ధర్మపోరాట దీక్షల పేరుతో టీడీపీ ప్రభుత్వం అధర్మ పోరాటం చేసిందని మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి చెప్పారు. ఏపీకి మోడీ చేసినంత సహాయం ఎవరూ కూడ చేయలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆదివారం నాడు విజయవాడలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీలో చేరిన తర్వాత సుజనా చౌదరి తొలిసారిగా విజయవాడకు వచ్చారు.
ఇప్పటివరకు తాను పరోక్ష రాజకీయాల్లోనే ఉన్నానని ఆయన చెప్పారు. బీజేపీలో చేరిన తర్వాత తాను ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అంటూ తానే మొదటగా చెప్పానని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీకి ఆనాడు ఒప్పుకొన్నట్టుగా ఆయన వివరించారు.
రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షం కానుందన్నారు. ఈ మేరకు తాను తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. టీడీపీ నుండి తాను ఎవరిని లాగాల్సిన అవసరం లేదన్నారు. మోడీ, అమిత్ షాలను చూసి పలువురు బీజేపీలో చేరుతున్నారని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. గత చరిత్ర గురించి తాను ఏమీ మాట్లాడనని ఆయన స్పష్టం చేశారు.