షీలా దీక్షిత్ హయాంలో ఢిల్లీ అభివృద్ధి ఇదీ……..
షీలా దీక్షిత్ హయాంలో ఢిల్లీ రూపు రేఖలు మారాయి. 1998కి ముందు ఢిల్లీ కి 2010 ఢిల్లీకి చాలా తేడా ఉంది. ఇదంతా షీలా హయాంలోనే జరిగింది. 2007-10 మధ్య యుద్ధ ప్రాతిపదికన 18 ఫ్లై ఓవర్ల నిర్మాణం జరిగింది. ఇందుకు గాను 3148 కోట్ల రూపాయలను వెచ్చించడం అప్పట్లో ఒక సంచలనం. నిత్యం ట్రాఫిక్ జాంలతో సతమతమయ్యే ఢిల్లీ ప్రజలకు ఇదొక గొప్ప ఉపశమనం.
మెట్రో రైల్ కూడా ఢిల్లీ లో తన హయాం లోనే పూర్తయ్యింది. అప్పట్లో ఆటోమేటెడ్ డోర్లతో, ఏసీ తో అది ఒక అద్భుతం. పర్యావరణంపైన కూడా అత్యధిక శ్రద్ధ వహించారు షీలా దీక్షిత్. ప్రజా రవాణాకు సి ఎన్ జి తప్పనిసరి చేయడంధ్వారా కాలుష్యం చాలా తగ్గింది. అప్పట్లో ఢిల్లీ రోడ్లపై 65వేల సి ఎన్ జి బస్సులు తిరిగేవి. ఆ సమయంలో ప్రపంచంలోనే కాలుష్య రహిత ఇంధనంపై అత్యధిక బస్సులు తిరుగుతున్న నగరంగా ఢిల్లీ వార్తల్లోకెక్కింది. యమునా నదికి ఇరుపక్కలా చెట్లను నాటే భాగీదారి ప్రాజెక్ట్ అనుకున్న దానికన్నా పెద్ద సక్సెస్ అయ్యింది, కేవలం ప్రభుత్వోద్యోగులకు మాత్రమే తప్పనిసరిగా తొలుత దీన్ని ప్రారంభించినప్పటికీ, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడంతో, ఇది గొప్ప హిట్ గానే చెప్పవచ్చు.
ఆర్థికంగా కూడా ఢిల్లీ ఆమె హయాం లో దూసుకెళ్లింది. జాతీయ ఆర్ధిక వృద్ధి రేటు 8.3% గా ఉంటే, ఢిల్లీ మాత్రం 10.3% తో అగ్రగామిగా పయనించింది. నిత్యం విద్యుత్ సమస్యలతో బాధపడే ప్రజలకు విద్యుత్ బోర్డు ని ప్రైవేటీకరణ చేసి నాణ్యమైన విద్యుత్ ని అందించింది. కామన్వెల్త్ గేమ్స్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఢిల్లీ కి ఒక విశ్వనగరంగా గుర్తింపును తీసుకువచ్చింది.
81 ఏండ్ల వయసులో తన మరణం ఒక తీరని లోటు అయినప్పటికీ, ఢిల్లీ అభివృద్ధి రూపంలో తాను చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.