Movies

అవహేళన సాధారణం అయిపోయింది

Chinmayi Shares Her Emotions Via Twitter

ఇంటా బయట మహిళలకు ఎదురవుతున్న అవమానాలను దీటు ఎదుర్కోవాలని, సామాజిక కట్టుబాట్లను తెంచుకుని బయటకు రావాలని గాయకురాలు చిన్మయి శ్రీపాద అన్నారు. గాయకురాలిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాలకు పనిచేశారు. ‘మీ టూ’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిన సందర్భంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ఎదుట వెల్లడించి, ధైర్యంగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఎదురవుతున్న అవమానాలపై వరుస ట్వీట్లు చేశారు. వాటిని దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ‘‘మనలో చాలా మందికి తిట్లు ఇంటి నుంచే మొదలవుతాయి. క్రమశిక్షణ పేరుతో తల్లిదండ్రులు, స్కూల్‌లో ఉపాధ్యాయులు మనల్ని తిడుతూనే ఉంటారు. అలా తిట్లు తినడం మనకు అలవాటైపోతుంది. అందులో అమ్మాయి, అబ్బాయి అన్న భేదం ఉండదు. ఇక ఒక మహిళ మొదటిసారిగా అవమానానికి గురయ్యేది ఇంట్లోనే. కంటికి కాజల్‌ పెట్టుకోవడం, నెయిల్‌ పాలిష్‌ వేసుకోవడం, పెద్ద బొట్టు పెట్టుకోవడం ఇలా ఏది చేసినా అవహేళనగా మాట్లాడతారు. పిల్లలు పెద్దవాళ్లవుతున్న కొద్దీ వాళ్లను దండించకూడదని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు భావిస్తారు. అలాంటి అవగాహన కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నేటి కాలంలో హింస అనేది సాధారణమైపోయింది. మన ఇళ్లలోనూ ప్రేమ మరుగునపడి పోతోంది. మనల్ని తల్లిదండ్రులు దండించి ఇది ప్రేమతో చేశామని అంటారు. భర్త సైతం హింసించి అభిమానంతోనే చేశానని దాన్ని కప్పిపుచ్చుతాడు. దీంతో ఇది ఇంతేలే అని మనమూ వదిలేస్తాం. ఏదో ఒక రోజు ఒకరు అకస్మాత్తుగా దీనిపై ప్రశ్నిస్తారు. చాలా మంది ఆ పని చేయరు. జీవితాంతం తిట్లు తింటూ, నిందలు పడుతూ ఉంటాం. ప్రతి తరానికి ఇది అలవాటైపోతుంది. ఇది మారడానికి ఇంకొంత సమయం పడుతుంది’’ అని ట్వీట్‌ చేశారు.