సిరి కోసం శ్రీలక్ష్మిని కొలిచే వాళ్లుంటారు. చదువు కోసం సరస్వతీదేవిని ఆరాధించే వాళ్లనూ చూస్తాం. వీసా కోసం విమానాలను పూజించే వాళ్లను చూడాలని ఉందా! అయితే పంజాబ్లోని తల్హాన్కు వెళ్లాల్సిందే. జలంధర్ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఊరు. అక్కడో గురుద్వార ఉంది. దాని పేరు హవాయి జహాజ్ గురుద్వార. అంటే విమానాలయం. ఈ గుడిలో విమానాల బొమ్మలకు పూజలు చేస్తారు. భక్తులు ఆ బొమ్మలనే కానుకలుగా సమర్పిస్తారు. ప్రసాదంగా విమానం బొమ్మలనే అందుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం లభించాలనీ, వీసా త్వరగా రావాలనీ కోరుతూ భక్తులు గురుద్వారకు క్యూ కడతారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులే ఉంటారు. వీసా పత్రాలతో వచ్చి మరీ విమానాలతో ముడుపులు కడతారు. గురుద్వార పరిసరాల్లో విమానం బొమ్మల దుకాణాలు బోలెడుంటాయి. ‘మొదట ఎవరు పూజించారో తెలియదు కానీ, భక్తుల విశ్వాసం కాదనలేక ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామ’ని గురుద్వార నిర్వాహకులు చెబుతున్నారు.
విమానాలను కొలిచే దేవాలయం జలంధర్‌లో ఉంది
Related tags :