* అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు నిరసన సెగ తగిలింది. అమెరికాలోని పాకిస్థానీయులను ఉద్దేశించి ఓ వేదికపై ప్రసంగిస్తుండగా..కొంత మంది యువకులు పాక్ వ్యతిరేక నినాదాలు చేశారు. అలాగే స్వతంత్ర బలూచిస్థాన్ ఏర్పాటు చేయాలంటూ నినదించారు. పక్కనే ఉన్నవారు ఎంత వారించినా వారు ఆపకపోవడంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. ఇమ్రాన్ మద్దతుదారుల సాయంతో వారిని బయటి పంపారు. అయితే వారు వేదికకు దూరంగా ఉండడంతో ఇమ్రాన్ ప్రసంగానికి ఎటువంటి అంతరాయం కలగలేదు. కానీ, సభలో కాసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పాకిస్థాన్‌లో ఓ రాష్ట్రమైన బలూచిస్థాన్‌లో ప్రత్యేక దేశం కోసం కొన్నేళ్లుగా నిరసనలు జరుగుతున్నాయి. పాక్ భద్రతా బలగాలు అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, ఉద్యమకారుల్ని అపహరిస్తున్నారని అమెరికాలోని బలూచిస్థాన్‌వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ఈ అక్రమాలను ఆపాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని కోరుతూ..ఇమ్రాన్ పర్యటన నేపథ్యంలో అక్కడి బలూచిస్థాన్ వాసులు రెండు రోజులుగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాకిస్థాన్‌లోని మైనారిటీ వర్గాలకు చెందిన మరికొంత మంది సైతం వాషింగ్టన్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. మూడురోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయనకు ఆదిలోనే ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. స్వాగతించడానికి అమెరికా మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరూ రాలేదు. విమానాశ్రయం వద్దకు కేవలం ఒక ప్రోటోకాల్ అధికారి మాత్రమే వచ్చారు.
* నేడే బలపరీక్ష: ఆస్పత్రిలో చేరిన కుమారస్వామి, నాటకమేనంటున్న బీజేపీ…….
చిత్ర, విచిత్ర మలుపులు తిరుగుతున్న కర్ణాటక రాజకీయంలో మరో ఊహించని పరిణామాం చోటు చేసుకుంది. అనారోగ్య కారణాలతో ముఖ్యమంత్రి కుమారస్వామి ఆస్పత్రిలో చేరారు.హైబీపీ తదితర కారణాలతో సీఎం బెంగళూరులోని అపోలో హాస్పటిల్‌లో చేరారు. ఈ వ్యవహారంపై బీజేపీ మండిపడింది. బలపరీక్షలో ఓడిపోతారనే భయంతోనే ముఖ్యమంత్రి నాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు ఆ పార్టీ నేతలు. విశ్వాస పరీక్షను మరింత ఆలస్యం చేసేందుకే కాంగ్రెస్-జేడీఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఎం ఓ గంటపాటు అసెంబ్లీలో ఉంటే చాలని.. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లొచ్చని సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు సోమవారం కుమారస్వామి సర్కార్‌కు బలపరీక్ష నిర్వహించనున్నారు స్పీకర్ సురేశ్ కుమార్. తన ఆదేశాలను స్పీకర్ పట్టించుకోకపోవడంతో… ఒకవేళ సోమవారం బలపరీక్ష జరపకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని గవర్నర్ వాజుభాయ్ వాలా దాదాపుగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.మరోవైపు సంకీర్ణ సర్కార్‌ను కాపాడుకునేందుకు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామి మంతనాలు జరిపారు.సంకీర్ణ సర్కార్‌ను కాపాడుకోవడానికి చివరి అస్త్రంగా ‘‘ సీఎం పదవి నుంచి కుమారస్వామి వైదొలుగుతారని…. కాంగ్రెస్ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయినా ఫర్వాలేదని సంకేతాన్ని వీరిద్దరు పంపారు. మరి సోమవారం కర్ణాటక అసెంబ్లీలో ఏం జరుగుతోందోనని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
* అమరావతిలో కుంభకోణాన్ని వరల్డ్ బ్యాంక్ గుర్తించింది: విజయసాయి రెడ్డి
అమరావతిలో నిర్మాణాల పేరిట భారీ కుంభకోణాలు జరిగినట్టు ప్రపంచ బ్యాంకు గుర్తించిందని, అందువల్లే ఇస్తామన్న రుణాన్ని ఇచ్చేందుకు నిరాకరించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “అమరావతి ఒక స్కామ్ ల పుట్ట అని గుర్తించే ప్రపంచ బ్యాంకు 3500 కోట్ల రుణాన్ని నిలిపి వేసింది. రియల్ ఎస్టేట్ కు మేలు చేసేదిగా ఉండటం, రుణం ఇవ్వకుండానే 92 కిమీ రోడ్డుకు 1872 కోట్ల అంచనాలతో టెండర్లు ఆమోదించడం అతి పెద్ద కుంభకోణంగా బ్యాంకు దర్యాప్తులో వెల్లడైంది” అని అన్నారు.
* టీడీపీకి రాయపాటి గుడ్‌బై.. ఏ పార్టీలో చేరేదీ చెప్పేశారు!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కమ్ముకొస్తోంది. కేంద్రంలో రెండోసారి పగ్గాలు చేపట్టిన వెంటనే ఇరు రాష్ట్రాల్లో కుదేలైన ప్రధాన ప్రతిపక్షాల స్థానాన్ని ఆక్రమించేందుకు సన్నద్ధమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా రెండు చోట్లా అధికార పక్షాన్ని ఢీకొట్టే ప్రధాన శక్తిగా ఎదిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ముఖ్యంగా టీడీపీ నేతలే టార్గెట్‌గా బీజేపీ పన్నాగం పన్నుతోంది. ‘ఆపరేషన్ కమల్’ను బీజేపీ తీవ్రతరం చేసింది. ఎన్నికల్లో పరాజయ భారం నుంచి పూర్తిగా కోలుకోకమునుపే టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే రాజ్యసభలో టీడీపీ పక్షం బీజేపీలో విలీనం అయిపోయింది. గుంటూరు టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న రాయపాటి సాంబశివరావు కూడా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. పార్టీ మారే విషయాన్ని ఆయనే స్పష్టం చేశారు. త్వరలోనే బీజేపీలో చేరతానని ప్రకటించారు. బీజేపీలో చేరుతానని స్పష్టం చేస్తూనే.. తాను ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని చెప్పుకొచ్చారు. రాయపాటి టీటీడీ చైర్మన్ పదవి మెలికతోనే టీడీపీలో చేరారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి పుట్టా సుధాకర్ యాదవ్‌కు దక్కింది. దీంతో అప్పటి నుంచి రాయపాటి ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆయన బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించడం గమనార్హం.మరోవైపు సాంబశివరావును బీజేపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ ముఖ్యులు రంగంలోకి దిగారు. ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ రెండ్రోజుల క్రితం గుంటూరులోని రాయపాటి నివాసానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన వస్తున్న విషయం ముందుగానే తెలియడంతో రాయపాటి ఆయనకు విందు కూడా ఇచ్చినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా బలమైన కేడర్ ఉన్న రాయపాటిని చేర్చుకోవడం ద్వారా పార్టీని పటిష్ఠం చేయాలని భావిస్తున్నారు. రాంమాధవ్ కూడా నేరుగా తమ పార్టీలో చేరాల్సిందిగా రాయపాటిని కోరినట్లు తెలిసింది. ఇద్దరి నడుమ సానుకూల చర్చలే జరిగినట్లు సమాచారం.
*పోయేవాళ్లు పోతుంటారు: బీజేపీలోకి వలసలపై ఎంపీలతో బాబు……..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియంతలా పాలన సాగించాలని చూస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. నిరంతరం ప్రజలకు చేరువగా ఉంటూ వైఎస్ జగన్ సర్కార్ చేస్తున్న తప్పులను ఎత్తిచూపాలని చంద్రబాబుు పార్టీ ఎంపీలకు సూచించారు.ఆదివారం సాయంత్రం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నానిలు పాల్గొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనుసరిస్తున్న వైఖరిపై సమావేశంలో చర్చించారు. తన ఇష్టానుసారంగా జగన్ పాలనను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. ప్రజలు ఏం కోరుకొంటున్నారనే విషయాన్ని వదిలేసి తన ఇష్టానుసారంగా పనిచేయడం సరైంది కాదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.టీడీపీని వీడీ కొందరు ప్రజా ప్రతినిధులు, నేతలు బీజేపీలో చేరుతుున్న విషయాన్ని ఎంపీలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. పార్టీని వీడే వారు వీడుతుంటారు, పార్టీలో కొత్తవారిని చేర్చుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలని చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలను కోరారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాదని చంద్రబాబునాయుడు చెప్పారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడ బీజేపీ ఎదగడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే టీడీపీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పనిచేసేలా కృషి చేయాలని చంద్రబాబు పార్టీ ఎంపీలను కోరారు.పార్లమెంట్ సమావేశాల్లో ముగ్గురు ఎంపీలు అనుసరిస్తున్న పాత్రను ఆయన అభినందించారు. పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో స్వంత నియోజకవర్గాలకే పరిమితం కాకుండా గుంటూరు పార్టీ కార్యాలయంలో కూడ అందుబాటులో ఉండాలని చంద్రబాబునాయుడు ఎంపీలను ఆదేశించారు.
* ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు……..
కేంద్ర ప్రభుత్వం శనివారం ఆరు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది.మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, బీహార్ గవర్నర్ లాలాజీ టాండన్‌ను బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆనందీబెన్ పటేల్..గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్ 2018 జనవరిలో మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు ఆమెను యూపీకి బదిలీ చేశారు.లాల్‌జీ టాండన్…త ఏడాది ఆగస్టులో బీహార్ గవర్నర్‌గా నియమితులైన లాల్‌జీ టాండన్‌ను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా (ఆనందీబెన్ స్థానంలోకి) బదిలీ చేశారు.జగదీప్ ధన్‌కర్…మాజీ ఎంపీ, సుప్రీం కోర్టు లాయర్ ధనకర్ 1990–91 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2003లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఇప్పుడు బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు.రమేశ్ బయాస్..బీజేపీ సీనియర్ నేత రమేశ్ బయాస్ త్రిపుర కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కప్టాన్‌సింగ్ సోలంకి పదవీ కాలం ఈ నెల 27తో ముగుస్తుంది.ఆర్‌ఎన్ రవి…ఇంటలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయిన రవి నాగాలాండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈయన నాగా శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్‌కు సన్నిహితుడని చెబుతారు.ఫగు చౌహాన్…బీహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. లాలాజీ టాండన్ ప్లేస్‌లో ఈయన్ను నియమించారు.
* కర్ణాటకలో మారిన సీన్… సీఎంగా శివ కుమార్..?
కర్ణాటకలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ..ఆసక్తి రేపుతున్నాయి. రెండు రోజుల విరామం తర్వాత కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కాగా…. శుక్రవారం నాటికి అసెంబ్లీలో ఉన్న సీన్ ఇప్పుడు లేదని తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి జేడీఎస్ త్యాగానికి సిద్ధపడిందని సమాచారం.శుక్రవారం బలపరీక్ష జరగాల్సి ఉండగా… సభ వాయిదా పడటంతో అది జరగేలేదు. దీంతో… ఇక కర్ణాటకలో రాష్ట్రపతి పాలన తప్పదని అందరూ భావించారు. అయితే… రెబల్ ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు కాంగ్రెస్-జేడీఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రెబల్ ఎమ్మెల్యేను వెనక్కి రప్పించడంతోపాటు… సీఎం కుమారస్వామి షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఆయన తన సీఎం పదవికి త్యాగం చేసి బాధ్యతలు కాంగ్రెస్ కి అప్పగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పరోక్షంగా ఓ కాంగ్రెస్ నేత ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కూటమిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి ఎవరో ఒకరు సీఎం బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య, పరమేశ్వర, శివకుమార్ లలో ఎవరో ఒకరు సీఎం బాధ్యతలు చేపట్టునున్నట్లు సమాచారం. ఎక్కువ శాతం అవకాశాలు శివకుమార్ కే ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే… బీజేపీ ప్రలోభాలకు లొంగిపోవద్దంటూ.. సీఎం కుమారస్వామి అసమ్మతి ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. మరి వారు వెనక్కి తగ్గుతారో లేదో తెలియాల్సి ఉంది. ఏది ఎలా ఉన్నా… నేటితో కర్ణాటక సంక్షోభానికి క్లైమాక్స్ పడనుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
* వైసీపీని టార్గెట్ చేసిన బీజేపీ
తెలంగాణతోపాటు ఏపీలోనూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.. 2024 ఎన్నికల్లో పార్టీని మరింత బలపరిచే దిశగా ఇప్పట్నుంచే వ్యూహాలకు పదునుపెడుతోంది.. అటు టీడీపీని మరింత దెబ్బతీయడంతోపాటు అధికార వైసీపీని కూడా టార్గెట్ చేసింది. ముఖ్యమంత్రి జగన్ పాలనపై రోజూ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుపడుతూ వస్తున్నారు కమలనాథులు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, పెరిగిపోతున్న రాజకీయ దాడులపై ఆరోపణాస్త్రాలు ఎక్కు పెడుతున్నారు.
* జగన్ సర్కార్‌కు కేంద్ర విద్యుత్ సంస్థల ఝలక్
జగన్ సర్కార్‌కు కేంద్ర విద్యుత్ సంస్థలు ఝలక్ ఇచ్చాయి. విద్యుత్ ఒప్పందాలపై సమీక్షకు హాజరు కాకూడదని NTPC, SECI నిర్ణయించాయి. అటు.. సోమవారం ఒప్పందాలపై ఉన్నత స్థాయి సమీక్షను సీఎం జగన్ నిర్వహించనున్నారు. ఒప్పందాలు రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఒప్పందాలను గౌరవించి, పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిస్కమ్‌లకు SECI లేఖ రాసింది.
* అర్హులైన వారికి త్వరలో రేషన్ కార్డులు: కొడాలి నాని
అర్హులైన వారికి త్వరలో రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. శాసనసభలో జరుగుతున్న ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థతో సివిల్ సప్లైస్ పని తీరు గాడినపడుతుందన్నారు. రైస్ మిల్లర్లు కొనే ధాన్యంతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖ నిధులను దారి మళ్లించిందని విమర్శించారు.
* డీజీపీ గారూ.. కాపాడండి సార్: కేశినేని నాని
కాల్ మనీ మాఫీయా వల్ల ప్రజలు పడే ఇబ్బందులు ఈ రాష్ట్రంలో అందరి కంటే ఎక్కువ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కే తెలుసని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని అన్నారు. కాల్ మనీ మాఫియా బారిన ప్రజలు పడకుండా కాపాడాలని ఆయన కోరారు. ఈమేరక ఆయన ఇవాళ ట్వీట్ చేశారు. కాల్ మనీ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాన్ని ట్వీట్‌కు అటాచ్ చేశారు కేశినేని నాని. ఓ టీడీపీ నాయకుడిని టార్గెట్ చేసుకుని ట్వీట్లతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం లేపుతున్న నాని కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించిన సమస్యను డీజేపీ దృష్టికి తీసుకెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. సదరు టీడీపీ నేత గతంలో కాల్‌మనీ కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఈ క్రమంలో ఆయణ్ని టార్గెట్ చేసుకునే ఈ ట్వీట్ చేసినట్టు భావిస్తున్నారు.
*వైసీపీ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటే..: తులసిరెడ్డి
వైసీపీ పాలనలో రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయిందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయని, వైసీపీ 50 రోజుల పాలనలో 39 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను మంత్రులు పరామర్శించలేదని విమర్శించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం పథకంతో సంబంధం లేకుండా… రూ. 12,500 ఇస్తామని చెప్పి ఇప్పుడు సీఎం జగన్ మాట మార్చారని తులసిరెడ్డి ఆరోపించారు. కేంద్ర పథకంతో సంబంధం లేకుండా రైతులకు రూ. 12,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పెండింగ్ రూ. 8 వేల కోట్లపై జగన్ ప్రభుత్వం మాట్లాడటంలేదని, బకాయి రుణమాఫీ సొమ్ము తక్షణమే రైతుల ఖాతాల్లో వేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
*ఏపీలో అవినీతి వారసుల ప్రభుత్వం నడుస్తోంది: గోరంట్ల
ఏపీలో అవినీతి వారసుల ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. సోమవారం నాడు అసెంబ్లీలో హోసింగ్‌పై టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం మీడియాతో మాట్లాడిన బుచ్చయ్య.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సభ నుంచి సభ్యులు వాకౌట్ చేద్దామన్నా.. నిరసన నిరసన వ్యక్తం చేద్దామన్నా అధికార పార్టీ వాళ్ళు మైక్ ఇవ్వడంలేదన్నారు. ఆనాడు రాజశేఖరరెడ్డి హయాంలో 14 లక్షల ఇల్లు ఎక్కడున్నాయో తెలియట్లేదని.. నాడు రూ. 4 వేల కోట్ల రూపాయల దోపిడీ హౌసింగ్‌లో జరిగిందని ఆయన ఆరోపించారు.
*డి.రాజాకు సీపీఐ సారథ్య బాధ్యతలు
సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా నియమితులయ్యారు. మూడు రోజుల పాటు జరిగిన జాతీయ సమితి, జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సమావేశాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. ఈ సమావేశాల అనంతరం పార్టీ తాజా మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు, పార్టీకి విశేష సేవలందిస్తున్న రాజాను నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు చెప్పారు. తాను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతానన్నారు. డి.రాజా సీపీఐకి 11వ ప్రధాన కార్యదర్శి. లోక్సభ ఎన్నికల్లో బెగూసరాయ్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కన్నయ్యకుమార్ను జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. జాతీయ సమితి సమావేశాల్లో పాల్గొన్న ఏపీ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, వెంకటరెడ్డి డి.రాజాను అభినందించారు.
*నియంతలా పాలిస్తున్న జగన్
– తెదేపా ఎంపీలతో చంద్రబాబు
‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వరుస తప్పులు చేస్తూ నియంతలా పాలించాలని చూస్తున్నారు. ప్రజలకు కావాల్సింది చేయాలి కానీ ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు. మనం నిరంతరం ప్రజలకు దగ్గరగా ఉంటూ ఆ తప్పులను జనంలోకి తీసుకెళ్లాలి’’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆ పార్టీకి చెందిన లోక్సభ సభ్యులకు సూచించారు. ఆదివారం హైదరాబాద్లో ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్నాయుడులతో ఆయన సమావేశమయ్యారు.
*కొల్లూరు టౌన్షిప్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది
నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్ల కోసం నిర్మించిన కొల్లూరు టౌన్షిప్ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఆదివారం ఆయన కొల్లూరు టౌన్షిప్ వీడియోను ట్విటర్లో జత చేశారు. ‘‘ఇది ప్రైవేటు గేటెడ్ కమ్యూనిటీ కాదు. పేదల ఆత్మగౌరవాన్ని నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1360 కోట్లతో నిర్మిస్తున్న ఆసియాలోనే అతిపెద్దదైన మోడల్ టౌన్షిప్. 15660 రెండు పడకగదుల యూనిట్లు ఇందులో ఉన్నాయి’ అని ఆయన ట్వీట్ చేశారు.
*మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారు: మమత
కర్ణాటకలో మాదిరిగా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి భాజపా ప్రయత్నిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రూ. 2 కోట్ల నగదు, పెట్రోల్ బంకులు వంటివి వారికి ఇవ్వజూపుతూ భాజపా ప్రలోభపెడుతోందంటూ దుయ్యబట్టారు. కోల్కతాలో నిర్వహించిన అమరవీరుల దినోత్సవ సభలో ఆమె ఆదివారం మాట్లాడారు. పశ్చిమబెంగాల్లో 1993లో వామపక్ష కూటమి హయాంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో మమత యువజన కాంగ్రెస్ నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఏటా జులై 21న అమరవీరుల దినోత్సవ సభను నిర్వహిస్తోంది.
* అక్షయపాఁతకి అప్పజెప్పొద్దు :సి.ఐ.టి.యు
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పెండింగ్లో ఉన్న బిల్లును తక్షణం విడుదల చేయాలని
మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర అప్పజెప్పరాదని ఈ రోజున విజయవాడ ధర్నాచౌక్లో జరుగుతున్న కార్యక్రమానికి వేలాదిగా హాజరైన .. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనం అమలు చేయాలని పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణం విడుదల చేయాలని పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెను ఛార్జీలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్. కె. గపూర్, సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సి హెచ్ శ్రీనివాస్ మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి ఎన్ సి హెచ్ సుప్రజ తదితరులు పాల్గొన్నారు.
అమెరికాలో ఇమ్రాన్‌ఖాన్‌కు నిరసన సెగ!-రాజకీయ–07/22
Related tags :