DailyDose

వాట్సాప్ లో కొత్త ఫీచర్-తాజావార్తలు–07/23

New Features In Whatsapp-Telugu Breaking News Today-July 23 2019

* ప్రస్తుత కాలంలో వాట్సాప్ వాడని వారు ఎవరైనా ఉన్నారా..? అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్.. ఆ ఫోన్ లో వాట్సాప్ కామన్ గా ఉంటున్నాయి. అంతలా వాట్సాప్ ప్రజలకు చేరువయ్యింది. అందుకే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు నయా ఫీచర్లను ప్రవేశపెడుతూ… వినియోగదారులను మరింతగా ఆకట్టుకుంటోంది. జాగా… మరో ఫీచర్ ని తీసుకురావడానికి వాట్సాప్ యోచిస్తోంది.సాధారణంగా వాట్సాప్ లో మనం మెసేజ్ లు, వీడియోలు, ఆడియోలు పంపుకుంటూ ఉంటాం. మనం పంపే టెక్ట్స్ మెసేజ్ లోగానీ, వీడియోలో గానీ ఏవైనా తప్పులు ఉన్నాయేమో మనం చెక్ చేసుకోవడానికి వీలు ఉంది. కానీ ఆడియో మెసేజ్ లో ఆ సౌలభ్యం లేదు. వాయిస్ మెసేజ్ లో తప్పులు మనం చెక్ చేసుకోడానికి వీలు లేదు.
అందుకే… ఈ వెసులుబాటును ఇప్పుడు వాట్సాప్ తీసుకురావాలని చూస్తోంది. ఆడియో రికార్డింగ్‌ సందేశం పంపేముందు పరిశీలించుకునే విధంగా యాప్‌లో మార్పులు చేస్తోంది. ఈ ఫీచర్‌ ఐవోఎస్‌లో బీటా దశలో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.
* జమ్మలమడుగులో నాటు బాంబుల కలకలం రేగింది. పెన్నానది సమీపంలోని ఇసుక తిన్నెల వద్ద కంప చెట్లను తొలగిస్తున్నారు. జేసీబీ తవ్వకాల్లో బకెట్లు కనిపించాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బకెట్లను తెరిచి చూడగా 54 నాటు బాంబులు కనిపించాయి. ఈ బకెట్లు ఎవరు పెట్టారు? ఎన్ని రోజుల క్రితం పూడ్చారు? ఇది ఎవరి పని? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
* రళను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వానలతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. అయితే కన్నూరు, కసరగడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మరోవైపు కోజికోడ్, మలపురం, వైనాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్…. పాలకడ్, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని తెలిపారు అధికారులు. కన్నూరు, కసరగడ్, మలపురం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండటంతో….ఇవాళ స్కూల్స్ కు సెలవు ప్రకటించింది సర్కార్. మరోవైపు వాతావరణ శాఖ అలర్ట్ తో ముందస్తు చర్యలు చేపట్టింది కేరళ సర్కార్.
* ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఇంట్లో షార్ట్ సర్కూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. చీరాల మండలం రామకృష్ణాపురంలోని ఆయన నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన సిబ్బంది ఫైర్‌ సర్వీస్‌కు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఫైర్‌ యాక్సిడెంట్‌లో కంప్యూటర్లు, ఫర్నిచర్‌ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు 4 లక్షల రూపాయల అస్తినష్టం జరిగి ఉండవచ్చని అంచనావేస్తున్నారు.
* 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు 34 మందికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. సిక్కు అల్లర్ల కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు 34మందికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే వీరిలో 33 మంది ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన అనంతరం వారికి అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు 15 మంది నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇటీవలే ఇచ్చిన తీర్పుపై మరోసారి వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
*ఛత్తీస్‌గఢ్‌లోని బిరభట్టి అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్‌జీ) పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు సుక్మా ఎస్పీ శాలబ్‌ సిన్హా తెలిపారు. మృతి చెందిన మావోయిస్టు మద్కం హిజ్మాపై రూ. లక్ష రివార్డు ఉందని ఆయన చెప్పారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో రెండు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.
*విజయవాడనగరంలో మంగళవారం ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘా వృతమై ఉరుములుమెరుపులతో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరింది. అలాగే రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి.
*తమ డిమాండ్ల సాధనకు ఈ నెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జేఏసీ కోరింది. సోమవారం ఆబిడ్స్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ కె.లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ సుభాకర్రావు, ఫైనాన్స్ సెక్రటరీ ఎస్.జ్ఞానేశ్వర్ తదితరులు మాట్లాడారు.
*మున్సిపల్ ఎన్నికల నిమిత్తం ముందస్తుగా రూపొందించుకున్న ప్రణాళికను మీరే ఎందుకు కుదించుకున్నారంటూ ప్రభుత్వాన్ని సోమవారం హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికలకు ముందు దశలవారీగా ఒక్కో దశను పూర్తి చేయడానికి ఎంతెంత గడువు కావాలో చెబుతూ సింగిల్ జడ్జికి ప్రణాళిక సమర్పించారంది.
*తెలంగాణలో జరిగే ప్రత్యక్ష ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్ల శాతాన్ని 4 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వు (జీవో నెం.96)లు జారీ చేసింది.
*ముఖ్యమంత్రి జగన్ 34 రోజులుగా ప్రతి బంతినీ బౌండరీకి తరలిస్తున్నారని, టీ20 క్రికెట్ మ్యాచ్లా చివరి అయిదు ఓవర్లలోనూ మళ్లీ జగన్ హిట్టింగ్ చేస్తారనుకుంటున్నానని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు.
*రాష్ట్ర ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టులో కోటిన్నర చేప, రొయ్య పిల్లలు వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రాజెక్టుపై బేస్లైన్ సర్వే చేసిన ఆ శాఖ సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
*హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ చట్టంలోని నిబంధన-13 తొలగించడానికి కారణాలను జీవో 183లో ఎందుకు పేర్కొనలేదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం హైకోర్టు ప్రశ్నించింది. దాని తొలగింపునకు కారణాలను ఇప్పటికిప్పుడు అతికించినట్లుగా చెబుతున్నారని వ్యాఖ్యానించింది.
* కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. తన సహాయకుడు అలీఖాన్తో కలిసి మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో బషీరాబాగ్లోని ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయన ఐదు గంటలపాటు లోపలే ఉన్నారు.
*డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య 95వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం- భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత కూరెళ్ల విఠలాచార్యకు సాహితీ పురస్కార ప్రదానం చేశారు.
*కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా అన్నారం వద్ద ఏర్పాటుచేసిన పంపుహౌస్ నుంచి సోమవారం ఒక పంపుతో సుందిళ్ల బ్యారేజీలోకి నీటిని ఎత్తిపోశారు. మొదటి పంపును ఏడు గంటలపాటు నడిపినట్లు అధికారులు తెలిపారు.
*గోదావరి నుంచి శ్రీశైలానికి నీటి మళ్లింపుపై ఈ వారంలో తెలుగు రాష్ట్రాల ఇంజినీర్ల సమావేశం జరగనుంది. ఈ నెల 15వ తేదీన సమావేశమై చర్చించాలని నిర్ణయించినా కొందరు ముఖ్య ఇంజినీర్లు అందుబాటులో లేకపోవడంతో వాయిదాపడింది.
*చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ అభినందించారు. తాజా ప్రయోగం దేశ కీర్తికిరీటంలో మరో కలికితురాయి అని గవర్నర్ అభివర్ణించారు.
*నిండు వర్షాకాలంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. కర్ణాటకలో ఎగువ కృష్ణా ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం ఊరించినట్లే ఊరించి సద్దుమణిగింది. ఈ నెల ఆరంభంలో ఆలమట్టికి లక్ష క్యూసెక్కుల ప్రవాహం రాగా ఇప్పుడు 13వేల క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. గోదావరి పరీవాహకంలోనూ ప్రాజెక్టులు కళతప్పాయి. కడెం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద పెరిగింది. 4,254 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.
*పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి పర్యావరణ అనుమతులపై జాతీయ హరిత ట్రైబ్యునల్లో కొనసాగుతున్న కేసును ధర్మాసనం డిస్మిస్ చేసింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై బి.హర్షవర్ధన్ ఎన్జీటీని ఆశ్రయించారు. పిటిషనరే ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో జస్టిస్ రఘువేంద్ర ఎస్.రాథోడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును డిస్మిస్ చేసింది.
*దోస్త్ ద్వారా డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేక విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే గడువును మంగళవారం(ఈ నెల 23వ తేదీ) వరకు, వెబ్ ఆప్షన్లకు బుధవారం(24వ తేదీ) వరకు పొడిగించినట్లు దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి తెలిపారు.
*ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ విద్యార్థులు జవాబుపత్రాల పునఃలెక్కింపు, పునఃపరిశీలనకు ఒక రోజు గడువు పెంచారు. ఈనెల 22తో గడువు ముగియగా ఈనెల 23 (మంగళవారం)వరకుపొడిగించినట్లు ఇంటర్బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు.
*ఏపీ హోం శాఖలో ఎస్సై స్థాయి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీసు నియామక మండలి సోమవారం విడుదల చేసింది. 334 పోస్టుల భర్తీకి 2018 నవంబరులో ప్రకటన వెలువడింది.
*పోలవరం కాలువల పనుల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగిన వ్యవహారాలపై దృష్టి సారించిన నిపుణుల కమిటీ.. తదుపరి అమరావతి ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, అన్న క్యాంటీన్ల వ్యవహారాలపై దృష్టి సారించేందుకు సిద్ధమవుతోంది.
*గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం తాబాడు గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుని పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈసందర్భంగా ఐదుగురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుప్రతికి తరలించారు. కాగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారమందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని గస్తీ ఏర్పాటుచేశారు.
* ఏపీ ప్రభుత్వంపై దూకుడు పెంచింది బీజేపీ. వరుస ఆరోపణలతో అధికార పక్షాన్ని ఇరుకున పెడుతోంది. ఏపీలో బలోపేతమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్న ఏపీ బీజేపీ.. పోరాటానికి సిద్ధమైంది.
* ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రయాణీకులకు తీపికబురు అందించింది. న్యూఢిల్లీ నుంచి జోధ్‌పూర్‌కు ఈ ఏడాది సెప్టెంబర్‌ 5 నుంచి నేరుగా విమాన సర్వీసులను అందించనుంది. ఈ రూట్‌లో విమాన చార్జీలను రూ 1999గా నిర్ణయించింది. జోధ్‌పూర్‌తో పాటు ఢిల్లీ-అగర్తలా, ఢిల్లీ -దిబ్రూగఢ్‌ రూట్లలోనూ డైరెర్ట్‌ ఫ్లైట్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే నెల 14న ఈ రూట్లలో విమాన సర్వీసులను ప్రవేశపెడుతోంది.క అగర్తలా, దిబ్రూగఢ్‌ రూట్లలో విమాన చార్జీలను వరుసగా 3,9999, 4999లుగా నిర్ణయించింది. మరోవైపు ఢిల్లీ, ముంబైలను కలుపుతా ఆరు నూతన అంతర్జాతీయ విమానాలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ-జెడ్డా, ముంబె-దిబ్రూగఢ్‌ రూట్లలో ఇవి సేవలు అందిస్తాయని ఇండిగో ఎయిర్‌లైన్‌ వెల్లడించింది.
* జమ్మలమడుగులో నాటు బాంబుల కలకలం రేగింది. పెన్నానది సమీపంలోని ఇసుక తిన్నెల వద్ద కంప చెట్లను తొలగిస్తున్నారు. జేసీబీ తవ్వకాల్లో బకెట్లు కనిపించాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బకెట్లను తెరిచి చూడగా 54 నాటు బాంబులు కనిపించాయి. ఈ బకెట్లు ఎవరు పెట్టారు? ఎన్ని రోజుల క్రితం పూడ్చారు? ఇది ఎవరి పని? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.