Health

వైద్యుల నర్సుల కొరత భారతదేశాన్ని వేధిస్తోంది

Indian Vice President Expresses Concern Over Lack Of Doctors And Nurses In India

భారతదేశం నిపుణులైన వైద్యుల కొరత సమస్యను ఎదుర్కొంటోందని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. చెన్నైలో ఆదివారం ఒక ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఆరు లక్షల నిపుణులైన వైద్యులు, రెండు మిలియన్ల నర్సుల కొరత ఉందని అన్నారు. ఈ పరిస్థితులను మనం కొనసాగనివ్వకూడదని అభిప్రాయపడ్డారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతల్లో సరైన వైద్య సౌకర్యాలు లేవని తెలిపారు. దేశం ఇప్పటికీ ఆరోగ్య సంరక్షణ పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. దేశంలో ఎన్నో ఇన్ఫెక్షన్‌ వ్యాధులను దరిచేరకుండా చేసినప్పటికీ సరిపోని వైద్యులు, గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో లేని సౌకర్యాల కారణంగా సవాళ్లు ఎదుర్కొనవలసి వస్తుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య సంరక్షణ కోసం పథకాలు తీసుకురావాలని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ విషయంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఉన్న అంతరాలను తొలగించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులు ఏర్పాటుచేసి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలిపారు.