బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. తాను బీజేపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోమవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారనే వార్తలపై స్పందించారు. బీజేపీలో తనకు ఏం పనుందని నిలదీశారు. నరేంద్ర మోదీ ఉన్నారు కదా. మోదీ ఉండగా తనను తీసుకుంటే ప్రధానమంత్రిని చేయరు కదా అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీలోకి పోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. బుర్ర ఉండేవాడెవడైనా బీజేపీలోకి పోతాడా అంటూ ఎదురు ప్రశ్నించారు. బీజేపీలో చేరతానని, టచ్ లో ఉన్నానంటూ బుర్రలేని చర్చలు వాళ్లు పెడుతుంటారని తాను బుర్రలేని ఆలోచనలు చేయబోనని తెగేసి చెప్పారు. ప్రశ్నించే గొంతుగా ప్రజలు తనను పార్లమెంటుకు పంపించారని ప్రజల తరఫున ప్రజా సమస్యలపై మాట్లాడమని, ప్రజల సమస్యలు వినిపించమని పార్లమెంటుకు పంపించారన్నారు. తెలంగాణ ప్రజల గొంతుకను పార్లమెంట్ లో వినిపిస్తానని అంతే తప్ప వేరే ఆలోచన చేయబోనని స్పష్టం చేశారు. అంతేకాదు భవిష్యత్‌లో కూడా ఇలాంటి చిల్లర మల్లర ప్రచారాలు చేస్తే నమ్మెద్దంటూ కార్యకర్తలకు హితవు పలికారు రేవంత్ రెడ్డి.
నేను ఎవరితోనూ టచ్‌లో లేను
Related tags :