Kids

శతృత్వంలో ధర్మం విడవకూడదు

The telugu kids story of tiger and pedestrian as said by Sita to Hanuman

రావణసంహారం అనంతరం ఆ కబురు సీతమ్మ తల్లికి చెప్పేందుకు హనుమంతుడు అశోకవనానికి చేరుతాడు. “అమ్మా ఇకపై ఈ లంకా రాజ్యాన్పి ఏలేది విభీషణుడే. రావణ సంహారం జరిగినది. మీరు ఇక్కడి నుండి బయలుదేరేముందు ఒక్క ఆఙ్ఞ ఇవ్వండి తల్లి.. మిమ్ములను ఇంతకాలం ఈ చెరలో చిత్రహింసలు పెట్టిన వీరందరిని సంహరిస్తాను”అంటాడు. అప్పుడు ఆ మహాతల్లి హనుమా! నీకు ఓ కధ చెబుతా విను. ఒకానొక కాలంలో ఓ బాటసారి అడవిగుండా వెలుతున్నాడు. ఇంతలో ఆకలిగొన్న ఓ పులి తనపైకి రాబోగా తన ప్రాణాలను అరచేతబట్టుకుని పరుగులు పెడతాడు. పులికూడా వెంబడిస్తుంది. ఇంతలో ఓ చెట్టు పైకి ఎక్కి ఆ చెట్టుకొమ్మను ఆశ్రయిస్తాడు. అయితే బాటసారి వున్న కొమ్మ పై కొమ్మలో ఓ ఎలుగుబంటి వుంటుంది. అది చూసిన పులి “ఇదిగో మిత్రమా ఆ మనిషిని కిందికి తోసేయ్.. తినేసి వెల్లిపోతాను” అంటుంది. వెంటనే ఎలుగు “ఇతడు నేను వున్న చెట్టును ఆశ్రయించాడు అంటే నన్ను ఆశ్రయించినట్టే కనుక నేను అతన్ని రక్షిస్తాను కాని కీడు చేయను” అనడంతో పులి నిరాశ చెందుతుంది. అయినా ఆ రోజంతా మనిషి దిగకపోడా అంటూ ఎదురు చూస్తుంది. రాత్రి అవుతుంది. ఎలుగు గాఢ నిద్రలో వుంది. కాని మనిషికి ప్రాణ భయం ఒకటి వుంది కాబట్టి చూసీ చూడనట్టు క్రిందనున్న పులి వైపు చూస్తాడు. పులి మెల్లగా ఇలా అంటుంది “ఇదిగో ఓ మనిషి నీకో గొప్ప అవకాశం. పైన నిద్రలో వున్న ఆ ఎలుగును తోసెయ్ నేను నా ఆకలి తీర్చుకుని ఇక్కడి నుండి వెళ్లిపోతాను” అంటుంది. అంతే మనిషి మారు ఆలోచన చేయకుండా ఎలుగును తోసేస్తాడు. వెంటనే కోలుకుని ఎలుగు వేరొక కొమ్మను ఆనుకుని కింద పడకుండా ఆపుకుంటుంది. అప్పుడు పులి.. ఎలుగుతో ఇలా అంటుంది “చూశావా ఈ మనిషి బుధ్ది ఇప్పటికైనా వాడ్ని తోసెయ్ నేను తినెల్లిపోతాను” అంటుంది. అప్పుడు ఎలుగు ఇలా అంటుంది “చూడు మిత్రమా.. ఇతడు నన్ను ఆశ్రయించాడు. ఇతడిని రక్షించడం.., అపకారికి కూడా ఉపకారము చేయడమే ధర్మం” అంటూ అనడంతో ఇక లాభం లేదని పులి అక్కడినుండి వెల్లిపోతుంది. కనుక హనుమా మనకు వీరు అపకారము తలపెట్టారు కదా అని ఇప్పుడు బలహీనులయిన ఈ జాతికి హాని చెయ్యటం అక్కర్లేని పని మరియు అధర్మం కూడాను అనడంతో… అమ్మ మాటలకు ముగ్ధడయిన హనుమ మోకరిల్లి నమస్కరిస్తాడు.శత్రువులో కూడా శతృత్వాన్ని ఎంతవరకో అంతవరకే చూడాలి కాని ధర్మాన్ని వీడకూడదన్నది అమ్మ మాట. అందుకే అమ్మ మాట ఆచరిద్దాం.