ఐటీ దిగ్గజం విప్రో లిమిటెడ్ తొలి క్వార్టర్ నికర లాభం 12.5 శాతం పెరిగి రూ. 2,388 కోట్లకు చేరింది. ఐతే, మార్చి 2019 క్వార్టర్‌తో పోలిస్తే ఆదాయం, లాభం స్వల్పంగా తగ్గాయి. జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో ఫలితాలు కొంత మెరుగ్గా ఉంటాయని విప్రో ఆశిస్తోంది. జూన్ 2019తో ముగిసిన క్వార్టర్లో కంపెనీ ఆదాయం 5.3 శాతం పెరిగి రూ. 14,761 కోట్లయింది. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో కంపెనీకి రూ. 13,988 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఇక తాజా క్వార్టర్‌కు కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే ఆదాయం 5 శాతం పెరిగి రూ. 15,567 కోట్లకు చేరింది. ఐటీ సేవల రంగం నుంచి రూ. 14,036 కోట్లు (2,038.8 మిలియన్ డాలర్లు) ఆదాయం వచ్చింది, అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఇది 4.3 శాతం అధికం.ఐటీ సేవల రంగంలో టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతో విప్రో పోటీ పడుతోంది. ఏప్రిల్–జూన్ 2019 క్వార్టర్లో ఐటీ సేవల ఆదాయం రూ. 14,085 కోట్లు (2046 మిలియన్ డాలర్లు) దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు గతంలో విప్రో వెల్లడించింది. వర్క్‌డే, కార్నర్‌స్టోన్‌లలో వాటా అమ్మేసినందున, వాటి ఆదాయాలను పరిగణించడం లేదని తెలిపింది. ఈ అంచనాలను అందుకోలేకపోయిన విప్రో రెండో క్వార్టర్లో మాత్రం మొదటి క్వార్టర్‌తో పోలిస్తే 2 శాతం లోపు వృద్ధి సాధ్యమవుతుందని భావిస్తోంది. రెండో క్వార్టర్లో ఐటీ సేవల ఆదాయం 2,030 మిలియన్ డాలర్ల నుంచి 2,080 మిలియన్ డాలర్ల దాకా ఉంటుందని అంచనా వేస్తోంది. ఐటీ సేవల రంగంలో మార్జిన్లు 18.4 శాతంగా ఉన్నాయని, ఫ్రీ క్యాష్ ఫ్లో ఆదాయంలో 98.8 శాతంగా నమోదైందని విప్రో తెలిపింది. ఈ ఏడాది కొంత స్లోగా మొదలు పెట్టాం. రాబోయే నెలల్లో మంచి ఫలితాలు రాబట్టేందుకు వీలుగా నైపుణ్యం పెంచేలా పెట్టుబడులు పెడుతున్నామని విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ వెల్లడించారు.మార్చి 2019 క్వార్టర్‌తో పోల్చినప్పుడు విప్రో నికర లాభం 3.8 శాతం తగ్గి రూ. 2,483 కోట్లకు పరిమితమైంది. ఇదే కాలానికి రెవెన్యూ 1.9 శాతం తగ్గి రూ. 15,006 కోట్లకు చేరింది. కొత్త, పెద్ద క్లయింట్లను సంపాదించేందుకు విపరీతంగా కష్టపడుతున్నట్లు కంపెనీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కిందటి వారంలో క్వార్టర్లీ ఆర్థిక ఫలితాలను ప్రకటించిన రెండు ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతో పోలిస్తే విప్రో కొంత వెనకబడినట్లే. టీసీఎస్ ఆదాయం 11.4 శాతం పెరిగి రూ. 38,172 కోట్లకు, ఇన్ఫోసిస్ ఆదాయం 14 శాతం పెరిగి రూ. 21,803 కోట్లకు పెరిగాయి. విప్రోను మూడో ప్లేస్ నుంచి వెనక్కినెట్టిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇంకా తన ఆర్థిక ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. జూన్ 2019 క్వార్టర్‌కి ఎర్నింగ్ పర్ షేర్ (ఈపీఎస్) అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 12.5 శాతం పెరిగి రూ. 3.97 కి చేరింది. విప్రో ఇటీవలే రూ. 10,500 కోట్లతో బై బ్యాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, సెబీ అనుమతి వ్చాక 323.1 మిలియన్ షేర్లను ఒక్కో షేర్‌కు రూ. 325 చొప్పున చెల్లించి బైబ్యాక్ చేయనున్నట్లు విప్రో తెలిపింది. విప్రోకి చెందిన ఐటీ ప్రొడక్ట్స్ విభాగం మార్చి క్వార్టర్లో రూ. 240 కోట్ల రెవెన్యూను, ఇండియా స్టేట్ రన్ ఎంటర్‌ప్రైజస్ విభాగం రూ. 210 కోట్ల రెవెన్యూ ఆర్జించినట్లు కూడా కంపెనీ వెల్లడించింది.ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి క్వార్టర్లో 100 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను మూడింటిని చేజిక్కించు కున్నట్లు సీఈఓ అబిదలి జే నీముచ్‌వాలా వెల్లడించారు. పెద్ద క్లయింట్లను సాధించేందుకు తగిన వ్యూహంతో అడుగులు వేస్తున్నామని చెప్పారు.
పెరిగిన విప్రో లాభాలు
Related tags :