*వడ్డీ లేని రుణాలపై చర్చ సందర్భంగా గురువారం సీఎం చాలా ఆవేశంగా మాట్లాడారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. కానీ, తాము ఇష్టానుసారంగా కాకుండా దస్త్రాల ఆధారంగా మాట్లాడుతున్నామన్నారు. సున్నా వడ్డీకి రుణాలపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దస్త్రాల్లో ఉన్న సమాచారాన్ని సభలో చదివి వినిపించారు. వడ్డీలేని రుణాలు చెల్లించామని ధ్రువీకరిస్తూ అధికారులు జారీ చేసిన లేఖలను సభలో చూపించారు. 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న వడ్డీలను కూడా చెల్లించామని గుర్తు చేశారు.‘ నిన్న ముఖ్యమంత్రి నన్ను రాజీనామా చేయమని చెప్పారు. ఇప్పుడు నిజాలు చెప్పాం కదా.. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా?లేదా ప్రజలకు క్షమాపణ చెబుతారా?అని ప్రశ్నించారు.
* పస తక్కువ.. ప్రచారం ఎక్కువ: యనమల
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై తెదేపా సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల విమర్శలు గుప్పించారు. బడ్జెట్లో ప్రచారం ఎక్కువ, పస తక్కువ అని ఎద్దేవా చేశారు. అప్పుల గురించి గత ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేశారని.. సుమారు రూ.48వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్ధపడ్డారన్నారు. ‘‘వడ్డీలేని రుణాలపై చాలా హడావుడి చేసి రూ.100 కోట్లే కేటాయించారు. అన్ని పథకాలకు జగన్, వైఎస్ఆర్ పేర్లే పెడుతున్నారు. పేర్లు పెట్టేందుకు రాష్ట్రంలో ఇంకెవరూ నాయకులు లేరా?’’ అని యనమల ప్రశ్నించారు.
* చంద్రబాబుకు ఆ ధైర్యం లేదు : గడికోట
రైతు పక్షపాతి ఎవరో…రైతు ద్రోహి ఎవరో ప్రజలందరికీ తెలుసునని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. రైతాంగం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరని వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ పాయింట్ వద్ద ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు ఉచిత విద్యుత్ అందజేసి వైఎస్సార్ వ్యవసాయానికి ప్రాణం పోశారని… రైతు సంక్షేమం కోసం ఆయన అనుసరించిన విధానాలను ఆదర్శంగా తీసుకుని సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతారన్నారు. ఇందులో భాగంగా రూ.5 వేల కోట్లతో సీఎం జగన్ ధరల స్థిరీకరణ నిధిని ప్రకటించారని.. అదే విధంగా కౌలురైతుల కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. రైతుల పట్ల ఆయనకు ఉన్న నిబద్దతకు ఇది నిదర్శనమన్నారు.
* ఎన్ఐఏ దర్యాప్తు పరిధిని పెంచబోతున్నాం : కిషన్‌రెడ్డి
తెలుగు రాష్ట్రాలు దేశంలో అగ్ర రాష్ట్రాలుగా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం విజయవాడ దుర్గమల్లేశ్వరస్వామిని కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని కోరుకున్నట్టు తెలిపారు. ఎన్ఐఏ దర్యాప్తు పరిధిని పెంచబోతున్నట్టు వెల్లడించారు. ఇతర దేశాల్లో కూడా మనపై జరుగుతున్న దాడులపై కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేసేలా చర్యలు తీసుకుంటాన్నామని అన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్‌ను కూడా ఎన్ఐఏ పరిధిలో తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ మూడు బిల్లులను సోమవారం పార్లమెంట్లో హోం శాఖ ప్రవేశపెట్టబోతున్నట్టు చెప్పారు.
* టీఆర్ఎస్కు సీనియర్ నేత గుడ్ బై
రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమారపుతోపాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడారు. ఈ విషయాన్ని మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో సోమారపు వెల్లడించారు. పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం వల్లనే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి కోసం చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పనిచేశారని ఆరోపించారు. తను ఏ పార్టీలో చేరనని.. ఇండిపెండెంట్‌గానే ఉంటానని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపించుకుంటానని అన్నారు. అయితే గత కొంత కాలంగా టీఆర్ఎస్లో స్థానికంగా నెలకొన్న వర్గపోరు కారణంగానే సోమారపు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
* రైతు రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి : కాంగ్రెస్
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 7 మాసాలు గడుస్తున్నా రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్.. ఈ అంశంపై ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. అసలు రుణమాఫీ ఒకేసారి చేస్తారా, విడతల వారీగా చేస్తారా అనే స్పష్టత ఇవ్వాలన్నారు. రైతు బంధు పథకం పై గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పవరకు కేవలం 50 శాతం రైతులకు మాత్రమే రైతు బంధు చెక్కులు అందాయన్నారు.
* కేసీఆర్‌పై కేంద్రం నిఘా శుభపరిణామం
నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కారుపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టడం శుభపరిణామమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి వ్యాఖ్యానించారు. ఐదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందని, అక్రమాలు పెరిగిపోయాయని అన్నారు. ప్రభుత్వ అవినీతిని ప్రతిపక్షాలు ఆధారాలతోసహా బయటపెట్టినా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేసిందని ఆమె విమర్శించారు. ఈ మేరకు నిన్న (బుధవారం) ప్రకటన విడుదల చేశారు.
* బలపరీక్ష కోరిన కుమారస్వామి
కర్నాటక సీఎం హెచ్డీ కుమారస్వామి.. బలపరీక్షకు డిమాండ్ చేశారు. ఇవాళ అసెంబ్లీ మొదలైన తర్వాత.. బలపరీక్ష పెట్టాలంటూ స్పీకర్‌ను సీఎం కుమారస్వామి అభ్యర్థించారు. దానికి టైం ఫిక్స్ చేయాలని కోరారు. కొందరు ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాల వల్ల.. రాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయని సీఎం అన్నారు. అందుకే విశ్వాస పరీక్ష కోసం తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీఎం చెప్పారు. అంతకముందు కర్నాటక సంక్షోభంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఆలోచిస్తున్నారా అన్న విషయాన్ని తెలుసుకోవాలని సుప్రీం పేర్కొన్నది. రెబల్ ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ప్రస్తుతం తీర్పును తటస్థంగా ఉంచినట్లు సుప్రీం తెలిపింది. మంగళవారం ఈ కేసుపై మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు కోర్టు పేర్కొన్నది.
* అమిత్‌షాతో టీఆర్ఎస్ ఎంపీ భేటీ.. బీజేపీలో చేరే అవకాశం?
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో ఆయన అమిత్‌షాను కలిశారు. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ పార్టీతో అంటీ ముట్టనట్టు ఉంటున్న డీఎస్… తనయుడు అరవింద్ ఎంపీగా గెలిచిన తర్వాత.. బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించింది. అయితే ఇంతలోనే.. టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశానికి హాజరై డీఎస్ షాకిచ్చారు
* ఆ 8 మంది రాజీనామాలు సరైన ఫార్మాట్లో లేవు: కర్ణాటక స్పీకర్
కర్ణాటకలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం నెలకోన్న సంక్షోభం క్లైమాక్స్ దశకు చేరినట్టు కనబడుతుంది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి బెంగళూరు చేరుకున్నారు. కర్నాటక రెబల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్‌కు సమర్పించుకోవాలని సుప్రీంకోర్టు నేడు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ను కలిసేందుకు అసమ్మతి కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు బెంగళూరులోని విధానసౌధకు చేరుకున్నారు. వారితో భేటీ అనంతరం స్పీకర్ కేఆర్ రమేష్ మీడియాతో మాట్లాడారు. “నాపై కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన పట్టించుకోను. రాజీనామాల విషయంలో నిబంధనల ప్రకారమే వ్వవహరిస్తాను. రాజ్యంగం ప్రకారమే నా నిర్ణయం ఉంటుంది. స్పీకర్ పరిధిలోని అంశాలు కోర్టు వరకు ఎందుకు తీసుకెళుతున్నారని” పేర్కొన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సరైనా ఫార్మాట్ లేవని తెలిపారు.
* అలా చేస్తే టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుంది: కన్నా
ప్రధాని మోదీ సమర్ధవంతమైన పాలనకు ఆకర్షితులయ్యే..ఏపీలో వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరితో కలిసి అయన శ్రీకాకుళంలో పర్యటించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పోలీసులతో పాలన సాగించాలని చూస్తే..టీడీపీకి పట్టిన గతే పడుతుందని కన్నా హెచ్చరించారు. విభజన అనంతరం ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అందించినా..ప్రజల్లో బీజేపీని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పురందేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా గృహనిర్మాణ సంస్థ మాజీ డైరెక్టర్ నడికుదిటి ఈశ్వరరావుతో పాటు ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు బీజేపీలో చేరారు.
* కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హెచ్చరిక
కర్ణాటక సంక్షోభం కథ క్లైమాక్స్ దశకు చేరుకుంది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో ముంబయి హోటల్లో నుంచి రెబల్స్ ఎమ్మెల్యేలు బెంగళూరు తిరిగి వచ్చారు. దీంతో కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధత క్రమంగా వీడే అవకాశాలు నెలకొన్నాయి.. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని గురువారం సుప్రీంకోర్టు కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్‌ను ఆదేశించింది. అయితే రాజీనామాలను ఒక్క రోజులో త్లేల్చాలన్న ఉత్తర్వును సవరించాలంటూ… స్పీకర్ తరుపున సీనియర్ న్యాయవాది అభిషేఖ్ మనుసింఘ్వీ లంచ్‌మోషన్ పిటీషన్ వేశారు. దీనిపై ఇవాళ సుప్రీం కోర్టు తన తీర్పును వెల్లడించే అవకాశముంది…… మరోవైపు సుప్రీం కోర్టు ఆదేశాలతో …. రాజీనామా చేసి తిరుగుబావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలు బెంగళూరు విధానసభకు చేరుకుని స్పీకర్‌ను కలిశారు. స్పీకర్ ఫార్మాట్లో మళ్లీ రాజీనామాలను ఆయనకు సమర్పించారు. రాజీనామాలను ఆమోదించాలని కోరారు.
* ఆమ్రపాలికి ఢిల్లీ నుంచి కాల్.. కిషన్ రెడ్డి కార్యాలయంలో..
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయనకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా వరంగల్ జిల్లా మాజీ కలెక్టర్ ఆమ్రపాలిని కేంద్రం నియమించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ అదనపు కమిషనరుగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమ్రపాలితో పాటు మరో ఐఏఎస్ అధికారి కె. శశికిరణాచారిని కేంద్ర సర్వీసులకు బదిలీ చేశారు. కిషన్ రెడ్డికి ఓఎస్డీగా ఆమ్రపాలి, వ్యక్తిగత కార్యదర్శిగా శశికిరణాచారిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల నికర అప్పు: బుగ్గన
గత ఐదేళ్లలో తెదేపా ప్రభుత్వం నికరంగా రూ.1,00,658.37 కోట్ల అప్పు చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. విభజన నాటికి రాష్ట్రంపై ఉన్న రుణ భారం? గత ఐదేళ్లలో ప్రభుత్వం తీసుకున్న రుణాలు? ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న రుణభారం ఎంత? అని ఎమ్మెల్యేలు పార్థసారథి, సుధాకర్‌బాబు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధామిచ్చారు. 2014 జూన్ నాటికి అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,30,654.34 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయని, 2019 మే 30 నాటికి ఇది రూ.2,61,302.81 కోట్లకు చేరినట్లు వెల్లడించారు.
*డీఎస్ వైఖరిపై తెరాస గుస్సా
రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ వ్యవహారశైలిని తెరాస అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన ఆధారాలు లభిస్తే అనర్హత వేటు కోసం రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. గురువారం దిల్లీలో డీఎస్ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసి మంతనాలు జరుపుతున్న విషయం తెరాస ఎంపీలకు తెలియడంతో వెంటనే దీనిని వారు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఏం చేయాలనే దానిపై అధిష్ఠానం విస్తృతంగా చర్చ జరిపినట్లు తెలిసింది. గత శాసనసభ ఎన్నికలకు ముందు డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆయనను సస్పెండ్ చేయాలని భావించారు.
*జగన్, బాబు మాటల తూటాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజే మాటామాటా.. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు, వాగ్యుద్ధాలు.. అభ్యంతరకర మాటలు.. రికార్డుల నుంచి తొలగింపులు.. రాజీనామాలదాకా సవాళ్లు, ప్రతి సవాళ్లు… విమర్శలు, ప్రతి విమర్శలు.. ఎదురుదాడులతో అసెంబ్లీ అట్టుడికింది. ఈ వాగ్యుద్ధానికి కాళేశ్వరం, రైతులకు సున్నా వడ్డీ రుణాలు కేంద్ర బిందువుగా నిలిచాయి. గురువారం శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ హాజరుకావడాన్ని విమర్శిస్తూ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా సభ్యులు చేసిన వ్యాఖ్యలు…వాటికి ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన ప్రతి వ్యాఖ్యల నేపథ్యంలో ఇలా సభ వాదోపవాదాలతో వేడెక్కింది.
*క్షమాపణ చెబుతారా? రాజీనామా చేస్తారా?
తెదేపా ప్రభుత్వ హయాంలో రైతులకు వడ్డీలేని రుణం పథకాన్ని అమలు చేయలేదని, ఐదేళ్లలో ఒక్క సంవత్సరం కూడా వడ్డీ రాయితీ సొమ్ము విడుదల చేయలేదని అసత్యాలు చెప్పినందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శాసనసభ వేదికగా 5 కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఆ పథకాన్ని అమలు చేశామంటూ దానికి రుజువుగా కొన్ని పత్రాలను ఆయన విడుదల చేశారు. గురువారం ఈ పత్రాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
*రైతుల కష్టాలకు కాంగ్రెస్సే కారణం
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యాపారవేత్తలకు అధిక ప్రాధాన్యమిస్తూ రైతుల సమస్యలను పట్టించుకోవటం లేదన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టిగా తిప్పికొట్టారు. దేశంలో రైతుల దుస్థితికి సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన ఎదురు దాడికి దిగారు. రైతులకు ప్రధాని మోదీ చేసినంత సాయాన్ని ఏ ప్రధాన మంత్రి చేయలేదని గురువారం లోక్‌సభలో శూన్య అవధిలో పేర్కొన్నారు.
*ఆర్థిక ప్రగతికి మార్గసూచీ ఏదీ?: కాంగ్రెస్
దేశ ఆర్థికాభివృద్ధిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఒక స్పష్టమైన మార్గసూచీని కేంద్ర ప్రభుత్వం 2019-20 బడ్జెట్లో రూపొందించలేకపోయిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం విమర్శించారు. నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకొస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినా అవేంటో వివరించలేదని పేర్కొన్నారు. గురువారం రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. వచ్చే అయిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని బడ్జెట్లో ప్రకటించుకోవడాన్ని చిదంబరం ఎద్దేవా చేశారు.
*అంబేడ్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలి
అంబేడ్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట చౌరస్తాలో పునఃప్రతిష్ఠించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. దిల్లీలోని జంతర్‌మంతర్‌లో గురువారం నిరాహార దీక్ష చేశారు. కొత్త విగ్రహం పెట్టాలని తీసుకువస్తే దానిని లాకప్‌లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహం కూల్చివేతపై పార్లమెంట్లో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. దీక్షకు మద్దతుగా నేతలు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ హర్షకుమార్ కూర్చొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాయంత్రం వీహెచ్‌తో దీక్షను విరమింపజేశారు.
*ప్రజాపద్దుల కమిటీ సభ్యుడిగా ఏపీ ఎంపీ బాలశౌరి
లోక్‌సభ ప్రజాపద్దుల కమిటీ సభ్యుడిగా వైకాపా ఎంపీ బాలశౌరి ఎన్నికయ్యారు. 15 మంది సభ్యులకుగానూ 23 మంది తొలుత నామినేషన్లు దాఖలు చేశారని లోక్‌సభ సచివాలయం పేర్కొంది. ఎన్నిక సమయానికి ఎనిమిది మంది సభ్యులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 15 మంది సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైందని పేర్కొంది. సంబంధిత కమిటీ సభ్యులు ఏప్రిల్ 2020 వరకు కొనసాగుతారని లోక్‌సభ బులెటిన్‌లో స్పష్టం చేసింది.
*కాంగ్రెస్ నేతలకు మంత్రి పదవులు?
గోవాలో మంత్రివర్గ మార్పులు చేర్పులు జరుగుతాయన్న ప్రచారం ఊపందుకుంది. మిత్రపక్షాలకు చెందిన వారిని మంత్రి పదవుల నుంచి తప్పించి కొత్తగా పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరికి ఆ పదవులు కట్టబెట్టవచ్చని బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి భాజపాలో చేరడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆ ఎమ్మెల్యేలతో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గురువారం దిల్లీకి వచ్చి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో సమావేశమయ్యారు.
*వైకాపా పాలనపై ఆర్నెల్ల తర్వాతే స్పందిస్తాం: కన్నా
రాష్ట్రంలో వైకాపా పాలనపై ఆర్నెల్ల తర్వాతే స్పందిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. విజయనగరంలో విలేకరులతో పాటు విశాఖలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా తప్పక ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. తెదేపాతో పాటు వైకాపానుంచీ భాజపాలోకి వలసలు వస్తున్నాయని తెలిపారు. ఐదేళ్లలో తెదేపా హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
*సమావేశాలు ముగిసేలోపు రాతపూర్వక సమాధానాలివ్వాలి
శూన్యగంటలో అడిగే ప్రశ్నలకు శాసనసభ సమావేశాలు ముగిసేలోగా రాతపూర్వక సమాధానం అందజేయాలని సభాపతి తమ్మినేని సీతారాం మంత్రులకు సూచించారు. గురువారం ఉదయం శాసనసభ శూన్యగంట సమయంలో ఆయన పలు సూచనలు చేశారు. మంత్రులు లేచి నిలబడి నోట్ చేసుకున్నాం అని చెప్పాలన్నారు. శూన్యగంటలో పలువురు సభ్యులు వేర్వేరు అంశాలపై మాట్లాడారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌పై విచారణ చేయించాలని ఎమ్మెల్యే నాగార్జున కోరారు.
*విజయసాయిరెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం
వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని తెదేపా రాజ్యసభా పక్షనేత కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. పార్లమెంట్‌లోని తెదేపాపా కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్, లోక్‌సభా ప్క్షనేత రామ్మోహన్ నాయుడుతో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జూన్ 22న జీవో ఇచ్చింది. ఆ నియామకం వెంటనే అమల్లోకి వస్తోందని పేర్కొంది.
జగన్ రాజీనామా చేస్తారా:::బాబు-రాజకీయ–07/12
Related tags :