Movies

20ఏళ్ల అభిమానానికి కృతజ్ఞతలు

Pop Singer Smitha Recalls Her 20 Years Experiences And Thanks Audience

‘‘గాయనిగా, నాట్యకళాకారిణిగా నా ప్రయాణం ప్రారంభించి ఇరవై ఏళ్లు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో ఆనందంగా ఉంది. నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన ప్రతి ఒక్కరినీ గుర్తు చేసుకోవాలనుకుంటున్నా’’ అని పాప్ సింగర్ స్మిత అన్నారు. ఆమె సంగీత, నృత్య ప్రయాణానికి సంబంధించిన వేడుక ఈ నెల 22న హైదరాబాద్లో జరగనుంది. ఈ సందర్భంగా స్మిత మాట్లాడుతూ ‘‘నేను 1996లో ‘పాడుతా తీయగా’లో మైక్ పట్టుకున్న క్షణం నుంచి ఇప్పటివరకూ అదే ఉత్సాహం, హుషారు నాలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఇండీపాప్ సింగర్ని నేనే అయినందుకు గర్వంగా ఉంది. ఇరవై ఏళ్లలో 12 ఆల్బమ్స్, 17 మ్యూజికల్ వీడియోలు చేశా. వందకు పైగా పాటలు పాడా. వివిధ దేశాల్లో 200 సంగీత విభావరులు చేశా. ఇవన్నీ జీవితంలో ఎప్పటికీ మరచిపోని తీపి అనుభూతులే. ఈ నెల 22న నిర్వహించనున్న వేడుకలో నా లక్ష్యాలను వివరిస్తా. కళకు నేను ఇవ్వాలనుకుంటున్న గౌరవమిది’’ అన్నారు.