కన్నడ రాజకీయం తుది అంకానికి చేరింది. సభలో తగిన సంఖ్యాబలం లేకపోవడంతో సీఎం పదవికి కుమార స్వామి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. సభలో సుదీర్ఘ ప్రసంగం తర్వాత గవర్నర్‌కు ఆయన రాజీనామా సమర్పిస్తారని ప్రచారం జరుగుతోంది. రాజీనామాకు దారితీసిన పరిస్థితులపై ఆయన సభలో సుదీర్ఘ వివరణ ఇస్తున్నారు. సంకీర్ణాన్ని భాజపా ఎలా అస్థిరపరిచిందో సభలో చెబుతున్నారు. సంకీర్ణానికి తగిన బలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు దూరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, శాసనసభలో ముఖ్యమంత్రి కుమారస్వామి ఉద్వేగభరితంగా ప్రసంగిస్తున్నారు. ‘‘సంతోషంగా పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను కావాలని విశ్వాస పరీక్షను సాగదీయలేదు. స్పీకర్, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా. వ్యవసాయం నుంచి మా కుటుంబం రాజకీయాల్లోకి వచ్చింది. ప్రజల కోసం కష్టపడి పనిచేయడమే మాకు తెలుసు. నేను ప్రభుత్వ కారు కూడా వాడటంలేదు. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయను. రాష్ట్ర అభివృద్ధి కోసమే నిరంతరం శ్రమించాను’’ అని అన్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో బెంగళూరులో పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రభుత్వం పడిపోతే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. బెంగళూరులో 144 సెక్షన్ విధించారు.
కుమారస్వామి రాజీనామా?
Related tags :