ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… ఒక్కోసారి కళ్లు మంటలు పుడతాయి. దురద, ఎర్రబడటం, నీరు కారడం, నిద్రలేవగానే రెప్పలు అతుక్కుపోవడం వంటి సమస్యలు సాధారణంగానే ఎదురవుతాయి. అలాంటివాటికి ఏం చేయాలో చూద్ద్దామా? ఎండ, వేడి, పొగ, దుమ్ము, ధూళి వంటివి కళ్లకు హాని చేస్తాయి. వీటికి వీలైనంత దూరంగా ఉండాలి. కంటి అందానికి రసాయన పదార్థాలతో తయారయ్యే సౌందర్య ఉత్పత్తులు వినియోగించకూడదు. కంప్యూటర్, టీవీ, మొబైల్ స్క్రీన్లను ఎక్కువ సమయం చూడటమూ మంచిది కాదు. వాటిని అదేపనిగా చూస్తే… కళ్లల్లో సహజసిద్ధంగా ఉండే తేమ తగ్గి, పొడిబారతాయి. ఏకాగ్రతగా చదువుతున్నప్పుడు లేదా ఏదైనా చూస్తున్నప్పుడు అప్పుడప్పుడూ కను రెప్పలను మూసి తెరుస్తూ ఉండాలి. తడి ఆరకుండా ఉంటాయి. కళ్లని అపరిశుభ్రమైన చేతులతో తాకకూడదు. అదేపనిగా రుద్దకూడదు. కంటి ఆరోగ్యానికి ఆహారంలో చలవ చేసే పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కీరదోస, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. కారం, గరం మసాలాలు తగ్గించాలి. అతి తక్కువ లేదా ఎక్కువ వెలుగు మంచిది కాదు. మట్టి ప్రమిద లేదా వెండి దీపం కుందులో మంచి ఆముదం పోసి వత్తి వేసి దీపం వెలిగించాలి. ఈ దీపానికి తగిలేలా వెండి లేదా ఇత్తడి పళ్లాన్ని బోర్లించి ఉంచాలి. ఆముదం అయిపోయిన తరువాత పళ్లానికి ఏర్పడిన నల్లని మసిని ఒక పరిశుభ్రమైన భరిణెలోకి తీసుకోవాలి. చిటికెడు పచ్చకర్పూరం, తగినంత ఆవు నెయ్యిని ఈ మసికి కలిపితే కాటుక తయారవుతుంది. ఎలాంటి హానికర రసాయనాలు లేని ఈ కాటుక కంటికి ఆరోగ్యాన్నిస్తుంది. నిత్యం దీన్ని వినియోగించుకోవచ్చు.
కంటి ఆరోగ్యానికొ మీ కాటుక మీరే సహజంగా చేసుకోవచ్చు
Related tags :