భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2ను మోసుకెళుతున్న జీఎస్‌ఎల్వీ మార్క్3ఎం1 వాహకనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ముందుగానే నిర్దేశించినట్టుగా శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం 20 గంటల కౌంట్‌డౌన్ పూర్తిచేసుకొని మధ్యాహ్నం సరిగ్గా 2.43గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్లింది. ఈ అద్భుత ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించారు. సాంకేతిక కారణాలతో జులై 15న నిలిచిన ప్రయోగం ఎట్టకేలకు అన్ని సవాళ్లను అధిగమించింది. కేవలం ఒక నిమిషం మాత్రమే ఉన్న లాంఛ్ విండోను గత అనుభవంతో శాస్త్రవేత్తలు సమర్థంగా, అత్యంత కచ్చితత్వంతో వినియోగించుకోవడంలో సఫలమయ్యారు. ప్రయోగ వేదిక నుంచి బయలుదేరిన రాకెట్ 16.13 నిమిషాలు ప్రయాణించి చంద్రయాన్-2ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని చంద్రుడి దక్షిణ ధ్రువంలోకి ప్రవేశపెట్టడమనేది అత్యంత సవాల్‌తో కూడుకున్న పని. భూమికి, చంద్రుడికి మధ్య దూరం దాదాపు 3.844 లక్షల కిలోమీటర్లు. అంతటి సుదూరానికి చేరుకునేటప్పుడు మార్గంలో కచ్చితత్వం సాధించడం చాలా కష్టం. ఇతర ఖగోళ వస్తువుల గురుత్వాకర్షణ శక్తి, సౌర రేడియోధార్మికతకు సంబంధించిన ఒత్తిడి, భూమి-చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలో సారూప్యత లేకపోవడం, కక్ష్యలో చంద్రుడి కదలిక వంటివి సవాళ్లు అధిగమించాలి. జాబిల్లి కక్ష్య దిశగా(ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్) వెళ్లేందుకు చంద్రయాన్-2 తొలుత తన కక్ష్యను పెంచుకోవాలి. కక్ష్యలో కదలిక వల్ల చంద్రుడి స్థితి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అందువల్ల చంద్రయాన్-2, చంద్రుడు నిర్దిష్ట ప్రదేశంలో అత్యంత కచ్చితత్వంతో కలుసుకునేలా ఒక మార్గాన్ని ముందుగానే నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. చంద్రుడికి దగ్గరవుతున్నప్పుడు వ్యోమనౌకలోని రాకెట్లు నిర్దిష్టంగా మండుతూ.. దాని వేగాన్ని తగ్గించాలి. తద్వారా వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ఒదిగిపోతుంది. లూనార్ క్యాప్చర్‌గా పిలిచే ఈ ప్రక్రియలో ఏమాత్రం తేడాలకు ఆస్కారం ఉండకూడదు.
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం
Related tags :