల పరిమళాన్ని ఆస్వాదించనున్న డీ.శ్రీనివాస్

D Sreenivas To Join BJP

సీనియర్‌ నేత, ఎంపీ ధర్మపురి శ్రీనివాస్‌ రాజకీయ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన తెరాసలోనే కొనసాగుతారా? భాజపా తీర్థం పుచ్చుకుంటారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరై 24 గంటలు తిరగకముందే ఆయన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను కలవడం వెనుక ఆంతర్యమేంటో అంతు చిక్కడంలేదు. తెలంగాణలోనే కాకుండా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో డీఎస్‌ సుపరిచితుడు. ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. దీంతో ఆయన కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటికి చేరారు. కొంతకాలం ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగిన డీఎస్‌.. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ మాజీ ఎంపీ కవిత నేతృత్వంలో నిజామాబాద్‌ ప్రజాప్రతినిధులు ఆయనపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇదే సమయంలో తనపై చేసిన తీర్మానం వెనక్కి తీసుకోవాలని డీఎస్‌ బహిరంగంగానే డిమాండ్‌ చేశారు. అప్పటి నుంచి తెరాసకు దూరంగా ఉంటున్న డీఎస్‌.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్‌ను కలవడంతో ఆయన తిరిగి కాంగ్రెస్‌ గూటికే చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం డీఎస్‌ అనూహ్యంగా అమిత్‌ షాతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భాజపా.. డీఎస్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా ఆయనను తమ పార్టీలో చేర్చుకొనే అవకాశాలు ఉన్నాయి. తన కుమారుడు, భాజపా ఎంపీ అర్వింద్‌ ఈ సంప్రదింపుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నిజామాబాద్‌ గ్రామీణ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలూ డీఎస్‌తో పాటే కమలదళంలోకి వెళ్లే అవకాశం ఉంది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్‌, తెరాస నేతలు సైతం డీఎస్‌ వెనుక నడిచేలా ఉన్నారు. తెలంగాణలో అధికార తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అని ప్రచారం చేస్తున్న భాజపా నేతలు.. ఆ దిశగా తమ కార్యాచరణ ప్రారంభించినట్టు చర్చ జరుగుతోంది. రాజ్యసభ సభ్యుడు డీఎస్‌ వ్యవహార శైలిని తెరాస తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలు లభిస్తే ఆయనపై అనర్హత వేటుపై రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడుకు ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తెరాస నిర్ణయం ఆధారంగా డీఎస్‌ అనుసరించే వైఖరి రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.