తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంపుకు రంగం సిద్ధం: త్వరలో కమిషన్ ఏర్పాటు…….
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు అనువైన మార్గాలను పసిగట్టి ప్రజలను తమవైపుకు ఆకర్షించుకునే ప్రయత్నం మెుదలు పెట్టింది.
మెుదటి కేబినెట్ సమావేశంలోనే రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న బీజేపీ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు స్కెచ్ రెడీ చేస్తోంది. అటు తెలుగు రాష్ట్రాలపైనా కూడా కన్నేసింది బీజేపీ.
గతంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదన్న బీజేపీ నేడు అదే ఆయుధంగా మలచుకోబోతుంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 2014 అసెంబ్లీలో ఎన్నికలకు ముందు రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని, అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి ఇరు రాష్ట్రాలు.
ఆనాడు అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకస్మాత్తుగా నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని తెరపైకి తెచ్చింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని తెలుస్తోంది.
నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని త్వరితగతిన పూర్తి చేసి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలనే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గాల పెంపుకు సంబంధించి కీలకమైన సవరణలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఆ సవరణలతో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసే దిశగా కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు పీఎంవో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే తెలుగు రాష్ట్రాలతోపాటు జమ్మూ కశ్మీర్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు సంబంధించి కేంద్ర న్యాయ శాఖ, హోంశాఖలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.
మెుత్తానికి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 225కు పెరిగే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో ఉన్న 119 స్థానాలు 151 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది.