ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు పెడితే బీజేపీ చిత్తుగా ఓడిపోకతప్పదని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. దేశంలో డెమోక్రసీ బతకాలంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆదివారం కోల్కతాలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆమె మాట్లాడారు. కేంద్ర ఏజెన్సీలన్నీ బీజేపీ ఏజెంట్లలా పనిచేస్తున్నాయని ఆరోపించిన దీదీ.. కేసుల భయం, డబ్బు ఆశ చూపించడం వల్లే కొంత మంది టీఎంసీ లీడర్లు బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు. మనీ పవర్, పోలీస్ ఫోర్స్, ఈవీఎం.. ఈ మూడింటితోనే బీజేపీ బెంగాల్లోకి రాగలిగిందని మమత అన్నారు. టీఎంసీని ఖాళీ చేయిస్తామంటున్న బీజేపీ లీడర్లను ప్రస్తావిస్తూ, టీఎంసీ కూడా అదే స్ట్రాటజీలో వెళితే బీజేపీ తట్టుకోలేదని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీకి బెంగాల్లో క్యాడర్ లేదని, ఆ పార్టీ లీడర్లంతా ఔట్సైడర్లేనని దీదీ తెలిపారు. పిల్లలు చదువుకునే స్కూళ్లలో ఆర్ఎస్ఎస్ గూండాలు పిచ్చిపనులు చేస్తున్నారని, బీహార్లోనూ ఇలాంటి విషప్రచారం చేస్తున్నందుకే సంఘ్ యాక్టివిటీలపై కన్నేసి ఉంచాలంటూ సీఎం నితీశ్ కుమార్ పోలీసుల్ని ఆదేశించారని మమత గుర్తుచేశారు.
*బీజేపీ పెద్ద బందిపోటు పార్టీ
సొంతగా బలంలేని బీజేపీ అక్రమ మార్గాల్లో టీఎంసీ ఎమ్మెల్యేల్ని కొనుగోలుచేసే ప్రయత్నం చేస్తున్నదని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీలో చేరకపోతే ఏదో ఒక కేసులో జైల్లో పెడతామని కేంద్ర ఏజెన్సీలు బెదిరింపులకు దిగుతున్నాయని, ఆ సంస్థలు బీజేపీ ఆఫీసుల్లా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ‘‘బీజేపీ పెద్ద బందిపోటు పార్టీ. డీమానిటైజేషన్తో జనం డబ్బులు కొల్లగొట్టింది. ఇప్పుడా బ్లాక్ మనీతోనే ఊరూరా ఆఫీసులు కడుతూ, నాన్బీజేపీ ప్రభుత్వాల్ని కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. బెంగాల్లో ఒక్కో ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు, పెట్రోల్ బంకు లైసెన్స్ ఇస్తామని ఆశచూపి బీజేపీలోకి చేర్చుకుంటున్నారు. అటు కర్నాటకలోనూ ఎమ్మెల్యేల కోనుగోలు వ్యవహారం చూస్తున్నాం. ఏ పార్టీ దగ్గరా లేనంత డబ్బు బీజేపీకి ఎలా వచ్చింది? అదంతా డీమానిటైజేషన్ డబ్బే. జనం డబ్బును తిరిగిచ్చెయ్యాలి. టీఎంసీపై ‘కట్ మనీ’ పేరుతో చిల్లర ఆరోపణలు చేస్తున్న బీజేపీ.. జనానికి ప్రామిస్ చేసిన రూ.15లక్షల మాటేంటి?”అని మమత ప్రశ్నించారు.
*ఈ నెల 26 నుంచి ఆందోళనలు
డీమానిటైజేషన్తో జనం డబ్బుల్ని మింగేసిన బీజేపీకి వ్యతిరేకంగా ఈ నెల 26 నుంచి నిరసనలు చేపట్టనున్నట్లు మమత వెల్లడించారు. అమరుల దినోత్సవానికి సంబంధించి ఈ ఏడాది ‘‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ.. ఈవీఎంల రద్దు.. బ్యాలెట్ పేపరే ముద్దు”నినాదంతో ప్రజల్లోకి వెళతామన్నారు. 1993, జులై 21న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆందోళన కారులపై నాటి లెఫ్ట్ సర్కార్ కాల్పులు జరపగా, 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మమత కాంగ్రెస్ నుంచి వేరుపడి తృణమూల్ ఏర్పాటుచేసినా, జులై 21ని అమరులదినోత్సవంగా కొనసాగిస్తున్నారు.
బ్యాలెట్‌తో భాజపాను అంతం చేస్తాం
Related tags :