* సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్..
ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్ నేడు జరిగింది. సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్‌కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారనే కారణంతో ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ను మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు సభలోనే ఉండి నినాదాలు చేస్తున్నారు. అయితే వారిని సభా సమావేశాలు ముగిసే వరకూ కాకుండా సభా సంప్రదాయాలు పాటించని వారిని శాశ్వతంగా బహిష్కరించాలని చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
*వారెవా.. పరిస్థితి ఇదీ..: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్
ఏపీ అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సస్పెన్షన్ చేసిన విషయం విదితమే. ఈ సెషన్స్ మొత్తం వీరిని సస్పెన్షన్ చేయడం జరిగింది. ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేయడంపై టీడీపీ శాసనసభ, శాసనమండలి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
*డిప్యూటీ స్పీకర్ కోనకు మూడు ఆప్షన్లిచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు
ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో టీడీపీ ఎమ్మెల్యేల సమావేశం పూర్తైంది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు మూడు ఆప్షన్లను ఉంచారు. క్వశ్చన్ అవర్‌లో తమ నాయకుడికి అవకాశం ఇవ్వాలని కోరతారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఈ రోజుకే పరిమితం చేయాలని.. సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తే టీడీపీ సభ్యులందరినీ చేయాలని తెలిపారు. సభ నిర్వహణకు సహకరించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. సభలో టీడీపీ అడ్డు తొలగించాలని చూడడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు
*చరిత్రాత్మక బిల్లులు సభలో ప్రవేశపెట్టాం – సీఎం వైఎస్ జగన్
ఏపీ అసెంబ్లీలో చరిత్రాత్మక బిల్లులు సభలో ప్రవేశపెట్టామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ బిల్లుతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఈర్ష్యతో ఏం చేస్తున్నారో అందరూ చూస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ వర్క్స్‌లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ఈ బిల్లులు రాకుండా అడ్డుకునే దుర్భుద్దితో ఉన్నారన్నారు. ప్రతి నియోజకవర్గంలో తాను చెప్పిందే మేనిఫెస్టోలో పెట్టామన్నారు.
* ముగ్గురు తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనసభ వాడివేడిగా ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను విషయంలో తలెత్తిన ప్రశ్న కారణంగా ముగ్గురు తెదేపా ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపా ఎన్నికల హామీపై స్పష్టతకు తెదేపా సభ్యుడు రామానాయుడు డిమాండ్ చేశారు. అయితే మేనిఫెస్టోలో అలాంటి హామీ ఇవ్వలేదని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
* సమాధానం చెప్పలేకే సస్పెన్షన్: అచ్చెన్న
ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ముగ్గురు ఉపనేతలను సస్పెండ్ చేశారని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. హామీలు విస్మరిస్తున్నారని సభలో ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా?అని ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ.. తన స్థానం నుంచి కదల్లేదని..ఎవరితోనూ దుర్భాషలాడలేదని అన్నారు. 45 ఏళ్లకే పింఛన్ ఇస్తానని పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారని, దానిని విస్మరిస్తున్నారని చెబితే సస్పెండ్ చేస్తారా?అని దుయ్యబట్టారు.
* ఖబడ్దార్ చంద్రబాబూ..!: కోటంరెడ్డి
ఎస్సీ ఎస్టీ, బీసీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం మేర రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్ష తెదేపా జీర్ణించుకోలేకపోతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ‘ఖబడ్దార్ చంద్రబాబు’ అంటూ నేరుగా ప్రతిపక్షనేతను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉండగా కనీసం తమ గోడు చెప్పుకునేందుకు కూడా అవకాశం కల్పించలేదని.. తాము ఆందోళన చేస్తే బయటకు గెంటేశారని అన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేస్తే ఖబడ్దార్ అంటూ కోటం రెడ్డి శాసనసభలో పదేపదే వ్యాఖ్యలు చేశారు. దీంతో స్పీకర్ మైక్ కట్ చేశారు.
* అసెంబ్లీ నుంచి తెదేపా వాకౌట్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంలేదంటూ తెదేపా మరోసారి నిరసనకు దిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి వాకౌట్ చేశారు. మంగళవారం సభ ప్రారంభం నుంచే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ముగ్గురు తెదేపా సభ్యులను సస్పెండ్ చేయడంపై పెద్ద దుమారం చెలరేగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా సభ్యులంతా నినాదాలు చేశారు. దీంతో టీడీఎల్పీ ఉపనేత రామానాయుడుని మార్షల్స్ బయటకు తీసుకెళ్లిపోయారు. అనంతరం అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడిపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని తెదేపా సభ్యులు ఉపసభాపతిని కోరారు. ఈ విషయాన్ని ఆయన అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లగా.. సీఎంతో చర్చించిన తర్వాత తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో మంగళవారం తెదేపా సభ్యులు వాకౌట్ చేయడం చర్చనీయాంశమైంది.
*చంద్రబాబు నాయుడు ఖబర్దార్..: కోటంరెడ్డి
గవర్నర్ వీడ్కోలు సభలో నరసింహన్ మాట్లాడుతూ జగన్ అద్భుత ముఖ్యమంత్రి అని, రాష్ట్ర ప్రజలంతా జగన్ పాలనలో ఆనందంగా ఉన్నారని ఆయన చేసినవ్యాఖ్యలను మంగళవారం అసెంబ్లీలో వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావడం టీడీపీ చూసి తట్టుకోలేకపోతోందని.. దీన్ని ఓర్చుకోలేక టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ‘చంద్రబాబు నాయుడు ఖబర్దార్..మీ సభ్యులకు చెప్పు.. ఖబర్దార్ చంద్రబాబు’ అంటూ కోటంరెడ్డి వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇంతకంటే దారుణంగా జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వాఖ్యలు చేసి.. చప్పట్లు చరిచిన వాళ్లు ఇప్పుడూ అదే పద్ధతిని కొనసాగిస్తున్నారని, అందుకే మళ్లీ చెబుతున్నా ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, మీ సభ్యులకు జాగ్రత్త అని చెప్పాలని కోటిం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
* జగన్‌లో అసహనం పెరిగిపోతోంది: కళా
అసెంబ్లీలో వైసీపీ కల్లబొల్లి మాటలు చెబుతోందని టీడీపీ నేత కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎన్నికలకు ముందు చెప్పిందొకటి, ఇప్పుడు చేస్తోందొకటి అని చెప్పారు. టీడీపీపై బురదజల్లడమే జగన్ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. జగన్‌లో అసహనం పెరిగిపోతోంది, సభను నడపాల్సింది స్పీకర్..సీఎం కాదన్నారు. ప్రజల తరపున ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అని కళా వెంకట్రావు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తున్నామన్నారు.
* బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు
సామాజికంగా వెనుకబడిన బీసీలకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాలనలో బీసీలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఆయన పేర్కొన్నారు. బీసీలను కేవలం కులవృత్తులకు పరిమితం చేయాలనే దురాలోచన చంద్రబాబుకు ఉందని ఆయన మండిపడ్డారు. బీసీల్లో అనేకమైన సంచార జాతులు ఉన్నాయని పేర్కొన్నారు. బీసీల సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి టీడీపీకి లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఉన్నతమైన స్థానంలో చూడాలనే దృఢ సంకల్పం సీఎం వైఎస్ జగన్‌ది అని ఆయన స్పష్టం చేశారు.
* ఒక పేపర్ క్లిప్పింగ్‌తో ఇంత రాద్ధాంతమా?: బుగ్గన
అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభమైన తర్వాత బుగ్గున మాట్లాడుతూ.. ప్రతిరోజూ సంబంధంలేని విషయాలను టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు పంపాలని టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తమలో అసహనం లేదని, సభ సజావుగా జరగాలనే తాము భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అంశంపై చర్చ జరుగుతుంటే.. ఒక పేపర్ క్లిప్పింగ్‌ను పట్టుకొని టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్ కూడా మూడుసార్లు సభలో సమాధానం ఇచ్చారని, వాస్తవాలు తెలుపుతూ వీడియో కూడా ప్రసారం చేశారని బుగ్గన తెలిపారు. ఎన్నోసార్లు సభలో మాట్లాడాలని అవకాశం ఇచ్చినా.. టీడీపీ సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సభను టీడీపీ వాడుకుంటోందని ఆయన అన్నారు.
* అధ్యక్షా.. ఈ పక్కన సౌండ్ ప్రూఫ్ గోడ కట్టండి!
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల రాద్ధాంతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనదైన శైలిలో చురకలు అంటించారు. సభలో చంద్రబాబు కొద్దిగా స్పీడ్ పెంచారని, నిన్న టీడీపీ సభ్యులు పొడియం దగ్గరికి వెళితే.. ఈ రోజు వారు ఏకంగా సస్పెండ్ అయ్యేలా ప్రవర్తించారని అంబటి పేర్కొన్నారు. మంచి విషయం మీద పోరాటం చేస్తే.. మిమ్మల్ని అభినందిస్తామని, కానీ, ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న ఇష్యూయే లేదని స్పష్టం చేశారు. అంబటి మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు గోల చేయడంతో.. ‘అధ్యక్షా.. ఈ పక్కన సౌండ్ ఫ్రూప్ గోడ కట్టండి.. వినలేక సచ్చిపోతున్నాం’అంటూ ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూశాయి.
*జగన్ విర్రవీగుతున్నారు: వర్ల రామయ్య
ఎక్కుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారని ముఖ్యమంత్రి జగన్ విర్రవీగుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసనసభలో ప్రతిపక్షం వేసిన ప్రశ్నలకు అధికారపక్షం సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఇప్పుడు బుకాయిస్తారా? అని ధ్వజమెత్తారు. ప్రజల తరపున ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అని నిలదీశారు. ఇది శాసనసభ కాదు… అనైతిక సభ ఘాటైన పదజాలంలో రామయ్య విరుచుకుపడ్డారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌తో సభ విశ్వసనీయత, ఔదార్యం కోల్పోయిందన్నారు.
*ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనుకున్నాం..కానీ: చంద్రబాబు
శాసనసభ నుంచి బీసీ నాయకుడిని సస్పెండ్ చేసి.. బీసీలకు న్యాయం చేస్తామని ఎలా చెబుతారని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పన్షన్‌పై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ కూడా హెల్ప్‌లెస్ అయిపోయారని విమర్శించారు. సభాపతి ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయట్లేదని ఆరోపించారు. విప్‌లు కూడా ఆ ప్రయత్నం చేయడం లేదన్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనుకున్నాం.. కానీ సలహాలు ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వకపోతే ఎలా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
*బయటకు పంపి నన్ను అవమానినంచారు: అచ్చెన్నాయుడు
అసెంబ్లీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స్పీకర్‌కు లేఖ రాశారు. అధికారపక్షం సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో తన స్థానంలో నిల్చొని నిరసన తెలిపానని అచ్చెన్నాయుడు వివరించారు. సీట్లోనే ఉన్నప్పటికీ తనను సస్పెండ్ చేయడం పట్ల ఆశ్చర్యానికి గురయ్యానని అన్నారు. ఎలాంటి వాగ్వాదానికి, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడలేదన్నారు. అలాంటిది తనను అకారణంగా సస్పెండ్ చేశారని, మార్షల్స్‌తో బయటకు పంపి అవమానించారని లేఖలో పేర్కొన్నారు. శాసనసభ్యుడినైన తన హక్కులను హరించారని అన్నారు. అన్యాయంగా తనపై తీసుకున్న చర్యలను పునర్ పరిశీలించాలని స్పీకర్‌ను అచ్చెన్న కోరారు.
* న్షన్ పథకంపై అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్
ఏపీ అసెంబ్లీలో 45 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్ పథకంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఈ పెన్షన్ పథకంపై అధికార పార్టీ సభ్యులను ప్రశ్నించగా మొదట మంత్రి పెద్దిరెడ్డి , ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా.. మోసం చేయడం అబద్ధాలు ఆడటం మా ఇంట వంటా లేదని మరోసారి చెబుతున్నాని జగన్ చెప్పుకొచ్చారు.‘ఎన్నికలకు వెళ్లే ముందు ఈ మేనిఫెస్టో చూపించి ఓట్లు అడిగాము. ఈ మేనిఫెస్టో చూసిన తర్వాతే ప్రజలు మాకు ఓట్లేశారు. ఎన్నికలప్పుడు ‘జగన్ అనే నేను..’ ఏం మాట్లాడానో టీవీ స్క్రీన్‌లలో చూపిస్తాను. చూసిన తర్వాత మీకు మనస్సాక్షి ఉంటే క్షమాపణ చెప్పమని కోరుతున్నాను’ అని జగన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. అసెంబ్లీలోనే ఎన్నికల సమయంలో మాట్లాడిన స్పీచ్‌ను సభలో ప్రసారం చేసి వినిపించారు.
వీడియోలో ఏముంది..!?
” నాన్నగారు కలలు కన్న స్వప్నం ప్రతి అక్క, చెల్లెమ్మ లక్షాధికారి కావాలి. అక్కాచెల్లెమ్మ సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది.. రాష్ట్రం కూడా బాగుంటుందని గట్టిగా నమ్మేవారిలో మొట్టమొదటి వ్యక్తిని నేను అని గర్వంగా చెబుతున్నాను. వైఎస్సార్ చేయూత అనే కార్యక్రమం ద్వారా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ అక్కలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం. ఈ నిర్ణయాన్ని కొందరు వెటకారం చేశారు” అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
* ప్రభుత్వంలో అసహనం పెరుగుతోంది:చంద్రబాబు
ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఒక బీసీ నాయకుడిని సస్పెండ్ చేసి బీసీ బిల్లు ప్రవేశ పెట్టారనే విషయం అర్థమవుతోందని తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెదేపా శాసనసభాపక్ష ఉపనేతలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడును అకారణంగా సస్పెండ్ చేస్తే సభలో తాము ఖాళీగా ఎలా కూర్చుంటామని ప్రశ్నించారు. అసెంబ్లీ వద్ద మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వంలో అసహనం బాగా పెరిగిపోతోందని.. రాష్ట్రమంతా అభద్రతా భావం వచ్చిందని విమర్శించారు. తాము ప్రభుత్వంపై యుద్ధానికి కత్తులు, కటార్లు తీసుకెళ్లడం లేదన్నారు. ఎన్నికల్లో వైకాపా ఇచ్చిన హామీలను గుర్తు చేస్తుంటే తప్పు అంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. తెదేపా ఉపనేతల సస్పెన్షన్‌పై ఏం చేయాలో శాసన సభాపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
* బీసీ కమిషన్ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
సామాజికంగా వెనుకబడిన బీసీలకు న్యాయం చేకూర్చేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ బిల్లుకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. అంతకుముందు బీసీ కమిషన్ బిల్లుపై సభలో చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ కృషి చేయడం అభినందనీయమన్నారు. శాశ్వత బీసీ కమిషన్ బిల్లుపై అసెంబ్లీ చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెనుకబడిన వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. సమాజంలో బీసీలు ఇతర వర్గాలతో సమాన స్థాయికి ఎదగాలనే బీసీ కమిషన్ బిల్లును తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు హయాంలో బీసీల అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
ఏపీ అసెంబ్లీలో సస్పెన్షన్లు ప్రారంభం–TNI కధనాలు
Related tags :