ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న వారి సంఖ్య మన దేశంలో నానాటికీ పెరిగిపోతోంది. మొబైల్ ఫోన్ల విస్తృతి ఆన్ లైన్ షాపింగ్ కు ప్రధానంగా దోహదపడుతోంది. వివిధ రకాల గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నిత్యావసరాలు, వివిధరకాల చెల్లింపులు చేసేందుకు అనేక మంది ఆన్ లైన్ బాట పడుతున్నారు. అయితే ఆన్ లైన్ షాపింగ్ ద్వారా డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు వంటివి కొనుగోళ్లు పెరగడంలో ప్రధానంగా దోహదపడుతున్నాయి. వీటికి తోడు క్రెడిట్ కార్డు కంపెనీలు తమ కార్డులతో కొనుగోళ్లు చేస్తే ప్రత్యేకంగా క్యాష్ బ్యాక్ లు ఇస్తుండటం ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు ఈ-కామర్స్ కంపెనీలు బ్యాంకులతో జట్టుకట్టి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ తెస్తున్నాయి. ఆ కార్డులు ఏంటి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం… ఇవి ఆరోగ్య బీమా ప్లాన్లు.. ఎంచుకోండి ఏది మీకు సూటవుతుందో.. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు…
* ఈ మధ్యకాలంలో పలు ఈ-కామర్స్ కంపెనీలు కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తెచ్చాయి. తమ సైట్ల ద్వారా కొనుగోళ్లు జరిపే వారికి ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు ఇవ్వాలన్నదే ఈ కార్డుల ప్రధాన ఉదేశ్యం.
* యాక్సిస్ బ్యాంకుతో కలిసి ఫ్లిప్ కార్ట్ (ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు కార్డు), సిటీ బ్యాంకుతో కలిసి పేటీఎమ్ (పే టీఎం ఫస్ట్ కార్డు) , ఎస్బీఐ కార్డుతో తో కలిసి ఓలా (ఓలా మనీ ఎస్ బీ ఐ క్రెడిట్ కార్డు) .. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తెచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంకు భాగస్వామ్యంతో అమెజాన్ ఇండియా (అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు) కూడా కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును తెచ్చింది. ఎంత ఖర్చు చేస్తే అంత ప్రయోజనం…
* ఇప్పటికే క్రెడిట్ కార్డు కంపెనీలు లేదా బ్యాంకులు కార్డుల వినియోగాన్ని బట్టి ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. కార్డు ద్వారా ఎంత ఖర్చు చేస్తే అంతలా ప్రయోజనాలు లభిస్తాయి.
* ఈ కామర్స్ కంపెనీలు కూడా ఇదే విధంగా ప్రయోజనాలు కల్పిస్తూ కస్టమర్ల సంఖ్యను పెంచుకోవాలనుకుంటున్నాయి.
* కో- బ్రాండెడ్ కార్డులు తీసుకురావడం వల్ల బ్యాంకుల క్రెడిట్ కార్డుల సంఖ్య పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.
* క్రెడిట్ కార్డుల మాదిరిగానే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై కూడా వార్షిక ఫీజు, జాయినింగ్ ఫీజులు ఉంటాయి. అయితే నిర్ణీత పరిమితి మేరకు కొనుగోళ్లు దాటితే ఈ ఫీజులను ఈ కామర్సు కంపెనీలు ఎత్తివేస్తున్నాయి.
* ఈ క్రెడిట్ కార్డులు తీసుకున్న తర్వాత కొన్ని సంస్థలు వోచర్లు, ఏక కాల డిస్కౌంట్లు, కొన్ని సర్వీసులకు ఉచిత చందా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఈ అంశాలు దృష్టిలో ఉంచుకోండి…
* ఇప్పటికే క్రెడిట్ కార్డును వినియోగిస్తుంటే అదనంగా ఈ కో-బ్రాండెడ్ కార్డు అవసరమో లేదో ఒక్కసారి చూసుకోండి.
* ఈ కామర్స్ సైట్ల ద్వారా మీరు ఎంత ఖర్చు చేస్తున్నారో లెక్క వేసుకోండి. కో బ్రాండెడ్ కార్డులతో ఇతర వెబ్ సైట్లలో కొనుగోళ్లు చేస్తే అంతగా ప్రయోజనం ఉండక పోవచ్చు. మీరు ఏదో ఒక ఈ- కామర్స్ సైట్ లో మాత్రమే కొనుగోలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. వేర్వేరు సైట్లలో కొనుగోలు చేస్తే లాభం ఉండకపోవచ్చు.
* మీకున్న ఖర్చు చేసే సామర్థ్యాన్నిబట్టి ఈ కార్డులు తీసుకోవడం మంచిది. కార్డు ఉంది కదాని ఇష్టం వచ్చినట్టుగా కొనుగోళ్లు చేస్తే మీకే ఇబ్బంది కలగవచ్చు.