ScienceAndTech

భారతీయ భాషల్లో సుప్రీం తీర్పులు

Indian Supreme Court Now Offers Judgements In Local Languages

సుప్రీంకోర్టు తీర్పులు తెలుగు భాషలోనూ అందుబాటులోకి వచ్చాయి. ఆంగ్లంతోబాటు పలు భారతీయ భాషల్లో తీర్పు ప్రతులను సుప్రీంకోర్టు ఆదివారం తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఇందులో తెలుగు సహా హిందీ, అస్సామీ, కన్నడ, కశ్మీరీ, మరాఠీ, ఒడియా, తమిళం, బెంగాలీ భాషలకు చెందిన 114 తీర్పు ప్రతులను అందుబాటులో ఉంచింది. కేసు ఏ ప్రాంతానికి చెందిందో ఆ ప్రాంతానికి చెందిన కక్షిదారులు తీర్పు ప్రతిని చదువుకోవడానికి అనువుగా సదరు భారతీయ భాషలోకి అనువదించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆంగ్ల ప్రతి అదే రోజు వెబ్సైట్లో పొందుపరుస్తారని, ఇతర భారతీయ భాషల్లో అనువదించి వెబ్సైట్లో పొందుపరచడానికి కనీసం వారం రోజులు పడుతుందని ప్రధాన న్యాయమూర్తి రంజన్గొగొయి ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. ధ్రువీకరించిన తీర్పు కాపీలు భారతీయ భాషల్లోనూ కక్షిదారులకు అందుబాటులో ఉంచాలని అక్టోబరు, 2017లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సూచించారు. ప్రజలకు న్యాయం చేయడం ఒక్కటే ముఖ్యం కాదు…తనకు జరిగిన న్యాయాన్ని సొంత భాషలో చదువుకొనే అవకాశాన్నీ కల్పించాలన్న రాష్ట్రపతి సూచనను సుప్రీంకోర్టు అమలు చేసింది. తొలుత పౌర వివాదాలు, నేర సంబంధాలు, యజమాని- అద్దెకు ఉండేవారు, వివాహ సంబంధ సమస్యలకు సంబంధించిన తీర్పు ప్రతులను భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం.ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేసిన తీర్పు ప్రతులను విడుదల చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలి ప్రతి అందుకున్నారు.