Editorials

కాశ్మీరులో వేలుపెడతా

Trump Says He Is Ready To Brokerage On Kashmir Issue

కశ్మీరు సమస్య పరిష్కారం కోసం భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ దేశం దిద్దుబాటు చర్యలకు దిగింది. కశ్మీర్‌ అంశం పూర్తిగా ద్వైపాక్షిక సమస్య అని.. దీనిపై ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోదలిస్తే అమెరికా స్వాగతిస్తుందన్నారు. అయితే అమెరికా కేవలం ఈ విషయంలో సహకారం మాత్రమే అందిస్తుందని చెప్పుకొచ్చారు. కశ్మీర్‌పై అమెరికా వైఖరి మార్చుకోబోతోందా అని శ్వేతసౌధంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఆ దేశ అధికార ప్రతినిధి పై విధంగా స్పందించారు. అలాగే ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ తీసుకునే పటిష్ఠ చర్యల ఆధారంగానే ద్వైపాక్షిక చర్చలకు మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ హామీ ఇచ్చారని, అంతర్జాతీయ సమాజం సైతం ఆ దేశంపై ఆంక్షలు విధించిందన్నారు. భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కశ్మీరుపై సహాయపడగల అవకాశం వస్తే మధ్యవర్తిగా వ్యవహరించడానికి ఇష్టపడతానని సోమవారం ఇమ్రాన్‌ఖాన్‌తో భేటీ అయిన సందర్భంగా ట్రంప్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే మోదీ ఈ విషయంపై తనతో చర్చించారని ట్రంప్‌ అన్యాపదేశంగా చెప్పుకొచ్చారు. ట్రంప్‌ వ్యాఖ్యల్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని.. ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. అలాగే విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ట్రంప్‌తో భేటీ సందర్భంగా మోదీ కశ్మీర్‌ మధ్యవర్తిత్వంపై ఎలాంటి చర్చ జరపలేదని తెలిపారు. ట్రంప్‌ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తమని స్పష్టం చేశారు. అలాగే అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు సైతం ట్రంప్‌ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఈ విషయంలో ట్రంప్‌ తరఫున క్షమాపణలు కోరుతున్నామనడం గమనార్హం. ట్రంప్‌ వ్యాఖ్యలు భారత్‌-అమెరికా మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్న నిపుణుల విశ్లేషణల నేపథ్యంలోనే అమెరికా మెత్తబడ్డట్లు తెలుస్తోంది.