DailyDose

నేటి అసెంబ్లీలో సవాళ్లు-ప్రతిసవాళ్లు-07/18

Andhra Assembly Shakes With Questions From YSRCP And TDP

1. వైకాపాలో వాటాల బాగోతం మొదలైంది: తెదేపా
వైకాపా ప్రభుత్వంలో వాటాల బాగోతం అప్పుడే మొదలైందని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. ఇసుక కోసం వైకాపాకు చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కొట్టుకునే పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెదేపా ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, గుమ్మడి సంధ్యారాణితో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద రాజేంద్రప్రసాద్‌ మాట్లాడారు. మంత్రి అనిల్ యాదవ్‌ తన రౌడీయిజాన్ని నెల్లూరులో చూపించుకోవాలని రాజేంద్రప్రసాద్‌ హితవు పలికారు. మండలిలో విధి విధానాలు లేకుండా మంత్రులు వ్యవహరిస్తున్నారని బచ్చుల అర్జునుడు విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేలు రౌడీల మాదిరిగా మండలిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
2.అది భవిష్యత్‌కు ప్రమాదకరం: అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నదులన్నీ అనుసంధానిస్తే..ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వొచ్చునని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నుంచి నీళ్లు తేవాలనుకోవడం సరికాదని, భవిష్యత్‌కు ప్రమాదకరంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 45 రోజులైనా ఒక్క ప్రాజెక్ట్‌కు రివర్స్‌ టెండరింగ్‌ చేయలేదని విమర్శించారు. తాను అప్రజాస్వామికంగా ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. తెలంగాణ వల్ల ఏపీ రాష్ట్రానికి ఒక్క పైసా లాభం జరగలేదని, అన్నీ తెలంగాణకే రాసిచ్చారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
3.పక్క రాష్ట్రాలతో వైసీపీ ప్రభుత్వం బాగుందని..: బుగ్గన
పక్క రాష్ట్రాలతో వైసీపీ ప్రభుత్వం సఖ్యతగా ఉండడంతో టీడీపీ నేతలు బాధపడుతున్నారని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ నదులు అనుసంధానిస్తే నీళ్లొస్తాయని అందరికీ తెలుసిన విషయమేనని అన్నారు. ఆనాడు ఓటుకు నోటు కేసులో పట్టుబడి.. రాత్రికి రాత్రే హైదరాబాద్‌ను విడిచి వచ్చారని మంత్రి ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు మనకు హైదరాబాద్‌ రాజధానిగా ఉందని బుగ్గన అన్నారు.
4.ఆయన నీతి సూక్తులు మేం వినాలా: మంత్రి అనిల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాజెక్టులు, నదుల అనుసంధానంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య చర్చ వాడిగా వేడిగా సాగింది. రాష్ట్రంలోని నదులన్నీ అనుసంధానిస్తే..ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వొచ్చునని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నుంచి నీళ్లు తేవాలనుకోవడం సరికాదని, భవిష్యత్‌కు ప్రమాదకరంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 45 రోజులైనా ఒక్క ప్రాజెక్ట్‌కు రివర్స్‌ టెండరింగ్‌ చేయలేదని విమర్శించారు.
అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యాలపై స్పందించిన ఇరిగేషన్‌ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ అచ్చెన్నాయుడు చెప్పే నీతి సూక్తులు మేం వినాలా? అంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టులకు సంబంధించి గత నెల 14న ప్రాజెక్టుల నిర్మాణాలను 45లపాటు నిలిపివేస్తామని ప్రకటించామని ఈ రోజుకు 33 రోజులయిందని.. తాము పెట్టిన గడువు పూర్తి కాలేదని, అప్పుడే ప్రతిపక్షానికి ఇంత తొందర ఎందుకని మంత్రి అన్నారు.
5. సీఎం జగన్‌పై లోకేష్‌ అనుచిత వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ అనుచిత వాఖ్యలు చేశారు. సభలో లేని ముఖ్యమంత్రిపై లోకేష్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఆదిమూలపు సురేష్‌ తీవ్రంగా ఖండించారు. సభలోలేని వ్యక్తుల గురించి అనవసరమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్‌కు మాతృభాషలో ట్రైనింగ్‌ ఇప్పించాల్సిన అవసరం ఉందని అనిల్‌కుమార్‌ అన్నారు.
6. చంద్రబాబుపై సెటైర్లు.. సభలో నవ్వులు..!
శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కృష్ణానది కరకట్టపై వెలిసిన అక్రమ కట్టడాల కూల్చివేతపై గురువారం సభలో వాడీవేడీ చర్చ జరిగింది. అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటున్న చంద్రబాబు తప్పును ఒప్పుకోకుండా చర్చను పక్కదారి పట్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ‘చట్టాలను ఎన్నటికీ అతిక్రమించను. సభాసంప్రదాయాలు పాటిస్తాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పోరాటం చేస్తాను’ అని చంద్రబాబు వ్యాఖ్యానించడంపట్ల అంబటి చురకలంటించారు.
7. అక్రమ కట్టడాలను తొలగిస్తే చర్చ ఎందుకు?-సీఎం జగన్‌
ప్రజావేదిక భవనాన్ని అక్రమంగా కట్టారని, తొలగిస్తే ప్రశ్నిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మండిపడ్డారు. చట్టాలను ఉల్లంఘించి కట్టిన దానిని తొలగిస్తే దానిపై ప్రత్యేకంగా చర్చ ఎందుకని ప్రశ్నించారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో అక్రమకట్టడాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ..వివిధ రాష్ట్రాల్లో వరదలు వచ్చి ఇళ్లు కూలిపోవడం ఇటీవల చూస్తున్నామని, నీరు పారే మార్గానికి అడ్డుకట్ట వేస్తే మరో మార్గంలో ప్రవహిస్తుందని, అందువల్ల భవనాలు మునిగిపోయే ప్రమాదముందని చెప్పారు. చంద్రబాబు అక్రమ నివాసం పక్కేనే ప్రజావేదిక కట్టారని, నది పక్కన ఇళ్లు నిర్మించాలంటే రివర్‌కన్జర్వేటర్‌కు మాత్రమే అనుమతివ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ గత సెప్టెంబర్ 2017న రాసిన లేఖను అసెంబ్లీలో ప్రదర్శించారు.అంతకుముందు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నదికి, కరకట్టకు మధ్య చిన్న మొక్క నాటడానికి కూడా వీల్లేదన్నారు. 1885లో రివర్‌ కన్జర్వేషన్‌ చట్టంలో ఇదే చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికీ అక్రమంగా నిర్మించిన ఇంట్లోనే ఉంటానని చంద్రబాబు చెప్పడం సమంజసమా?అని ఆళ్ల ప్రశ్నించారు. చట్టానికి లోబడి తాను ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని చంద్రబాబును కోరారు. 4 రేకులు, 2 ఇటుకలు, ఒక గోడ తప్ప ఏమీలేని షెడ్డును కూల్చేస్తే రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు.