అతడికంటే ఘనుడు అచ:ట మల్లన్న అన్నారన్నట్లు కుంభకోణాల్లో ఒకరిని మించి మరొకరు దూసుకెళ్తున్నారు. నీరవ్ మోదీ ఆయన మేనమామ మెహుల్ చోక్సీలు లెటర్ ఆఫ్ ఇండెంట్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)ని బురిడి కొట్టిస్తే.. భూషణ్ స్టీల్ అండ్ పవర్ సంస్థ బ్యాంకులకే శఠగోపం పెట్టేస్తున్నది.
నకిలీ పత్రాలతో రుణాలు పొంది ఇతర ఖాతాల ద్వారా దారి మళ్లించారని అలహాబాద్ బ్యాంక్ ఆడిటింగ్ సమీక్షలో తేలింది. ఏతావాతా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేలకోట్ల రూపాయల విలువైన కుంభకోణాలు కలకలం రేపుతున్నాయి.
తాజాగా అలహాబాద్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దివాలా తీసిన భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ (బీపీఎస్ఎల్) రూ .1,774.82 కోట్ల మేరకు ముంచేసిందంటూ అలహాబాద్ బ్యాంక్ శనివారం ప్రకటించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరువాత, అలహాబాద్ బ్యాంకులో భూషణ స్టీల్ కంపెనీ రుణాల పేరిట ఇంత పెద్ద భారీ కుంభకోణానికి పాల్పడటం బ్యాంకింగ్ వర్గాలను విస్మయ పర్చింది. ఫోరెన్సిక్ ఆడిట్ దర్యాప్తు ఫలితాలతో ఈ స్కాంను గుర్తించామని రెగ్యులేటరీ సమాచారంలో అలహాబాద్ బ్యాంకు వెల్లడించింది. దీంతో సుమోటో ప్రాతిపదికన కంపెనీ, దాని డైరెక్టర్లపై కేసు నమోదు చేశామని పేర్కొంది. అక్రమంగా నిధులను మళ్లించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అలహాబాద్ బ్యాంక్ నివేదించింది.
ఇప్పటికే రూ. 900.20 కోట్ల కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వ బ్యాంకు తెలిపింది. ఖాతాల పుస్తకాలను తారుమారు చేసి, అక్రమ పద్ధతుల్లో బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసి కన్సార్షియం బ్యాంకులను భూషణ్ స్టీల్ అండ్ పవర్ సంస్థ మోసగించినట్లు గుర్తించినట్టు తెలిపింది.
కాగా దాదాపు రూ. 3,805.15 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు ఇటీవల పీఎన్‌బీ వెల్లడించింది. ప్రస్తుతం దివాలా తీసిన బీపీఎస్‌ఎల్ కేసు విచారణ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో తుది దశలో ఉందని, ఈ ఖాతా నుంచి పెద్ద మొత్తమే రాబట్టుకోగలమని ఆశిస్తున్నామని పీఎన్‌బీ ప్రకటించిన సంగతి తెలిసిందే.