Health

కొవ్వు కరిగించే యోగాసనాలు

These yoga poses will aid in burning and losing fat

ఊబకాయులకు పవన ముక్తాసనం ::: కొవ్వును కరిగించుకోవాలని అనుకుంటున్నారా? పవన ముక్తాసనం సాధన చెయ్యండి. పవనం అంటే గాలి. ముక్త అంటే తొలగించటం. పేగుల్లో పేరుకుపోయిన అపాన వాయువును తొలగిస్తుంది కాబట్టే దీనికి పవన ముక్తాసనం అని పేరు. రాత్రిపూట తిన్న ఆహారం జీర్ణమయ్యే క్రమంలో పుట్టుకొచ్చే వాయువు లోపల అలాగే ఉండిపోతుంది. పవన ముక్తాసనం వేస్తే ఇది బయటకు వెళ్లిపోతుంది. దీన్ని నిద్ర లేస్తూనే మంచం మీద ఉండే చేయొచ్చు. ఈ ఆసనాన్ని గర్భిణులు వేయకూడదు. ముందుగా కాళ్లు తిన్నగా చాచి, వెల్లకిలా పడుకోవాలి. ఎడమకాలును తిన్నగానే ఉంచి, కుడి మోకాలును వంచి.. రెండు చేతులతో గట్టిగా పట్టుకొని పొట్ట దగ్గరకు తేవాలి. మోకాలితో పొట్టను అదమాలి. శ్వాసను వదులుతూ తలను పైకి లేపి చుబుకాన్ని మోకాలుకు తాకించాలి. శ్వాసను వదులుతూ కాలును తిరిగి యథాస్థితికి తేవాలి. రెండో కాలుతోనూ ఇలాగే చేయాలి. తర్వాత దశలో రెండు మోకాళ్ల చుట్టూ చేతులు వేసి పొట్టను అదమాలి. శ్వాసను వదులుతూ తలను పైకి లేపి చుబుకాన్ని మోకాళ్లకు తాకించాలి. శరీరాన్ని ముందుకూ వెనక్కూ.. అలాగే కుడివైపు, ఎడమవైపు 5-10 సార్లు ఊపాలి. దీంతో ఆసనం పూర్తవుతుంది. ఇలా మూడు, నాలుగు సార్లు చేయాలి. దీన్ని వేసేటప్పుడు దృష్టిని కడుపు మీద కేంద్రీకరించాలి.

* అపాన వాయువు బయటకు వెళ్లిపోతుంది.
* మలబద్ధకం తగ్గుతుంది. కడుపు శుద్ధి అవుతుంది.
* పొట్టలో కొవ్వు కరిగి ఊబకాయం తగ్గుతుంది.
* ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది.
* మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.