ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్.. ఇండోనేసియా ఓపెన్‌లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల తొలి రౌండ్‌లో ఐదో సీడ్ సింధు 11-–21, 21–-15, 21–-15తో అయా ఒహ్రీ (జపాన్)పై పోరాడి గెలిచింది. 59 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ప్రారంభంలో అనవసర తప్పిదాలు చేయడంతో ఫస్ట్ గేమ్‌లో 0-–5తో వెనకబడింది. అదే ఊపుతో స్మాష్‌లు, నెట్ గేమ్‌తో సత్తా చాటిన ఒహ్రీ అలవోకగా తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో వ్యూహం మార్చిన సింధు నెమ్మదిగా బేస్‌లైన్ గేమ్‌తో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. వరుస పాయింట్లతో ఒహ్రీపై ఒత్తిడి పెంచుతూ చివరి రెండు గేమ్‌లను సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఒహ్రీపై తన రికార్డును సింధు 7-–0కు పెంచుకుంది. పురుషుల సింగిల్స్ ఫస్ట్ రౌండ్‌లో శ్రీకాంత్ 21–14, 21–13తో కెంటా నిషిమోటో(జపాన్)పై నెగ్గి రెండోరౌండ్‌లోకి అడుగుపెట్టాడు. 38 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన శ్రీకాంత్‌కు నిషిమోటోపై ఇది ఐదో విజయం. దీంతో ఓవరాల్ రికార్డ్‌ను 5– 1కి మెరుగుపర్చుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 15–21, 21–13, 10–21తో వాంగ్ వింగ్ కి విన్సెంట్(హాంగ్‌కాంగ్) చేతిలో, హెచ్‌ఎస్ ప్రణయ్ 21–19, 18–21, 20–22తో షీయుకీ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాయిరాజ్– అశ్విని జోడి13–21, 11–21తో విన్నీ కాండో–టొంటోవి అహ్మద్ (ఇండోనేసియా ) చేతిలో, మను అత్రి–సుమిత్ రెడ్డి 11–21, 17–21తో మిన్ చున్–చింగ్ హెంగ్ (చైనీస్‌తైపీ) చేతిలో పరాజయం చవిచూశారు.
సింధు శ్రీకాంత్ ముందంజ
Related tags :