దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల ప్రస్తుత విలువెంతో చెప్పాలంటూ మద్రాసు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జయలలితకు చెందిన రూ.913కోట్ల విలువైన ఆస్తులకు ప్రత్యేకంగా సంరక్షకుడిని నియమించాలని కోరుతూ అన్నాడీఎంకే నిర్వాహకులు గతంలో మద్రాసు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇదే పంథాలో చెన్నైకు చెందిన పుగళేంది, జానకీరామన్లు సైతం వ్యాజ్యాలు వేశారు. జయలలిత పోయెస్ గార్డెన్లోని ఇంటిని స్మారక నివాసంగా మార్చకూడదని ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో జయలలిత రూ.17కోట్ల పన్ను బకాయిలు చెల్లించలేదని ఆదాయపు పన్ను శాఖ తరఫున సమాధాన పిటిషన్ సమర్పించారు. జయలలితకు చెందిన నాలుగు ఆస్తులు స్తంభింపజేసినట్టూ ఐటీ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్లు న్యాయమూర్తులు జస్టిస్ కృపాకరన్, జస్టిస్ అబ్దుల్ కుద్దూస్ల సమక్షంలో సోమవారం విచారణకు వచ్చాయి. అందరి వాదనలు విన్న తర్వాత.. జయలలిత ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి ప్రస్తుత విలువ ఎంత? అనే విషయాలను సమగ్రంగా నివేదించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. పోయెస్గార్డెన్లోని జయలలిత ఇంటిని స్మారక నివాసంగా మార్చే పనులు ఏ దశలో ఉన్నాయో వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేశారు.
అసలు జయలలిత మొత్తం ఆస్తుల విలువ తెలుసా?
Related tags :