Politics

కర్ణాటకలో ముగిసిన గవర్నర్ గడువు

Governor Deadline FInished In Karnataka Politics

కర్ణాట రాజకీయం క్షణం క్షణం ఉత్కంఠ రేపుతోంది. పూటకోమలుపులతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. విశ్వాస పరీక్షపై హైడ్రామా కొనసాగుతోంది. బలపరీక్ష నిర్వహణపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. స్పీకర్ కావాలనే చర్చను కొనసాగిస్తున్నారంటూ బీజేపీ, స్పీకర్ ను డిక్టేట్ చేసే అధికారం ఎవరికీ లేదని అధికార పార్టీలు ఇరువురు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీలో నెలకొన్న సమస్యలపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను సుప్రీంకోర్టు, గవర్నర్ లు శాసించలేరంటూ వ్యాఖ్యానించారు. చర్చ పూర్తి కాకుండా బలపరీక్ష నిర్వహించలేమని స్పీకర్ స్పష్టం చేశారు. ఇకపోతే అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వానికి ఇవాళే బలపరీక్ష నిర్వహించాలని కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా స్పీకర్ రమేష్ కుమార్‌కు సూచించారు. గవర్నర్ కార్యాలయం నుంచి అందిన సమాచారాన్ని స్పీకర్ రమేష్ కుమార్ సభకు వివరించారు. మధ్యాహ్నానికి బలపరీక్ష ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. అసెంబ్లీలో స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అనేది చెప్పాల్సిన అవసరం గవర్నర్ కు లేదంటూ కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు అభ్యంతరం తెలియజేశారు. అసెంబ్లీలో ఏం చెయ్యాలి అనే అంశంపై సర్వహక్కులు స్పీకర్ కు ఉంటాయన్నారు. చర్చ అర్థరాత్రి వరకు జరిపినా సరే బలపరీక్ష నిర్వహించాల్సిందేనని బీజేపీ శాసన సభాపక్ష నేత యడ్యూరప్ప డిమాండ్ చేశారు. సభ్యుల హడావిడి ఇలా ఉంటే మరోవైపు గవర్నర్ వాజుభాయ్ వాలా అపాయింట్మెంట్ కోరారు స్పీకర్ రమేష్ కుమార్. బలపరీక్ష నిర్వహణపై ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది