DailyDose

ఎన్నారై చల్లా మధుకు కీలక పదవి-తాజావార్తలు–07/18

YSRCP NRI Challa Madhu Gets New Post-Daily Breaking News-July182019

* చల్లా మధును ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ చైర్మన్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించినట్లు సమాచారం. చల్లా మధుగా వైసీపీ శ్రేణులందరకూ చిరపరిచితుడైన చల్లా మధుసూదన్ రెడ్డి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి క్షేత్ర స్థాయిలో సంస్థాగతంగా పార్టీ బలపడడానికి ఎంతో కష్టపడ్డారు. పార్టీ నిర్మాణంలో క్రియాశీలంగా ఎంతగానో కృషి చేశారు.అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో ఉంటూ…. పార్టీకోసం హైదరాబాద్ వచ్చేసి పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటూ, జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడిగా, ఆయన ఆశయాలకు కార్యరూపం ఇస్తూ పార్టీలో పనిచేసిన చల్లా మధుకు ఈ అవకాశం లభించడం పట్ల పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
*సాంకేతిక సమస్యలతో ఇటీవల నిలిచిపోయిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఈనెల 22న నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జీఎస్ఎల్వీ-మార్క్3ఎం1 ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి పంపేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈనెల 15వ తేదీ వేకువ జామున చంద్రయాన్-2 ప్రయోగానికి 56 నిమిషాల ముందు… క్రయోజనిక్ ఇంజిన్ ట్యాంకర్లోని ప్రెజర్ బాటిల్లో లీకేజీ ఏర్పడటంతో ప్రయోగాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నానికి ఇంధనాన్ని వాహకనౌక నుంచి తీసేశారు. తమిళనాడులోని మహేంద్రగిరి ఎల్పీఎస్సీ కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు వాహకనౌకను తమ అధీనంలోకి తీసుకుని అప్పటి నుంచి వివిధ రకాల పరీక్షలు చేపట్టారు. క్రయోజనిక్ ఇంజిన్ ట్యాంకర్లో ప్రెజర్ బాటిల్ లీకేజీ వల్లే 30 నుంచి 320 బార్లు ఉన్న పీడనం 290కు పడిపోయినట్లు గుర్తించారు. ఆ సమస్యను అధిగమించే చర్యలు చేపట్టారు. ఈ లోపాన్ని ప్రయోగ వేదికపైనే సరిచేసే వీలుండటంతో ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. వాహకనౌకను రెండు రోజుల వ్యవధిలో లోపరహితంగా సిద్ధం చేసే వీలుంది. ఈ నేపథ్యంలో ఈనెల 20న రాకెట్ సన్నద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. అనంతరం ఆదివారం సాయంత్రం 6.43 గంటల నుంచి కౌంట్డౌన్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. 20 గంటల పాటు కౌంట్డౌన్ ప్రక్రియ నిర్వహించాక… జీఎస్ఎల్వీ-మార్క్3ఎం1 సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు నింగిలోకి చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని తీసుకెళ్లనుందని చెబుతున్నారు.
* 24న ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11:30 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 23న భువనేశ్వర్ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకొని వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం విజయవాడ చేరుకుంటారు. విజయవాడలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయాన్ని రాజ్భవన్గా ఖరారు చేస్తూ ప్రభుత్వం ప్రకటన (నోటిఫికేషన్) జారీ చేయనుంది. భవనంలో మొదటి అంతస్తుని గవర్నర్ నివాసం కోసం, కింది భాగాన్ని కార్యాలయ నిర్వహణకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. గత రెండు రోజులుగా భవనంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి కొత్తగా పలు సదుపాయాలు కల్పించారు.
*ఆగ‌స్టు 2 నుంచి అయోధ్య కేసులో తుది విచార‌ణ‌
అయోధ్య భూవివాద కేసులో మ‌ధ్య‌వ‌ర్తుల క‌మిటీ ఇవాళ నివేదిక‌ను సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించింది. మ‌ధ్య‌వ‌ర్తుల క‌మిటీ చైర్మ‌న్ జ‌స్టిస్ ఖ‌లీఫుల్లా నివేదిక‌ను కోర్టుకు స‌మ‌ర్పించిన‌ట్లు చీఫ్ జ‌స్టిస్ గ‌గోయ్ తెలిపారు. ఇక అయోధ్య కేసులో తుది విచార‌ణ ఆగ‌స్టు 2వ తేదీ నుంచి జ‌రుగుతుంద‌ని కోర్టు ఇవాళ పేర్కొన్న‌ది. జూలై 31వ తేదీలోగా ఈ కేసుకు సంబంధించి వివిధ వ‌ర్గాల అభిప్రాయాల‌ను వెల్ల‌డించాల‌ని కోర్టు చెప్పింది. మ‌ధ్య‌వ‌ర్తులు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించాల‌ని జూలై 11వ తేదీన చీఫ్ జ‌స్టిస్ నేతృత్వంలోని అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఆదేశించిన విష‌యం తెలిసిందే.
* తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్, శాస్త్రీయ నృత్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్, నృత్యకారులు జతిన్ గోస్వామి, శాస్త్రవేత్త కె.కల్యాణసుందరం పిళ్లై సంగీత నాటక అకాడమీ ఫెలోలుగా ఎంపికయ్యారు. 2018 సంవత్సరానికి అకాడమీ జనరల్ కౌన్సిల్ విభిన్న రంగాలకు చెందిన 44 మంది కళాకారులను పురస్కారాలకు ఎంపిక చేసింది. దివాన్సింగ్ బజేలి, పురు దధీచ్లు ఓవరాల్ కంట్రిబ్యూషన్/ స్కాలర్షిప్ విభాగంలో ఎంపికయ్యారు. ఈ పురస్కారాలను ఓ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి అందజేయనున్నారు. అకాడమీ ఫెలో గౌరవానికి రూ.3 లక్షల నగదు బహుమతి, పురస్కార విజేతలకు రూ.లక్ష బహుమతి, తామ్రపత్రం, అంగవస్త్రం అందజేస్తారు.
*అసోంను ఎడతెగని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరద ప్రవాహాలు పోటెత్తడంతో కజిరంగా జాతీయ పార్కు మొత్తం అస్తవస్తం అయింది. జంతు జీవనానికి తీవ్ర విఘాతం ఏర్పడింది. ఇప్పటికే పలు జంతువులు మృతిచెందగా ఎన్నో జంతువులు ఆవాసాల్ని కోల్పోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వరదల కారణంగా నిరాశ్రయం చెందిన పలు జంతువులు సమీప ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. ఈ క్రమంలో భాగంగానే రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ఓ ఇంట్లోకి ప్రవేశించింది. అలసిన శరీరంతో బెడ్‌పై సేదతీరింది. గదిలో పులి ఉండటాన్ని గమనించిన ఇంటి యజమాని ఆశ్చర్యానికి గురయ్యాడు. వరదల కారణంగా జంతువులు ఏ విధంగా ఆహారానికి ఇబ్బందులు పడుతున్నాయో ఈ ఘటన ఊదాహరణ అని నెటిజన్లు పేర్కొన్నారు.
*ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ ‌రెడ్డి సర్కార్‌కు షాక్ తగిలింది. గ్రీన్‌కో కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ట్రిబ్యునల్‌ స్టే ఇచ్చింది. యూనిట్‌ ధర  నుంచి రూ.కి తగ్గించాలని గ్రీన్‌కో కంపెనీకి ఏపీ ప్రభుత్వం నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ధరల నిర్ణయం రెగ్యులేటరీ పరిధిలోకి వస్తుందని గ్రీన్‌కో కంపెనీ తేల్చిచెప్పింది. రాజస్తాన్‌లో రూ.కి యూనిట్‌ ఇచ్చినంత మాత్రాన ఏపీలో అదే ధరకు ఇవ్వడం కుదరదని గ్రీన్‌కో కంపెనీ స్పష్టం చేసింది. జులై న గ్రీన్‌కో కంపెనీకి చెందిన మూడు యూనిట్లకు ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని ట్రిబ్యునల్ తప్పుబట్టింది.
*ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపింది. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు త్వరలోనే లక్షా 33 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. అటు ఆక్వారైతులకు యూనిట్ విద్యుత్‌ రూ 1.50 ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాదికి రూ. 417 కోట్లు భరించనుంది ప్రభుత్వం.
* ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతి- కాకినాడ టౌన్‌ స్టేషన్ల మధ్య 80 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు వారానికి మూడు రోజులు అందుబాటులో ఉంటాయి.
* రాష్ట్రంలో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో కొత్తగా కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి మండలాలతో కొల్లాపూర్ డివిజన్‌ను ఏర్పాటు చేయనున్నారు. జగిత్యాల జిల్లాలో కొత్తగా కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ఈ డివిజన్‌లో కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాలు ఉండనున్నాయి.
* ఇకపై రేషన్ డీలర్ లు ఉండరు.
రేషన్ డీలర్ల పై ప్రభుత్వం నిర్ణయంప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తి ప్రక్షాళన చేస్తున్నారు. ఇకపై రేషన్ సరుకులు డోర్‌ డెలివరీ చేయనుంది ప్రభుత్వం. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి నెలనెల సరుకులు సరఫరా చేస్తారు.వేలి ముద్రలు పడకపోయినా ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా రేషన్ అందచేస్తారు. ఈ కొత్త వ్యవస్థ వస్తున్న నేపథ్యంలో ఇకపై రేషన్ డీలర్లు ఉండరని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కలెక్టర్ల సమావేశంలో ప్రజాపంపిణీ అంశంపై చర్చ సందర్భంగా డీలర్లు ఉంటారా? ఉండరా? అన్న ప్రస్తావన వచ్చింది. ఇందుకు జగన్ స్పష్టత ఇచ్చారు.ప్రజాపంపిణీ వ్యవస్థ ఇకపై వాలంటీర్ల ద్వారా జరుగుతుంది కాబట్టి డీలర్లు ఉండరని స్పష్టం చేశారుపెద్ద బియ్యం సరఫరా చేయడం వల్ల ప్రజలు తిరిగి వాటిని బయట అమ్ముకుంటున్నారని… అవి తిరిగి మిల్లర్లకు చేరుతున్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కాబట్టి తినయోగ్యమైన సన్న బియ్యాన్నే సరఫరా చేస్తామని ప్రకటించారు.
* కపిల్ దేవ్ కు కీలక బాధ్యతను అప్పజెప్పింది క్రికెట్ పాలకుల కమిటి (COA). టీమిండియా కొత్త కోచ్‌ సెలక్షన్ బాధ్యతను క్రికెట్‌ పాలకుల కమిటీ (సీఓఏ) కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని తాత్కాలిక కమిటీకి అప్పగించింది. కపిల్‌ దేవ్‌ తో పాటు అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామి ఈ కమిటీలో ఉన్నారు. వీరు డిసెంబర్‌ -18లో భారత మహిళల టీమ్ కోచ్‌ గా డబ్ల్యూవీ రామన్‌ ను ఎంపిక చేశారు. ఇప్పుడు పురుషుల కోచ్‌ నూ సెలక్ట్ చేయాలని బీసీసీఐ వారిని కోరిందని తెలిసింది. అప్పటిలాగే ఈ వ్యవహారం మళ్లీ సీఓఏలో విభేదాలకు కారణం కావొచ్చని సమాచారం.ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రిని ఇంతకు ముందు గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా సంఘం ఎంపిక చేసింది. ఈ త్రయానికి పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. సచిన్‌ ఈ సమస్యను పరిష్కరించుకున్నారు. దాదా, వీవీఎస్‌ ఏదో ఒక పదవిని మాత్రమే ఎంచుకోవాలని బీసీసీఐ అంబుడ్‌్యమన్‌ ఆదేశించింది. ఈ గందరగోళంలో సలహా సంఘం బదులు కపిల్‌ కమిటీకి కోచ్‌ ఎంపిక బాధ్యత అప్పగించడం సబబుగా సీఓఏకు తోచింది. ఐతే కపిల్‌, రంగస్వామి సైతం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తున్నారు. వీరిద్దరూ బీసీసీఐ కొత్త రాజ్యంగం ప్రకారం ఆటగాళ్ల సంఘం ఏర్పాటు బాధ్యతల్లో తలమునలై ఉన్నారు.
*మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో ఏడుగురు అరెస్టు అయ్యారు. వారిలో మురుగన్ వేలూరు పురుషుల జైల్లో, అతని భార్య నళిని వేలూరు మహిళా జైల్లో ఉన్నారు. కుమార్తె వివాహ ఏర్పాట్లను చూసుకునేందుకు ఆరు నెలలు పెరోల్ కోరిన నళినికి మద్రాసు హైకోర్టు ఒక నెల పెరోల్ ఇవ్వడానికి అంగీకరించి ఉత్తర్వులు జారిచేసింది.
*అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ భారీ విజయాన్ని సాధించింది. నౌకాదళ విశ్రాంత ఉద్యోగి కుల్భూషణ్కు పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం విధించిన మరణశిక్ష నిలిచిపోయింది. మరణ దండన విధిస్తూ ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలనీ, అప్పటివరకూ శిక్ష అమలును నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) పాకిస్థాన్కు విస్పష్టం చేసింది.
*ముంబయి బాంబు దాడుల సూత్రధారి, జమాత్-ఉద్ దవా అధిపతి హఫిజ్ సయీద్ అరెస్టయ్యాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నాడన్న ఆరోపణలపై పంజాబ్ ప్రావిన్స్కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక దళం (సీటీడీ) బుధవారం అతడిని అదుపులోకి తీసుకొంది.
* తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇది మరో దుమారం. సీఐడీ అధికారులు మూడేళ్ళపాటు దర్యాప్తు అనంతరం దాఖలు చేసిన అభియోగపత్రంలో విస్మయం గొలిపే వాస్తవాలెన్నింటినో పేర్కొన్నారు.
* ఎర్రమంజిల్ భవనం సహా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ చట్టంలో నిబంధన- 13 కింద గుర్తించిన 137 చారిత్రక భవనాలకు రక్షణ ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2015లో హుడా చట్టంలో నిబంధన 13ను తొలగిస్తూ జీవో 183 జారీ చేసినప్పటికీ పాత నిబంధన ప్రకారం రక్షణ ఉంటుందని పేర్కొంది. రక్షణ నిర్ణయాన్ని రద్దు చేసే అధికారం లేదని తెలిపింది.
* కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ వ్యవహారంలో కోర్టు ధిక్కరణకు పాల్పడిన నలుగురికి జైలు శిక్ష విధిస్తూ సింగిల్ జడ్జి.. జూన్ 3న వెలువరించిన తీర్పు అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వేర్వేరు కేసుల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
* కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంపుహౌస్ వద్ద ఉన్న పంపులను ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు బుధవారం తాత్కాలికంగా నిలిపివేశారు.
* ఆదివాసీలను అడవులకు దూరం చేయవద్దని తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు ఆచార్య జయధీర్ తిరుమల్రావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కొద్ది రోజుల క్రితం భద్రాద్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో తలెత్తిన పోడు వివాదంలో నమోదైన కేసులో 12మంది ఆదివాసీలు జైలుపాలయ్యారు.
* ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. సంబంధిత కాలపట్టికను ఎంసెట్ ప్రవేశాల కమిటీ బుధవారం ప్రకటించింది. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి తుది గడువు 17 అర్ధరాత్రి 12 గంటలకు ముగిసింది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 23కు పూర్తవుతుంది. దీంతో ఈ నెల 24 నుంచి చివరి విడత కౌన్సెలింగ్ జరపాలని నిర్ణయించారు.
* తాగునీటి సరఫరా విషయంలో హైదరాబాద్కు చెన్నై మాదిరి పరిస్థితి రాదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.రెండు వారాల్లో కాళేశ్వరం నీరు ఎల్లంపల్లి రిజర్వాయర్లోకి వస్తుందని, దీని ద్వారా హైదరాబాద్కు రోజుకు 172 మిలియన్ గ్యాలన్ల నీరు అందుతుందని ఆయన బుధవారం ట్విటర్లో వెల్లడించారు.
* పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానని, త్వరలోనే ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించి, అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన తెరాస జిల్లా కార్యాలయాల ఇన్ఛార్జిల సమావేశంలో పాల్గొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పోడు భూముల సమస్యను సీఎంకి వివరించారు.
* పదోన్నతులు, వేతన పెంపు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 20న నీటిపారుదల శాఖ ఇంజినీర్ల ఆధ్వర్యంలో జలసౌధలో వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు సి.మహేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారని, అయితే నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కొందరు సీఎం ఆదేశాలనూ బేఖాతరు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
* రాష్ట్రంలో పలు కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉన్నందున బీపీఈడీ, బీఈడీ తదితర కళాశాలలకు రుసుములను నిర్ణయించే పనిలో తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నిమగ్నమైంది.
* ఈసెట్ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాది ప్రవేశాలకు 18వ తేదీ నుంచి స్పాట్ కౌన్సెలింగ్ జరగనుంది. చివరి విడత ముగిసిన తర్వాత మిగిలిపోయిన సీట్లకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. దరఖాస్తులను 18, 19 తేదీల్లో స్వీకరిస్తారు. 20వ తేదీన ఆయా కళాశాలల్లో స్పాట్ ప్రవేశాలు జరుపుతారు. పూర్తి వివరాలను 18 నుంచి tscetd.nic.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
* సాంకేతిక లోపంతో హైదరాబాద్కు వెళ్లాల్సిన విమానం రేణిగుంటలోనే నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి రేణిగుంటకు రోజూ ఉదయం 7.30 గంటలకు వచ్చే స్పైస్జెట్ విమానం బుధవారం 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది.
* పర్యాటక రంగ అభివృద్ధికి అనువుగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సచివాలయంలో బుధవారం ఆయన పర్యాటకశాఖ, పర్యాటకాభివృద్ధి సంస్థల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
* రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ డీఎస్సీ ద్వారా నియమించిన బహుళ ప్రయోజన విస్తరణాధికారుల(ఎంపీఈవో)ను నేరుగా గ్రామ సచివాలయ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎంపీఈవోల రాష్ట్రసంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో బుధవారం తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని ముప్పాళ్ళ ప్రారంభించారు.
* రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అధిక మార్కులు సాధించిన తొలి 20 శాతం మంది (టాప్ 20 పర్సంటైల్) విద్యార్థులు కేంద్ర ఉపకార వేతనాల పథకానికి (సీఎస్ఎస్ఎస్కి) ప్రాథమికంగా ఎంపికయ్యారని ఏపీ ఇంటర్ విద్యా మండలి తెలిపింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయిందని, అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 31 వరకూ నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. scholarships.gov.in వెబ్సైట్లో ఉపకారవేతనానికి దరఖాస్తు చేసుకోవాలని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 2015, 2016, 2017, 2018లలో ఎంపికైన విద్యార్థులు నవీకరించుకోవాలని అందులో సూచించింది.
* రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల వ్యవస్థను రద్దు చేయాలనే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయని..ఆ ఆలోచనను విరమించుకోవాలని రాష్ట్ర ఈ-పోస్ ఆపరేటర్ల(రేషన్ డీలర్లు) సంఘం అధ్యక్షుడు కాగిత కొండా కోరారు. బుధవారం ఉదయం విజయవాడ ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల రేషన్డీలర్ల సంఘాలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
* ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పట్టణ) బీఎల్సీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపునకు రూ.209.25 కోట్లు విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.
* రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శ పాఠశాలల్లో 2019-20 సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటనలో తెలిపింది. జూలై 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
* వైద్య రంగంలో సంస్కరణలు తెచ్చేందుకు ఏర్పాటైన కమిటీ ఈ నెల 23 నుంచి 26 వరకు విజయవాడలో భేటీ కాబోతుంది. వివిధ రంగాలకు చెందిన వారితో కమిటీ సమావేశమై అభిప్రాయాలు స్వీకరిస్తుంది. ప్రముఖ వైద్యులు, సేవా సంస్థలు, ఇతర రంగాలకు చెందిన వారితో సమావేశమవుతుంది. ఈ మేరకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకొంది.