NRI-NRT

లివర్ మోర్ ఆలయంలో భూవరాహయాగం

Yagam In Livermoore Temple California

లివర్ మోర్ ఆలయంలో భూవరాహయాగం – ఆద్యాత్మిక వార్తలు
లివర్ మోర్లోని శివ-విష్ణు ఆలయంలో ఆగస్టు 1 నుంచి 4 వరకు ‘శ్రీ భూవరాహ యాగా’న్ని నిర్వహిస్తున్నారు. జయేంద్ర సరస్వతి, స్వామి చిన్మయానంద ఆశీస్సులతో హిందూ కమ్యూనిటీ అండ్ కల్చరల్ సెంటర్ ఈ ఆలయాన్ని నిర్మించింది. 1986లో కుంభాభిషేకం, 1998, 2010లో మహా కుంభాభిషేకాలు, 2018లో అతిరుద్ర మహాయజ్ఞం, శత చండీహోమం, 2019, ఫిబ్రవరిలో పురుషసూక్త యజ్ఞాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఇప్పుడు శ్రీ భూవరాహ యాగాన్ని చేయనుంది.ఇందులో భాగంగా వేద పండితుల సమక్షంలో 5 కాలాలలో భూసూక్తం (508 సార్లు), వరాహ గాయత్రీ మంత్రం (4320 సార్లు) , వరాహ కవచం (200 సార్లు) పఠిస్తూ యాగం చేస్తారు. రోజుకొక విశేష పూజా కార్యక్రమం ఉంటుంది. విశ్వక్సేనపూజ, అకల్మష హోమం, భూమి పూజ, వాస్తు హోమం, యాగశాల ప్రవేశం, కుంభ ఆవాహనం, అగ్ని ప్రతిష్ఠాపన, అమ్మవారికి సమర్పించే నూతన స్వర్ణ కవచానికి పంచగవ్య అధివాసం, జల అధివాసం, క్షీర అధివాసం, శయనాధివాసం , చివరిగా మహా పూర్ణాహుతి, భూ దేవికి నూతన స్వర్ణ కవచధారణ కార్యక్రమంతో ఈ మహాక్రతువు సంపూర్ణం అవుతుందని నిర్వాహకులు వెల్లడించారు. శివ-విష్ణు దేవాలయంలో శ్రీ భూవరాహ యాగం నిర్వహించడం ఇదే తొలిసారి. ‘భూ వరాహ స్వామి జ్ఞాన సంపదకు ప్రతీక. ఈ యాగంలో పాల్గొన్న వారికి, స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించినా సర్వ దోషాలు నివృత్తమై మోక్షం ప్రాప్తిస్తుంది. కోర్కెలు సిద్ధిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలనుంచి స్వామి రక్షిస్తాడని భక్తుల విశ్వాసం’ అని యాగం నిర్వాహకులు వెల్లడించారు. యాగంలో భారీ సంఖ్యలో పాల్గొనాలని ప్రవాస భారతీయులకు హిందూ కమ్యూనిటీ అండ్ కల్చరల్ సెంటర్ విజ్ఞప్తి చేస్తోంది. వివరాలకు 925-449-6255 సంప్రదించాలని తెలిపింది. లేదా https://livermoretemple.org/hints/purusha-sukta-yagam/ వెబ్ సైట్ సందర్శించవచ్చని పేర్కొంది.
1. దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు
దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అన్ని సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. పుష్ప, దీపాలంకరణలతో సాయిబాబా ఆలయాలు దేదీప్యమానంగా వెలుగులీనుతున్నాయి. సాయిబాబాను దర్శించడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివస్తున్నారు. మహారాష్ట్రలో కొలువైన షిరిడీ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వరుసకట్టారు. సాయినామస్మరణతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మార్మోగుతున్నాయి.
2. శాకాంబరిగా శ్రీభద్రకాళి
వరంగల్లోని శ్రీభద్రకాళి దేవాలయంలో శాకాంబరి ఉత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు రెండు వారాల పాటు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి పూజలు చేశారు. మంగళవారం శ్రీభద్రకాళి అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి పూజారాధనలు నిర్వహించారు. చంద్రగ్రహణం దృష్ట్యా సాయంత్రం ఆలయ ద్వారాలు మూసేశారు.బుధవారం ఉదయం 11 గంటలకు గుడి ద్వారాలు తెరుస్తామని ఆలయ ప్రధానార్చకుడు శేషు వివరించారు.
3. లక్షలాది భక్తుల అప్పన్న గిరి ప్రదక్షిణ
సింహాద్రి అప్పన్న నామస్మరణతో సింహగిరి మారుమోగింది. సోమవారం లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు సింహాచలం కొండ చుట్టూ ‘గిరి ప్రదక్షిణ’ చేశారు. మంగళవారం ఆషాడ పౌర్ణమి సందర్భంగా చందన సమర్పణ కార్యక్రమానికి ముందురోజు విశాఖపట్నంలోని సింహాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ ప్రదక్షిణకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, పశ్చిమ్బెంగాల్ నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ఈసారి దాదాపు పది లక్షల మంది వస్తారన్న అంచనాతో యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉత్సవ మూర్తులతో ఉన్న పుష్పరథాన్ని విజయనగరం గజపతి వంశీయురాలు అశోక్గజపతిరాజు కుమార్తె అదితి గజపతి ప్రారంభించారు. అనంతర ప్రదక్షిణ సాగింది. ఈ ప్రదక్షిణ పొడవు 32 కిలోమీటర్లు. మంగళవారం వేకువజామున 2 గంటల నుంచి 3 గంటల వరకు అప్పన్నస్వామికి చందన సమర్పణ చేస్తారు. చంద్రగ్రహణం కావడంతో సాయంత్రం 4 గంటల తరువాత ఆలయాన్ని మూసివేస్తారు. బుధవారం ఉదయం గ్రహణ సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాక 7 గంటల నుంచి దర్శన భాగ్యం కల్పిస్తారు.
4. బ్రేక్ దర్శనాల రద్దుపై వైఖరి తెలియజేయండి
వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దుపై వైఖరి తెలియజేస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) కార్యనిర్వహణ అధికారి(ఈవో)ని హైకోర్టు ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. తితిదేలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలువరించాలని అభ్యర్థిస్తూ ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన జాగర్లమూడి వెంకటసుబ్బారావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. బ్రేక్ దర్శనాల రద్దుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తితిదే ఛైర్మన్ చెప్పిన విషయమై మీడియాలో వచ్చిన అంశాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఉమేష్చంద్ర స్పందిస్తూ.. బ్రేక్ దర్శనాల రద్దు విషయమై బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, తితిదే ఛైర్మన్ ఒక్కరే నిర్ణయం తీసుకుంటే సరిపోదన్నారు. సంబంధిత వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. వైఖరి తెలియజేస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని తితిదేను ఆదేశించింది.
5. బ్రేక్ దర్శనాలకు ప్రత్యామ్నాయం ఏంటి?
తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల విభజన రద్దుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై తితిదే కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ఎల్-1, ఎల్-2, ఎల్-3 అని మూడు రకాలుగా ఉన్నాయి. ఈ మూడు రకాల టికెట్లు ఉన్న భక్తులకు కొన్ని తేడాలతో దర్శనం భాగ్యం కల్పిస్తున్నారు. బ్రేక్ దర్శనం టికెట్లను విభజించడంపై విమర్శలువెల్లువెత్తుతున్నాయి. అందరూ రూ.500 చెల్లించి టికెట్లు కొంటున్నా… ఎల్-1 వారికి ప్రాధాన్యమిస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విభజనపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ తరుణంలో టికెట్ల విభజనను రద్దు చేయాలని తితిదే నిర్ణయించింది. నూతన విధానం ఒకటిరెండు రోజుల్లో (బుధ లేదా గురువారం) అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తితిదే అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి కూడా స్పష్టం చేశారు.
6. భద్రాచలం రామాలయం తలుపులు మూసివేత
పాక్షిక చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి తాళ్లూరి రమేష్బాబు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ తలుపులు మూసివేసి తిరిగి 17వ తేదీ తెల్లవారు జామున 5.30 నిమిషాలకు తెరిచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ నిర్వహించి, తదుపరి భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నట్లు ఈవో వెల్లడించారు.
7. 26 రోజులు.. రూ.1.13 కోట్లు
గత 26 రోజులకుగాను అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.13 కోట్లు సమకూరింది. దేవస్థానం ఛైర్మన్ ఐ.వి.రోహిత్, ఈవో ఎం.వి.సురేష్బాబు, ఆలయ సహాయ కమిషనర్ ఈరంకి జగన్నాథరావు, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ వి.లక్ష్మీనర్సింహరెడ్డి తదితరుల సమక్షంలో సోమవారం హుండీలను తెరిచి నిత్యకల్యాణ మండపంలో లెక్కించారు. రూ.1,05,48,093 నగదు, రూ.7,57,675 చిల్లర నాణేలు కలిపి మొత్తం రూ.1,13,05,768 వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. దీంతో పాటు 50 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలు, వస్తువులు వచ్చాయన్నారు. చిల్లర నాణేలను తూకం ద్వారా బ్యాంకు అధికారులకు అప్పగించారు. యూఎస్ఏ డాలర్లు 303, సింగపూర్ డాలర్లు 8, ఆస్ట్రేలియా డాలర్లు 10, బ్యాంకు ఆఫ్ ఇంగ్ల్లండ్ పౌండ్లు 40, సౌదీ అరేబియా, ఒమన్, సూడాన్, యూఏఈ, కెనడా, మలేషియా తదితర దేశాల కరెన్సీ సైతం వచ్చినట్లు అధికారులు తెలిపారు. రద్దయిన నోట్లు రూ.36 వేలు సమకూరాయి.
8. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల విభజన రద్దు
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల విభజనను రద్దు చేస్తున్నట్టు తితిదే అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో న్యాయస్థానం ఆదేశించే వరకు ఆగలేమని అన్నారు. తిరుమలలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వీఐపీ బ్రేక్ దర్శనం ఎల్-1, ఎల్-2 టికెట్ల రద్దు విషయమై రెండు రోజుల కిందటే తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డితో సమావేశమై చర్చించినట్లు వివరించారు. మంగళవారం నుంచే దీన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులను కోరానన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉన్నందున అధికారులు ఒకట్రెండురోజుల సమయం కోరినట్లు తెలిపారు. ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకు ఏ విధంగా దర్శనం చేయించాలనే విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున అమలుకు ఆలస్యం అవుతున్నట్లు వివరించారు. అమరావతిలో తన క్యాంపు కార్యాలయం ఏర్పాటును సమర్థించుకున్నారు. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ హిమాయత్నగర్లో స్వామివారి ఆలయం ఉందని, రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం అమరావతిని రాజధాని చేసి మందిరం నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. అమరావతి ఆలయ నిర్మాణం పూర్తిచేసే లోపు తాత్కాలిక కార్యాలయం ఏర్పాటుకు తాను అధికారులను ఆదేశించానని తెలిపారు. ఆ కార్యాలయం… భక్తులు టికెట్లు నమోదు చేసుకోవడానికి, ఫిర్యాదులకు సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు.
9. తెరుచుకున్న శ్రీవారి ఆలయం
చంద్రగ్రహణం తొలగి పోవడంతో తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని ఇవాళ ఉదయం ఐదు గంటలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా తెరిచారు. ఇవాళ ఉదయం 1.31 నుండి 4.29 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్ర‌హ‌ణం ఉన్న నేపథ్యంలో, గ్ర‌హ‌ణ స‌మ‌యానికి 6 గంట‌లు ముందుగా శ్రీ‌వారి ఆల‌యాన్ని మూసివేశారు. ఇవాళ ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహించారు. ఉదయం తోమాల, అర్చన, పంచాంగ శ్రవణం, కొలువులను ఏకాంతంగా స్వామి వారికి ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు ఆణివార ఆస్థానం ఆగ‌మోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వదర్శనం భక్తులను అనుమతిస్తున్నారు. ఆణివార ఆస్థానం సందర్భంగా కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆణివార ఆస్థానం పురస్కరించుకొని ఇవాళ సాయంత్రం పుష్పపల్లకిపై విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు మాలయప్పస్వామి.
10. శుభమస్తు
తేది : 17, జూలై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : పాడ్యమి
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 10 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 51 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాషాఢ
(నిన్న రాత్రి 8 గం॥ 47 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 11 గం॥ 0 ని॥ వరకు)
యోగము : విష్కంభము
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 15 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 44 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 47 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 58 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 20 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 4 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 50 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 53 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : మకరము
11. చరిత్రలో ఈ రోజు/జూలై 17 దుక్కిపాటి మధుసూదనరావు
656 : ఇస్లామీయ చరిత్ర లో తన పాత్రను ప్రముఖంగా పోషించినవారిలో ఒకడు. రాషిదూన్ ఖలీఫాలలో మూడవవాడు ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ మరణం (జ.580).
1790 : స్కాట్లాండు కు చెందిన ఆర్ధికవేత్త, తాత్వికుడు, రచయిత ఆడం స్మిత్ మరణం (జ.1723 ).
1841 : పంచ్ (Punch)అనే ప్రసిద్ధ పత్రిక తొలి సంచిక విడుదలైంది.
1917 : ప్రముఖ తెలుగు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు జననం (మ.2006).
1917 : బహుముఖ ప్రజ్ఞాశాలి, గాంధేయవాది, స్వాతంత్య్ర సమర యోధుడు, రచయిత, సంపాదకుడు మరియు కర్షకోద్యమ నిర్మాత దరువూరి వీరయ్య జననం.
1989: ఉప్పులూరి గణపతి శాస్త్రి, వేదశాస్త్రాల పరిరక్షణకు, వేదసారాన్ని ప్రచారం చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు.పద్మభూషణ్ పురస్కార గ్రహీత (జ.1889).
2009 : టాటా నానో కార్లను లక్షరూపాయలకు అందించటం ప్రారంభించారు.
12. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభించనున్నారు. సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకిపై స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు.
13. గుళ్లలోని తాబేళ్లను తరిమేస్తున్నారు
అరుదైన తాబేళ్లను రక్షించేందుకు అస్సాం అధికారులు రంగంలోకి దిగారు. గుళ్లలోని కొలనుల్లో పూజలు అందుకుంటున్న తాబేళ్లను వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. మొత్తం ఆరు రోజులపాటు ఈ డ్రైవ్‌‌ను నిర్వహించనున్నారు. తొలిదశలో సోనిట్‌‌పూర్‌‌ జిల్లాలోని నాగోన్‌‌ శివస్థాన్‌‌ గుడిలోని అరవై ఏడు తాబేళ్లను బుర్చాపోరి వైల్డ్‌‌లైఫ్‌‌ శాంక్చురీకి తరలించారు. వాటిల్లో ఇండియన్‌‌ ఫ్లాఫ్‌‌షెల్‌‌, పీకాక్‌‌ సాఫ్ట్‌‌షెల్‌‌, ఇండియన్‌‌ టెంట్‌‌, బ్రౌన్‌‌–రూఫ్డ్‌‌, బ్లాక్‌‌ సాప్ట్‌‌షెల్‌‌ జాతులకు చెందిన తాబేళ్లు ఉన్నాయి.టార్టల్‌‌ సర్వైవల్‌‌ అలియన్స్‌‌, వైల్డ్‌‌లైఫ్‌‌ డివిజన్‌‌ సహకారంతో ‘సేవ్‌‌ టార్టల్‌‌’ ఆపరేషన్‌‌ని నిర్వహిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో దాదాపు 18 ఆలయాల్లో తాబేళ్లకు పూజలు చేయడం ఆనవాయితీగా ఉంది. పిల్లలు పుట్టాలని, కెరీర్‌‌లో త్వరగా సెటిల్‌‌ కావాలని వాటికి పూజలు చేస్తుంటారు జనాలు. ఇందుకోసం గుడి కొలనులో వాటికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు ఆలయ నిర్వాహకులు. అయితే కాంక్రీట్‌‌ కొలనులో తాబేళ్లు గుడ్లు పెట్టడం, అవి వాటిని పొదగడం సాధ్యమయ్యే పని కాదు. అంతేకాదు ప్రసాదం పేరుతో వాటికి పెట్టే తిండి వల్ల తాబేళ్ల జీవితకాలం తగ్గిపోతోంది. దీంతో తాబేళ్లు అంతరించే స్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఆలయ నిర్వాహకుల్ని, భక్తుల్ని ఒప్పించి వాటిని వైల్డ్‌‌లైఫ్‌‌ శాంక్చురీకి తరలిస్తున్నారు.
14. అక్కడ బాలాజీ అంటే హనుమంతుడు
వెంకన్న స్వామికి ఉన్న చాలా పేర్లలో బాలాజీ ఒకటి. కానీ, నార్త్‌‌ ఇండియాలోని కొన్ని ఏరియాల్లో బాలాజీ అంటే హనుమంతుడు. బాల హనుమాన్‌‌ రూపంతో అంజన్నను పూజిస్తారు. కాబట్టే ‘బాలాజీ’ అనే పేరు వచ్చింది. అలాంటి ఆలయాలు చాలానే ఉన్నాయి. కానీ, రాజస్తాన్‌‌లోని మెహందీపూర్‌‌ బాలాజీ మందిర్‌‌ మాత్రం సమ్‌‌థింగ్‌‌ స్పెషల్. భూతవైద్యానికి ఫేమస్ అయిన ఈ టెంపుల్‌‌కి దేశం నలుమూలల నుంచి రోజూ వేలల్లో జనాలు తరలి వస్తుంటారు.‘దేవుడ్ని నమ్మినప్పుడు.. దెయ్యాలున్నాయన్నది కూడా నమ్మాలి’.. ఈ కొటేషన్‌‌ మెహందీపూర్‌‌ బాలాజీ టెంపుల్‌‌ గోడలపై అక్కడక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది. ఆలయం బయటే కాదు.. లోపలి ప్రాంగణంలో కూడా జనాలతో ఎప్పుడూ రద్దీ ఉంటుంది. భక్తుల హనుమాన్‌‌ చాలీసా పఠనం, బ్యాండ్‌‌ మేళాలతో ఆ గుడి ప్రాంగణం మారుమోగుతుంటుంది. ‘దెయ్యాల్ని తరిమే గుడి’ అనే పేరుండటంతో ఫారిన్‌‌ టూరిస్టులు కూడా ఆసక్తిగా ఆ గుడి గురించి తెలుసుకునేందుకు వస్తుంటారు. దీంతో టూరిజం పరంగా కూడా ఆ ప్రాంతం బాగానే డెవలప్‌‌ అయ్యింది.
*వణుకు పుడ్తది!
సాధారణంగా గుడి అంటే ప్రశాంత వాతావరణాన్ని ఊహించుకుంటాం. కానీ.. ఈ ఆలయంలో అలాంటివి ఊహించుకోవడం కష్టం. ఎందుకంటే ఇక్కడ దెయ్యాల్ని వదిలించేందుకు స్పెషల్‌‌ పూజలు జరుగుతుంటాయి. బాధితుల్ని ఓ స్పెషల్ చాంబర్‌‌లో గొలుసులతో కట్టేసి ఉంచుతారు. అరుపులు, బ్యాండ్‌‌ల సౌండ్లతో ఆ ఆలయంలో ఎప్పుడూ గోల గోలగా ఉంటుంది. పూజ సమయంలో అయ్యగారు మంత్రాలు చదవడం ప్రారంభించాక అసలు వ్యవహారం మొదలవుతుంది. హనుమాన్‌‌ చాలీసా చదువుతూ బ్యాండ్ బాజాలు వాయిస్తుంటారు కొందరు.‘సియా కే రామ్‌‌’ జపంతో ఆ ప్రాంతం దద్దరిల్లుతుంది. ఆ సౌండ్లకు అక్కడున్న అందరూ పరవశంతో డ్యాన్స్‌‌లు చేస్తూ ఊగిపోతారు. చివరికి ఎవరైతే స్పృహ తప్పి పడిపోతారో.. వాళ్లు ‘దెయ్యం బాధితులు’అని గుర్తించాలి. అర్జి, సావామణి, దర్కస్త్‌‌.. పద్ధతులు ఒకదాని వెంట జరిపి దెయ్యాన్ని వదిలిస్తారు ఇక్కడ.అంతేకాదు ఈ గుడి ఆవరణలో ఉండే నోట్‌‌ ఇంకా స్పెషల్. ‘ఎవరేం ఇచ్చినా తినకూడదు.. తాగకూడదు. అసలు కొత్తవాళ్లతో మాట్లాడకూడదు. గుడి బయటకు వచ్చాక వెనక్కి తిరిగి చూసినా నష్టమే. వీటిల్లో ఏ ఒక్కటి చేసినా దుష్టశక్తుల్ని మీ వెంట ఆహ్వానించినట్లే’ అని పెద్ద బోర్డుపై రాసి ఉంటుంది. అందుకే ఈ ఆలయ వాతావరణంలో ఎక్కువసేపు ఎవరూ ఉండలేరు.
*దేవుడికి సమర్పణ ఉండదు
గుళ్లు, మందిరాల్లో ప్రసాదాలు, దేవుళ్లకు సమర్పణలు ఉంటాయి. కానీ, వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న మెహందీపూర్‌‌ బాలాజీ టెంపుల్‌‌లో అవేం కనిపించవు. గుడి బయట కొందరు నల్లరంగు ఉండల్ని చేతిలో పెట్టి డబ్బులు అడుగుతారు. వాటిని వద్దని పడేస్తే అరిష్టం జరుగుతుందనేది జనాల భయం. అందుకే బలవంతంగా వాటిని కొంటుంటారు. అయితే అవి తినడానికి కాదు. గుడిలో హోమ గుండాల్లో పడేయడానికి. అలా చేస్తే కష్టాలు ఉండవని నమ్ముతారు.కానీ, ఈ మధ్యకాలంలో కొందరు బూందీలడ్డును ‘సంకటమోచన బాలాజీ’కి సమర్పిస్తున్నారు. అయితే అలా చేయొద్దని మైకుల్లో అయ్యవార్లు వారిస్తూనే ఉంటారు. బాల హనుమాన్‌‌ విగ్రహం కాళ్ల దగ్గర ఎప్పుడూ నీరు ప్రవహిస్తుంటుంది. అయ్యగారు ఆ నీటిని ప్రసాదంగా జనాలకు పంచుతాడు. ఆ నీటిని తాగితే మానసిక సమస్యలు దూరం అవుతాయనేది మరో నమ్మకం.
*దెయ్యాలతో పంచాయితీ!
ఈ గుడి ప్రాంగణంలో ఆకర్షించే మరో అంశం భైరవ బాబా ఆలయం, ఆ ఆలయంలో జరిగే దెయ్యాల పంచాయితీ. బాధితుడు(దెయ్యం పట్టిన వ్యక్తి) నేరస్తుడు, భైరవ బాబా జడ్జి, మధ్యలో అయ్యవారు ఉండి లాయర్‌‌లాగా వాదిస్తుంటాడు. చివరికి బాబా ఆదేశాలతో పవిత్ర జలాన్ని ఆ వ్యక్తి మీద జల్లి, అతనికి పట్టిన దెయ్యాన్ని తరిమి కొడతాడు పూజారి. అందుకు ప్రతిఫలంగా సదరు వ్యక్తి కుటుంబం భైరవ బాబాకి బియ్యం, మినపప్పు సమర్పించుకుంటుంది. ఈ తతంగం అంతా విచిత్రంగానే అనిపిస్తుంది. 2013లో జర్మనీ, నెదర్లాండ్‌‌, ఢిల్లీ ఎయిమ్స్‌‌, యూనివర్సిటీ ఆఫ్‌‌ ఢిల్లీ నుంచి కొందరు సైకియాట్రిస్ట్‌‌లు, సైంటిస్టులు ఒక గ్రూప్‌‌గా ఏర్పడి ఈ గుడి గురించి, ఇక్కడ చేసే ట్రీట్‌‌మెంట్ గురించి స్టడీ చేశారు కూడా.
*గుడి కథ
ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అడవి. శ్రీ మహంత్‌‌ జీ అనే వ్యక్తికి బాల హనుమాన్‌‌ కలలో కనిపించి తనను పూజించమని చెప్పాడట. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా విగ్రహం కనిపించిందట. దీంతో గుడి కట్టి ఆయన కుటుంబం బాలాజీకి పూజలు నిర్వహిస్తోంది. అంతేకాదు బాలాజీ విగ్రహం ‘స్వయంభు’ అని చెప్తుంటారు. గతంలో కొందరు ఈ విగ్రహాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తే.. ఎంత తవ్వినా బయటికి రాలేదనే కథ ప్రచారంలో ఉంది. ఈ ఆలయం కాంప్లెక్స్‌‌లో బాలాజీ ఆలయంతో పాటు భైరవ బాబా గుడి, అంజనా మాతా, కాళీ మాతా, పంచముఖి హనుమాన్‌‌జీ, వినాయకుడి ఆలయాలు ఉన్నాయి. నార్త్‌‌ ఇండియాలో భూతవైద్యానికి ఫేమస్‌‌గా, ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో ఉంది ఈ గుడి.
*ఇట్లా పోవచ్చు…
రాజస్తాన్‌‌ క్యాపిటల్ జైపూర్‌‌ సిటీకి 110 కిలోమీటర్ల దూరంలో దౌసా జిల్లాలో ఉంది ఈ గుడి. అయితే జైపూర్‌‌ మెయిన్ బస్టాండ్‌‌ నుంచి మెహందీపూర్‌‌ విలేజ్‌‌కి బస్సులు ఫ్రీక్వెంట్‌‌గా ఉంటాయి. రైల్‌‌, రోడ్డు, ఫ్లైట్‌‌ రూట్స్‌‌లో జైపూర్‌‌కి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మెహందీపూర్‌‌కి బస్‌‌ టికెట్‌‌ 110 రూపాయలు. బాలాజీ మోద్‌‌ చౌరస్తాలో బస్‌‌ దిగాక గుడికి డైరెక్ట్‌‌గా షేర్‌‌ ఆటోలు ఉంటాయి. పది రూపాయలకి బాలాజీ గుడి ముందు దించుతారు ఆటోవాలాలు. గుడి చుట్టుపక్కల అర కిలోమీటర్‌‌ దాకా తినడానికి ఏం దొరకదు. ఆ దూరం దాటి వెళ్తే కొన్ని హోటళ్లలో రోటీ–సేవ్‌‌ టమాటర్‌‌ సాబ్జీ, చాయ్‌‌ మాత్రం దొరుకుతుంది.
15. చంద్రగ్రహణం తొలగి పోవడంతో తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని ఇవాళ ఉదయం ఐదు గంటలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా తెరిచారు. ఇవాళ ఉదయం 1.31 నుండి 4.29 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్ర‌హ‌ణం ఉన్న నేపథ్యంలో, గ్ర‌హ‌ణ స‌మ‌యానికి 6 గంట‌లు ముందుగా శ్రీ‌వారి ఆల‌యాన్ని మూసివేశారు.ఇవాళ ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహించారు. ఉదయం తోమాల, అర్చన, పంచాంగ శ్రవణం, కొలువులను ఏకాంతంగా స్వామి వారికి ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు ఆణివార ఆస్థానం ఆగ‌మోక్తంగా నిర్వహించారు. ఆణివార ఆస్థానం సందర్భంగా కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆణివార ఆస్థానం పురస్కరించుకొని ఇవాళ సాయంత్రం పుష్పపల్లకిపై విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు మాలయప్పస్వామి.
16. తిరుమలలో వీఐపీ దర్శనాల రద్దు
టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్..విఐపి దర్శనాల ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను ఈ రోజు నుంచి పూర్తిగా రద్దు చేస్తున్నాం…రెండు మూడు రోజుల్లో సాఫ్ట్ వేర్ అప్డేట్ అనంతరం అమలులోకి తీసుకు వస్తాం..ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారికి కల్పించాల్సిన మర్యాదలు చేస్తాం…టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…ఎక్కువ మంది సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశం తో ఈ నిర్ణయం తీసుకున్నాం..రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తున్న కారణంగా అక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలనే కోరాను తప్ప…ప్రత్యేకంగా ఛైర్మన్ క్యాంపు కార్యాలయం ఏర్పాటు కు కోరలేదు…చైర్మన్ వైవి సుబ్బారెడ్డి..టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ పై విరుచుకుపడ్డ టిటిడి చైర్మన్..తండ్రీకొడుకుల్లాగా నేను,మా ముఖ్యమంత్రి దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు..దేవుడు సొమ్ము ఒక్కరూపాయి కూడా నేను తాకను…అవసరమైతే నా చేతి నుంచి పదిమందికి సహాయం చేస్తా…చైర్మన్ వైవి సుబ్బారెడ్డి..
17. లండన్ లో వైభవంగా వార్షిక బోనాలు
తెలంగాణ ఎన్నారై ఫోరం (టీఈఎన్ఎఫ్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుంచి దాదాపు 600 మంది తెలుగువారు హాజరయ్యారు. ఈ వేడుకలకు లండన్కు చెందిన రాజకీయ ప్రముఖులు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎనిమిదేళ్లుగా లండన్లో నిర్వహిస్తున్న బోనాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని వీరేంద్ర శర్మ అన్నారు. ఇంగ్లాండ్ గడ్డపై తన నియోజకవర్గంలో బోనాల పండగ నిర్వహణ, హిందూ సంప్రదాయ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవడం సంతోషకరమని మరో నేత సీమా మల్హోత్రా ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక ఛైర్మన్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. భారత్ వెలుపల మొట్టమొదటి సారిగా 2011లో బోనాలు నిర్వహించారని.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు బోనాల పండగను అత్యంత వైభవంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను వ్యాప్తి చేస్తూ అందరితో కలిసి పని చేస్తున్నామని సంస్థ ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ చెప్పారు. భారతీయ సంప్రదాయాలు, కట్టుబాట్లను మన భవిష్యత్ తరం మర్చిపోకుండా ఉండేలా మన వంతుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీఈఎన్ఎఫ్ ఉపాధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు. విదేశాల్లో పుట్టి పెరిగే భారత సంతతి పిల్లలను చిన్నతనం నుంచే భారతీయ పండుగల్లో భాగస్వాములను చేయాలని.. అప్పుడే వారు మన మూలాలు గుర్తుపెట్టుకుంటారని టీఈఎన్ఎఫ్ ఉపాధ్యక్షుడు రంగు వెంకట్ వివరించారు.బోనాల కార్యక్రమంలో భాగంగా స్థానిక లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయంలో మహిళలందరూ దుర్గా మాతకు బోనం సమర్పించి ఓడిబియ్యం సమర్పించిన తర్వాత లండన్ పుర విధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం క్రాన్ఫోర్డ్ కళాశాల ఆడిటోరియంలో పూజా కార్యక్రమాల తర్వాత మీనాక్షి అంతటి అధ్యక్షతన భరత నాట్యం, గీతాలాపన, నృత్యాలు, చిన్నారుల నాట్య ప్రదర్శన, ఆధ్యాత్మిక ప్రవచనాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. బోనాల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు సహకరించిన వారికి, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి టీఈఎన్ఎఫ్ సభ్యులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ జమ్ముల, స్వామి ఆశ, వెంకట్ ఆకుల, మహేశ్ చట్ల, బాలకృష్ణ రెడ్డి, శేషు అల్ల, నరేంద్ర వర్మ, సాయి మార్గ్, మీనాక్షి అంతటి, వాణి అనసూరి, శ్రీవాణి, సవిత, సీత, శౌరి , దివ్య, సాయి లక్ష్మి, శిరీష, అశోక్ మేడిశెట్టి, నర్సింహా రెడ్డి తిరుపరి, రాజు కొయ్యడ, రవి కూర, నరేందర్, మల్లేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.