Sports

జడేజా ఏడుపు ఆపతరం కాలేదు

Ravindra Jadeja Couldnt Be Pacified Says His Wife

న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా ఓటమి తర్వాత రవీంద్రజడేజాను ఓదార్చలేకపోయానని అతడి భార్య రివాబ తెలిపారు. మ్యాచ్‌ తర్వాత అతడు చాలా బాధపడ్డాడని ఆమె వెల్లడించారు. ఒకవేళ తాను ఔటవ్వకపోయుంటే కచ్చితంగా గెలిచేవాళ్లమని తనతో పేర్కొన్నాడని ఆమె ఓ మీడియాతో పేర్కొన్నారు. ‘ఒకసారి తన ప్రయాణాన్ని చూస్తే.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా మంచి ప్రదర్శన చేశాడు. కీలక సమయంలో వికెట్లు తీయడంతో పాటు జట్టుకు అవసరమైన పరుగులు అందించాడు’ అని ఆమె చెప్పారు. అలాగే 2013 ఐసీసీ ఛాంపియన్స్‌ట్రోఫీ ఫైనల్స్‌లో జడేజా మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడని, ఆ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడని రివాబ గుర్తుచేశారు. కాగా కివీస్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో జడేజా ఆద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే. దాదాపు మ్యాచ్‌ని గెలిపించినంత పనిచేసి న్యూజిలాండ్‌కు చెమటలు పట్టించాడు. టీమిండియా 92/6తో ఉండగా క్రీజులోకి అడుగుపెట్టిన అతడు ధోనీతో కలిసి ఏడో వికెట్‌కు 116 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. కీలక సమయంలో వికెట్‌ కోల్పోవడంతో తర్వాత భారత జట్టు 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.