Movies

మేము టచ్‌లోనే ఉన్నాము

Arbaaz Khan Says He Is In Touch With Malaika Arora

విడాకుల తర్వాత కూడా తన మాజీ భార్య, నటి మలైకా అరోరాతో స్నేహంగానే ఉంటున్నట్లు నటుడు, నిర్మాత అర్బాజ్‌ ఖాన్‌ తెలిపారు. 1998లో వివాహం చేసుకున్న వీరిద్దరూ 2017లో కొన్ని కారణాల వల్ల విడిపోయారు. తమ 16 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికినట్లు అధికారికంగా వెల్లడించారు. కాగా మలైకాతో బంధం గురించి అర్బాజ్‌ తాజాగా మీడియాతో మాట్లాడారు. ముందు చూపుతో ఆలోచించి, పరిస్థితులకు అనుగుణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ‘మేమిద్దరం చాలా ఏళ్లు కలిసి జీవించాం. మా మధ్య ఎన్నో అనుభూతులు ఉన్నాయి. మాకు పిల్లలు ఉన్నారు. కాబట్టి ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా ఉండలేం అనుకున్నాం. కొన్ని భిన్నాభిప్రాయాలు వచ్చాయి, విడిపోయాం. దీనర్థం మేం ఒకర్నొకరం ద్వేషించుకుంటున్నట్లు కాదు. ఇద్దరం హుందాగా పరిస్థితుల్ని చక్కదిద్దుకున్నాం. ఇప్పుడు కూడా ఆమె కుటుంబ సభ్యులతో నేను స్నేహంగానే ఉన్నా. పిల్లలు పెద్దయ్యే సరికీ అన్నీ చక్కదిద్దుకుంటాయి’ అని అర్బాజ్‌ అన్నారు.మరోపక్క ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ కుమారుడు అర్జున్‌ కపూర్‌, మలైకా డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని అర్జున్‌ కూడా పరోక్షంగా ఒప్పుకొన్నారు. అర్బాజ్‌ కూడా ఇటలీకి చెందిన ఓ మోడల్‌ను ప్రేమిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాతో చెప్పారు. కానీ ఆమె పేరు బయటపెట్టలేదు.