Editorials

దేశాన్ని దోచుకునే వారందరికీ ఈయన కథ కనువిప్పు కావాలి

This retired airforce employee donated 97% of his property back to India

ఉద్యోగంలో ఉండగా దేశానికి సేవ చేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో సాధారణ సిపాయిగా సేవలందించాడు. సర్వీసులో ఉన్నంత వరకు దేశం కోసం సేవలందించాడు. సర్వీసు నుంచి రిటైర్ అయ్యాక కూడా దేశానికి ఏదో చేసి రుణం తీర్చుకోవాలన్న తపన ఆయన మనసుకు తట్టింది. దేశానికి ఏమిచ్చినా రుణం తీరదని భావించిన ఆయన జీవితాంతం తను కష్టపడి సంపాదించినది దేశ రక్షణ శాఖకు విరాళంగా ఇచ్చాడు. నిజమైన దేశభక్తిని చాటుకున్నాడు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా..?

*** ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చిన్న ఉద్యోగి
ఇదిగో ఫోటోలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పక్కన తెల్లచొక్కా ధరించి ఉన్న వ్యక్తి పేరు ప్రసాద్. ఒకప్పుడు భారత వైమానిక దళంలో ఎయిర్‌మెన్‌గా పనిచేశాడు. అనంతరం రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వయస్సు 74 ఏళ్లు. సర్వీసులో ఉండగా నిత్యం దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. సర్వీసును వీడాక కూడా ఆయనలో ఏదో వెలితి కనిపించింది. దేశానికి తన రుణాన్ని తీర్చుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే తను జీవితాంతం కష్టపడి సంపాదించిన రూ. 1.08 కోట్లు రక్షణశాఖకు విరాళంగా ఇచ్చాడు. ఈ విరాళాన్ని స్వయంగా రాజ్‌నాథ్ సింగ్‌ ప్రసాద్‌ను కలిసి తీసుకున్నారు.

*** దేశానికి ఏదో చేసి రుణం తీర్చుకోవాలి అనుకున్నా
ఒక సిపాయి రక్షణశాఖ కోసం విరాళం ఇవ్వడంపై మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. తను జీవితాంతం రక్షణశాఖలో పనిచేసి సంపాదించిన మొత్తాన్ని తిరిగి అదే రక్షణశాఖకు విరాళంగా ఇవ్వడాన్ని రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. ప్రస్తుతం ప్రసాద్ ఓ కోళ్లఫారం నడుపుతున్నాడు. తన కుటుంబ బాధ్యతలు నెరవేర్చాక, తన సర్వీసులో తాను సంపాదించినది దేశ భద్రతకోసం రక్షణశాఖకు విరాళంగా ఇవ్వాలని భావించినట్లు ప్రసాద్ చెప్పాడు. ఇందులో భాగంగానే రూ.1.08 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు చెప్పాడు. భారత రైల్వేలో ఉద్యోగంలో చేరకముందు 9 ఏళ్లు వైమానిక దళంలో ఉద్యోగం చేశారు. ఇక రైల్వేలో ఉద్యోగం వీడి సొంతంగా కోళ్ల ఫారం పెట్టాడు.

*** ఆస్తిలో కూతురుకు 2శాతం, భార్యకు ఒక శాతం దేశానికి 97శాతం వాటా
అంత పెద్ద మొత్తంలో డబ్బును విరాళంగా ఇవ్వడంపై కుటుంబ సభ్యులు అడ్డు చెప్పలేదా అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అడుగగా… వారంతా తనకు మద్దతుగా నిలిచారని నవ్వుతూ సమాధానం చెప్పారు ప్రసాద్. తన ఆస్తిలోనుంచి 2శాతం తన కూతురుకు ఇచ్చానని ఒక్కశాతం తన భార్యకు ఇచ్చినట్లు చెప్పిన ప్రసాద్…. మిగతా 97శాతం సమాజంకు తిరిగి ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇంటిని వదిలి వచ్చేటప్పుడు కేవలం రూ. 5 మాత్రమే తన దగ్గర ఉండేవని తన కష్టార్జితంతో 500 ఎకరాల భూమిని కొన్నట్లు చెప్పాడు ప్రసాద్. అంతేకాదు ఒలంపిక్స్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న పిల్లలకోసం ఓ స్పోర్ట్స్ క్యాంపస్‌ను కూడా ప్రసాద్ ఏర్పాటు చేశారు. తాను చిన్నతనంలో ఉన్నప్పుడు ఒలంపిక్స్‌లో మెడల్ సాధించాలనే కల కలగానే మిగిలిపోయిందని … 50 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించి అందులో పిల్లలకు గత 20 ఏళ్లుగా తర్ఫీదు ఇస్తున్నట్లు ప్రసాద్ చెప్పాడు.