జులై 14న తెలుగు అసోసియేషన్ అఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ ఆధ్వర్యంలో ఆహార ఆరోగ్య సదస్సు నిర్వహించారు. ఇండియా నుంచి ముఖ్య అతిధిగా విచ్చేసిన వీరమాచనేని రామకృష్ణారావు పాల్గొన్న ఈ సదస్సులో 250 మందికి పైగా పాల్గొన్నారు. విఆర్కె డైట్ ద్వారా ఆహార నియమాల్లో తను తీసుకువచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, ఆచరణ మరియు వాటి ఫలితాల గురించి సుమారు 5 గంటలపాటు సుదీర్ఘంగా వివరించారు. ముఖాముఖిలో భాగంగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలందించి వారి సందేహాలను నివృత్తి చేసారు. అనంతరం విఆర్కె డైట్ అనుసరిస్తున్న విరువురు తమ అనుభవాలను అందరితో పంచుకున్నారు. ముందుగా అట్లాంటా తెలుగు సంఘం అధ్యక్షులు వెంకీ గద్దె స్వాగతోపన్యాసం చేస్తూ తామా నిర్వహిస్తున్న ఉచిత క్లినిక్, స్కాలర్షిప్స్, క్రీడా పోటీలు, సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు, సిలికానాంధ్ర మనబడి, వివిధ సదస్సులు, తామా సభ్యత్వ ప్రయోజనాలు తదితర అంశాలను వివరించారు. తామా కార్యవర్గం మరియు చైర్మన్ వినయ్ మద్దినేని ఆధ్వర్యంలో బోర్డు సభ్యులు వీరమాచనేనిని వేదిక మీదకు ఆహ్వానించి సత్కరించబోగా సున్నితంగా తిరస్కరించారు. సదస్సు అనంతరం అందరికి తేనీయ విందు ఏర్పాటు చేసారు. ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్స్ ఉన్నప్పటికీ హాలు కిక్కిరిసేలా జనాలు పాల్గొనడం చూస్తుంటే ఈ మధ్య అందరూ ఆరోగ్య ఆహార నియమాలపై అమిత ఆసక్తి ప్రదర్శిస్తున్నారంటూ పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సుకు కమ్మింగ్ లోని శ్రీ కృష్ణ విలాస్ రెస్టారెంట్ ఈవెంట్ హాల్ మరియు తేనీయ విందు సమర్పించిన సతీష్ ముసునూరిని వీరమాచనేని శాలువాతో సత్కరించారు. సదస్సుకు విచ్చేసిన వీరమాచనేని కి, ఉచితంగా ఆడియో సహకారం అందించిన తామా బోర్డు సభ్యులు కమల్ సాతులూరు గైరికి, విజయవంతం చేసిన అట్లాంటా ప్రజలకు, తోటి తామా కార్యవర్గ సభ్యులు ఇన్నయ్య ఎనుముల, సుబ్బారావు మద్దాళి, సాయిరాం కారుమంచి, ఆదిత్య గాలి, సురేష్ బండారు, భరత్ అవిర్నేని, బోర్డు సభ్యులు వినయ్ మద్దినేని, రాజశేఖర్ చుండూరి, నగేష్ దొడ్డాక, మనోజ్ తాటికొండ, విజు చిలువేరు, వాలంటీర్స్ తదితరులకు తామా అధ్యక్షులు వెంకీ గద్దె ధన్యవాదాలు తెలిపారు.
అట్లాంటాలో వీరమాచినేని ఆహార ఆరోగ్య సదస్సు
Related tags :