Business

భారతదేశంలో నెం.1 బ్రాండ్ టాటా

TATA Still Stands As Number One Brand In India

టాటాగ్రూప్‌ 2019లో భారత్‌లోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. ఈ కీర్తి కిరీటాన్ని టాటా గతకొన్నేళ్లుగా నిలుపుకొంటూ వస్తోంది. యూకేకు చెందిన బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఆఫ్‌ ది నేషనన్స్‌ నిర్వహించిన లీడింగ్‌ 100 బ్రాండ్స్‌ సర్వే ఈ విషయాన్ని చెప్పింది. టాటాల బ్రాండ్‌ అత్యంత వేగంగా పెరిగిందని ఈ సర్వే తేల్చింది. ఈ సర్వే వివరాలను ప్రముఖ ఆంగ్ల పత్రిక బిజినెస్‌ స్టాండర్డ్‌ ప్రచురించింది. టాటాల బ్రాండ్‌ విలువ ఒక్క ఏడాదిలో 37శాతం పెరిగిందని సర్వే పేర్కొంది. 2019లో దీనివిలువ 19.55 బిలియన్‌ డాలర్లుగా తేల్చింది. గత ఏడాది 9శాతం పెరిగి 14.23 బిలియన్‌ డాలర్లుగా తేల్చింది. టాటాల తర్వాతి స్థానంలో 23శాతం వృద్ధితో ఎల్‌ఐసీ బ్రాండ్‌ విలువ 7.32 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు తెలిపింది. ఇన్ఫోసిస్‌ బ్రాండ్‌ విలువ 7.7శాతం వృద్ధితో 6.5 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎస్‌బీఐ, మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, విప్రోలు ఉన్నాయి. టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ చాలా వేగంగా బ్రాండ్‌ విలువను కోల్పోయింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 28శాతం విలువ కోల్పోయింది. మహీంద్రా గ్రూప్‌ విలువ మాత్రం భారీగా పెరిగింది. గత ఏడాది ఈ జాబితాలో 12వ స్థానంలో ఉన్న ఆ సంస్థ ఈ సారి 5వ స్థానానికి ఎగబాకడంతో బ్రాండ్‌ విలువ 5.24 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇక బ్యాంకింగ్‌ రంగానికి చెందిన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐలు తొలి 12 స్థానాల్లో చోటు దక్కించుకొన్నాయి. ఇక తొలి 100 బ్రాండ్లలో 14 స్థానాలు బ్యాంకులవే. కోటక్‌ మహీంద్రా(23), యాక్సిస్‌ (26),బీవోబీ(45),కెనరా బ్యాంక్‌(58),బీవోఐ(68)లు ఉన్నాయి.