ScienceAndTech

మీ గొంతు ద్వారా మనోవేదన గుర్తించవచ్చు

Now it is possible to detect your depression via your voice

ప్రపంచం మొత్తం మీద తీవ్ర మనోవేదనకు కుంగుబాటుకు గురయ్యే దేశాల్లో భారత్ ఆరోదేశం. 56 మిలియన్ మంది తీవ్ర మనోవేదనకు గురవుతుండగా, తీరని విచారంతో కుంగుబాటుకు గురయ్యే వారు 38 మిలియన్ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మనోవేదనను ముందుగా గుర్తించడానికి సహకరించే సాంకేతిక వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి కృత్రిమ మేథోపరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ కృత్రిమ మేథో పరిజ్ఞానం మనిషి కంఠస్వరాన్ని లోతుగా విశ్లేషించి ఆ వ్యక్తి తీవ్ర మనోవేదనతో ఉన్నాడో లేదో తేల్చి చెప్పగలుగుతుంది.కెనడా లోని యూనివర్శిటీ ఆఫ్ ఆల్‌బెర్టా కంప్యూటింగ్ సైన్స్ పరిశోధకులు కంఠస్వరాన్ని బట్టి మనిషి మనోవేదనను గుర్తించే సాంకేతిక వ్యవస్థను రూపొందించ గలిగారు. పరిశోధకులు మష్రూరా తస్నిమ్, ప్రొఫెసర్ ఎలెనీ స్ట్రౌలియా గత అధ్యయనం ఆధారం చేసుకుని ప్రస్తుత అధ్యయనం సాగించారు. గత పరిశోధన మన కంఠస్వరం నాణ్యత మనం ఏ స్థితిలో ఉన్నామో చెప్పగలుగుతుందని వివరించింది.ఇదివరకటి వాటికి భిన్నంగా సరైన స్థిరమైన ప్రమాణాలు రూపొందించి ఒక విధానాన్ని ఏర్పరిచారు. దాంతో అనేక యాంత్రిక సాంకేతిక పరిజ్ణానాలను అనుసంధానించి గొంతు బట్టి మనోవేదనను కచ్చితంగా అంచనా వేయగలిగే పద్ధతిని కనుగొన్నారు. జనం సహజంగా మాట్లాడే కంఠస్వర నమూనాలను సేకరించ గల యాప్‌ను తయారు చేశారు. దీన్ని ఉపయోగించే వ్యక్తి ఫోను ద్వారా ఈ యాప్ పనిచేస్తుంది. అది ఆయా వ్యక్తుల మనోభావాల సంకేతాలను గ్రహిస్తుంది.