జగన్మాత పార్వతీదేవి తనయుడైన విఘ్నేశ్వరుడు విఘ్నాలను నివారించే మూర్తిగా అందరి చేత పూజలందుకుంటాడు. ఎలాంటి కార్యాన్నయినా ప్రారంభించేముందు స్వామిని పూజించి ప్రారంభిస్తే విజయం లభిస్తుంది. ఆదిదంపతుల ప్రథమ పుత్రరత్నమైన గణనాధుడికి తొలి పూజ అన్ని విధాలుగా అన్ని శుభాలను చేకూర్చుతుంది.పంచారామ క్షేత్రాలను ఒక్క రోజులో దర్శించుకుంటే ముక్తిదాయకం అని చెబుతారు. అదే కోవలో మహారాష్ట్రలోని అష్టవినాయక క్షేత్రాలను ఒక వరుసలో దర్శించుకోవడం ఆనవాయితీ. కాకపోతే ఒక్కరోజులో కష్టం. సరిగ్గా ప్రణాళిక వేసుకుంటే రెండు రోజుల్లో అన్ని చోట్లకూ వెళ్లొచ్చు.
**బల్లాలేశ్వరుడు అష్ట వినాయక దర్శనం
పుణెకి 100 కిలో మీటర్ల దూరాన పాలి క్షేత్రంలో వెలసిన స్వామి బల్లాలేశ్వరుడు అంటే బాలగణపతి అనుకోవచ్చు. అష్ట క్షేత్రాల్లోనూ ఒక భక్తుడి పేరిట వెలసిన స్వామి ఈయనే. బల్లాల్ అనే పరమ భక్తుడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన గణపతి అతని పేరుతోనే ఈ గ్రామంలో వెలిశాడని స్థలపురాణం. తూర్పముఖంగా వెలసిన బల్లాలేశ్వరుడి విగ్రహంపై దక్షిణాయన కాలంలో సూర్యకిరణాలు పడటం ఇక్కడి ప్రత్యేకత.
**వరద వినాయకుడు అష్ట వినాయక దర్శనం
మహడ్ క్షేత్రంలో స్వామి వరద వినాయకుడు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రుక్మాంగదుడనే మహారాజు వాచక్నవి అనే రుషి దర్శనార్థం ఈ గ్రామానికి వచ్చాడట. రాజు వైభోగాన్ని కళ్లారా చూసిన రుషిపత్ని ముకుంద అతనిపై మనసు పడింది. రాజు అందుకు ఒప్పుకోకుండా అక్కణ్నుంచి వెళ్లిపోగా అదే అదనుగా ఇంద్రుడు రుక్మాంగదుడి రూపంలో ముకుంద దగ్గరికి వచ్చాడట. ఆ ఆ కలయిక వల్ల గృత్సమధుడు అనే పిల్లవాడు పుట్టాడు. పెరిగి పెద్దయ్యాక తన పుట్టుక రహస్యం తెలుసుకున్న ఆ కుర్రవాడు.. అందరి పాపాలూ తొలగిపోవాలని వినాయకుణ్ని ప్రార్థించాడట. ఆ పిల్లవాడి భక్తికి మెచ్చిన గణనాథుడు ప్రత్యక్షమై కోరిన వరాన్ని ఇచ్చి అక్కడే స్వయంభువుగా వెలిసి వరద వినాయకుడిగా సుప్రసిద్ధుడయ్యాడట. ఈ స్వామి ఆలయంలో గర్భగుడిలోని దీపం గత వందేళ్లుగా అఖండంగా వెలుగుతోందని చెబుతారు స్థానికులు.
**చింతామణి గణపతి అష్ట వినాయక దర్శనం
షోలాపూర్ పుణె మార్గంలో ఉండే థేవూర్ క్షేత్రంలో స్వామి చింతామణి గణపతిగా పూజలందుకుంటున్నాడు. పూర్వం కపిల మహాముని వద్ద కోరిన కోర్కెలు తీర్చే ‘చింతామణి’ అనే రత్నం ఉండేదట. ఒకసారి ఆ ప్రాంతాన్ని పాలించే అభిజిత మహారాజు కొడుకైన గణరాజు.. కపిల మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. చింతామణి సాయంతో యువరాజుకూ అతని పరివారానికీ అప్పటికప్పుడు విందు సిద్ధం చేశాడట ఆ మహర్షి. ఆ వింతకు ఆశ్చర్యపోయిన యువరాజు కపిలమహామునిని ఏమార్చి చింతామణిని అపహరించాడు. అప్పుడు కపిలుడు వినాయకుని ప్రార్థించి ఆ మణిని తిరిగి పొందాడనీ.. గణరాజును చంపి ఆ మణిని తెచ్చిచ్చిన గణపతి ‘చింతామణి గణపతి’గా ప్రసిద్ధి చెందాడనీ స్థలపురాణం. ఆ యుద్ధం ఒక కబంధ వృక్షం వద్ద జరగడం వల్ల ఈ వూరిని కబంధతీర్థం అని కూడా అంటారు.
**మయూరేశ్వరుడు అష్ట వినాయక దర్శనం
పుణె జిల్లా బారామతి తాలూకాలోని మోర్‌గావ్ గ్రామంలో వెలసిన వినాయకుడు మూషికవాహనంపై కాకుండా మయూరాన్ని ఆసనంగా చేసుకోనివుండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. తన తమ్ముడు సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనమైన మయూరాన్ని అధిష్ఠించి ఉంటాడు. ఆ కథేంటంటే.. ఒకప్పుడు సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా హింసించేవాడట. దీంతో మునులు దేవతలను వేడుకోగా వినాయకుడు తన తమ్ముడి వాహనాన్ని అధివసించి భువికి దిగివచ్చి ఆ రాక్షసుణ్ని మట్టుబెట్టాడట. అందుకే ఈ గణేశుణ్ని మయూరేశ్వరుడు, మోరేష్, మోరేశ్వర్ అని పిలుస్తారు. అసురసంహారం గావించిన స్వామి కాబట్టి.. ఈ క్షేత్రంలో వినాయక చవితితోపాటు విజయదశమి వేడుకలను కూడా అత్యంత వైభవంగా జరిపిస్తారు.
**సిద్ధి వినాయకుడు అష్ట వినాయక దర్శనం
పూర్వం మధుకైటభులనే రాక్షసులతో శ్రీ మహావిష్ణువు యుద్ధం చేస్తూ వినాయకుడి సాయం అర్థించాడట. శ్రీహరి అభ్యర్థన మేరకు రణరంగాన ప్రత్యక్షమయ్యాడట గణపతి. ఆ స్వామి దర్శనంతో విష్ణుమూర్తి రెట్టించిన బలం, వేగం, ఉత్సహాలతో రాక్షసులను మట్టుబెట్టాడు. వినాయకుడి వరం వలన కార్యసిద్ధి కావడంతో ఈ ప్రాంతం సిద్ధక్షేత్రం అయింది. వినాయకుడి సహకారానికి సంతోషించిన విష్ణుమూర్తి తానే స్వయంగా ఈ క్షేత్రంలో ఆలయాన్ని నిర్మించి గణపతిని ప్రతిష్ఠించాడట. ఈ ఆలయం ఎత్తైన కొండపై ఉంటుంది. స్వయంభువుగా భావించే స్వామి విగ్రహానికి ఇరువైపులా సిద్ధి, బుద్ధి దేవతలున్నారు. మిగతా క్షేత్రాల్లోని విగ్రహాలకు భిన్నంగా ఇక్కడ స్వామి వారి తొండం కుడివైపునకు తిరిగి ఉంటుంది.
**మహాగణపతి అష్ట వినాయక దర్శనం
సిద్ధి, బుద్ధి సమేతంగా పద్మంలో కొలువైన రంజన్‌గావ్ వినాయకుడు మహాగణపతి. పూర్వం త్రిపురాసురుడు లోకకంటకుడుగా మారితే శివుడు అతడితో యుద్ధానికి దిగి ఓడిపోయాడు. అప్పుడు నారదమహర్షి వినాయకుడే స్వయంగా ప్రసాదించిన సంకటమోచన గణపతి స్తోత్రాన్ని శివుడికి తెలిపి ఆ గణనాథుణ్ని పూజించి అనుగ్రహం పొందమని చెప్పాడట. అప్పుడు హరుడు విఘ్నాధిపతి అయిన తన కుమారుణ్ని తలచుకుని విజృంభించి త్రిపురాసురుణ్ని మట్టుబెట్టాడట. తన విజయానికి కారణమైన వినాయకుడి విగ్రహాన్ని శంకరుడే స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించాడని గణేశపురాణం చెబుతోంది.
**విఘ్న వినాయకుడు అష్ట వినాయక దర్శనం
ఓఝూర్ ప్రాంతంలో ఒకప్పుడు విఘ్నాసురుడనే రాక్షసుడు విధ్వంసం సృష్టించేవాడట. మునుల జపతపాదులకు భంగం కలిగించేవాడట. అతని బాధ భరించలేక మునులు వినాయకుడిని ప్రార్థించగా ఆ స్వామి ప్రత్యక్షమై విఘ్నాసురుడితో యుద్ధానికి దిగాడు. రణం మొదలైన కొద్దిసేపటిలోనే… తాను గణేశుడి మందు నిలబడలేనని గ్రహించిన విఘ్నాసురుడు ఆ స్వామికి లొంగిపోయాడట. తన పేరు మీద విఘ్నేశ్వరుడిగా అక్కడే కొలువుండాలని కోరాడట. అలా వెలిసిన విఘ్నేశ్వరుడికి ఆలయం కట్టించారు అక్కడి మునులు ఇదీ ఓఝూర్ స్థలపురాణం.
**గిరిజాత్మజ వినాయకుడు అష్ట వినాయక దర్శనం
గిరిజాత్మజుడంటే పార్వతీదేవి కుమారుడు అని అర్ధం. ఈ స్వామి దర్శనం చాలా కష్టం. ఎత్తైన కొండమీద ఒక గుహలో కొలువై ఉంటాడీ వినాయకుడు. పైకి 238 మెట్లుంటాయి. పిల్లలూ, వయసులో ఉన్నవారూ చురుగ్గా ఎక్కొచ్చుగానీ.. పెద్దవాళ్లకు కష్టమే. అలాంటివారి కోసం డోలీ ఏర్పాట్లు కూడా ఉన్నాయక్కడ. పుత్రుడి కోసం పార్వతీదేవి పన్నెండేళ్లు తపమోనర్చిన ప్రదేశం లేన్యాద్రి పుణ్యక్షేత్రం. అనంతర కాలంలో అమ్మచేతి నలుగుపిండి నుంచి రూపుదిద్దుకున్నాడు బాలగణపతి. తర్వాత కౌమారప్రాయం వచ్చే దాకా తల్లితో కలిసి ఇక్కడే ఉన్నాడని ఐతిహ్యం. నలుగు పిండితో ఒక విగ్రహాన్ని చేస్తే ఎలా ఉంటుందో అలా హెచ్చుతగ్గులతో చిత్రంగా ఉంటుందిక్కడి విగ్రహం.ప్రారంభించిన చోటికే.. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ క్షేత్రాల్లో ఎక్కణ్నుంచి యాత్ర ప్రారంభిస్తామో మళ్లీ అక్కడికి తిరిగిరావాలి. అప్పుడే యాత్ర పూర్తయినట్లు యాత్రామార్గం ఆద్యంతం పచ్చటి ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుంది.
**ఎలా చేరుకోవాలి
* మహారాష్ట్రలోని పుణె నగరం చేరుకొని అక్కడ నుంచి అష్టవినాయక యాత్ర ప్రారంభించవచ్చు.
* పుణెకుల దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, విమాన, బస్సు సౌకర్యాలున్నాయి.
* ఈ క్షేత్రాలకు కార్లలో వెళ్లలేని వారి కోసం మహారాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముంబై షోలాపూర్ నగరాల నుంచి అష్టవినాయక క్షేత్రదర్శనం స్పెషల్ ప్యాకేజీ బస్సులు ఉంటాయి. రుసుము కూడా తక్కువే
1. 27, 28న దిల్లీలో సత్యదేవుని వ్రతాలు
దిల్లీలోని తితిదే ధ్యానమందిరంలో ఈనెల 27, 28వ తేదీల్లో సత్యదేవుని వ్రతాలు, శాంతి కల్యాణం జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, అన్నవరం దేవస్థానం, తితిదే, దిల్లీలోని ఏపీ భవన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 27న ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 గంటల వరకు రెండు బృందాలుగా వ్రతాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటలకు శాంతి కల్యాణం జరుగుతుంది. 28న ఉదయం ప్రముఖులు, ముఖ్య అధికారుల కోసం వ్రతాలు నిర్వహిస్తారు. వ్రతాల నిర్వహణకు అన్నవరం దేవస్థానం నుంచి ఉత్సవమూర్తులు, పూజాసామగ్రిని తీసుకెళ్తున్నారు. వ్రతపురోహితులు, అర్చకులు, అధికారులు, సిబ్బంది దిల్లీ వెళ్లనున్నారు.
2. శ్రీవారి సేవలో ఏపీ నూతన గవర్నర్ హరిచందన్
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఏపీ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం దర్శించుకున్నారు. మధ్యాహ్నం వయోవృద్ధుల క్యూలైనులో ఆలయంలోకి సతీ సమేతంగా ప్రవేశించారు. ఆలయ మహాద్వారం వద్ద తితిదే అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి గవర్నర్ దంపతులను శ్రీవారి సన్నిధికి ఆహ్వానించారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవరాహస్వామి వారిని గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో తిరుచానూరు చేరుకుని శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రేణిగుంట చేరుకుని విజయవాడకు విమానంలో ప్రయాణమయ్యారు.
3. అమర్నాథ్కు 22రోజుల్లోనే 2.8లక్షలమంది!
గత ఏడాది అమర్నాథ్ యాత్రలో 60రోజులకు 2.85లక్షల మంది యాత్రికులు పాల్గొంటే.. ఈ ఏడాది కేవలం 22రోజుల్లోనే ఆ సంఖ్యను దాటేశారు. యాత్రికుల సంఖ్య సోమవారం సాయంత్రానికి గత ఏడాది మార్కును దాటిందని, ప్రస్తుతమున్న రద్దీ ప్రకారం, బుధవారం 3లక్షల మార్కును దాటే అవకాశముందని అధికారులు వెల్లడించారు. గడచిన నాలుగేళ్ల సంఖ్య చూస్తే.. 2015లో 3.52 లక్షలమంది, 2016లో 3.20లక్షలు, 2017లో 2.60లక్షలమంది అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నారు.
4. ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహం
ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహాన్ని నిర్మించాలని యూపీ సర్కారు నిర్ణయించింది. అయోధ్యలో 100 ఎకరాల స్థలంలో 251 మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహాన్ని నిర్మించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఈ విగ్రహ నిర్మాణం కోసం సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని నిర్మించిన నిపుణుల సహకారం తీసుకోనున్నారు. అయోధ్య సమగ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, అందులో భాగంగానే రాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నామని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అదే స్థలంలో రాముడి ఇతివృత్తంతో డిజిటల్ మ్యూజియం, లైబ్రరీ నిర్మిస్తామని వెల్లడించారు. విగ్రహ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు.
5. అంజన్నకు అగ్గిపెట్టేలో ఇమిడే శాలువా బహూకరణ
కొండగట్టు ఆంజనేయ స్వామి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ అనే భక్తుడు తయారు చేసిన అగ్గిపెట్టేలో ఇమిడే రెండు మీటర్ల శాలువాను ఆలయ అధికారులకు అందజేశారు. అధికారులు, అర్చకులు విజయ్తో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించి అనంతరం స్వామి వారి ప్రాకార మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. భవిష్యత్తులో నేతన్నల కుల వృత్తి మరింత ఖ్యాతి సాధించేలా పలు సంస్కరణలు, విభిన్నమైన ఉత్పత్తులను తయారు చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, అర్చకులు రాము, ఆలయ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.
6. నేటి నుంచి పవిత్రోత్సవాలు -తమిళనాడులోని శ్రీరంగం నుంచి వచ్చిన పవిత్రాలు
మోహినీపురంగా భాసిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం బుధవారం నుంచి నిర్వహించనున్న పవిత్రోత్సవాలకు ముస్తాబైంది. ఆలయాన్ని పూలతో, అరటి గెలలతో కూడిన చెట్లతో అలంకరించారు. తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం నుంచి మూడు రకాల పవిత్రాలను ఉత్సవాల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. వరుసగా అయిదోసారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ సహాయ కమిషనర్ జీవీడీఎన్ లీలాకుమార్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
* అనేక ఉత్సవాల సమయంలో దోషాల వల్ల కలిగే ఆటంకాల నివారణ కోసం ఏటా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.
* పవిత్రోత్సవాల సందర్భంగా ఆర్జిత రుద్రాభిషేకాలను ఈ నెల 27 వరకు రద్దు చేశారు. 24, 25 తేదీల్లో నిత్యశాంతి కల్యాణ మహోత్సవాన్ని కూడా తాత్కాలికంగా రద్దుచేసినట్లు చెప్పారు. సాధారణ అభిషేకాలు యథావిధిగా ఉంటాయన్నారు.
* 27న స్వామివారి జన్మ నక్షత్రమైన ఆషాఢ ఆడి కృత్తికను పురస్కరించుకొని అన్నిరకాల ఆర్జిత సేవలను రద్దుచేస్తున్నట్లు చెప్పారు.
* 27న శాకంబరి అలంకరణ ఉంటుందన్నారు. కూరగాయలు ఇచ్చే రైతులు, వ్యాపారులు, భక్తులు 26 తేదీలోగా ఆలయంలో ఇవ్వాలని సూచించారు. ్ర ఇంతకు ముందెన్నడూ లేని విధంగా 27న ఉదయం 100 మంది భక్తులతో పాలకావిడి ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. పాలకావిడి గ్రామోత్సవంలో స్వామివారు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిస్తారన్నారు. 25 కిలోల వెండితో తయారు చేసిన మయూర వాహనాన్ని మోపిదేవికి చెందిన ఓ భక్తుడు ఇవ్వనున్నట్లు తెలిపారు. ్ర ఆలయ పర్యవేక్షకుడు మధుసూదనరావు, సీనియర్ సహాయకుడు నాగమల్లేశ్వరరావు, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అధికారులు పాల్గొన్నారు.
7. శుభమస్తు
తేది : 24, జూలై 2019*
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సౌమ్యవాసరే (బుధవారం)
క్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : సప్తమి
(నిన్న సాయంత్రం 4 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 5 ని॥ వరకు సప్తమి తిధి అష్టమి తిధి)
నక్షత్రం : రేవతి
(నిన్న మద్యాహ్నం 1 గం॥ 14 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 42 ని॥ వరకు రేవతి నక్షత్రం తదుపరి అశ్వని నక్షత్రం)
యోగము : (సుకర్మ ఈరోజు ఉదయం 8 గం ll 46 ని ll వరకు తదుపరి ధృతి రేపు ఉదయం 9 గం ll 0 ని ll వరకు)
కరణం : (భద్ర(విష్టి) ఈరోజు తెల్లవారుఝాము 5 గం ll 15 ని ll వరకు)
(భవ ఈరోజు రాత్రి 6 గం ll 5 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మద్యాహ్నము 12 గం ll 23 ని ll)
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 13 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 49 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 23 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 43 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 52 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : మీనము
8. శుభోదయం*
*మహానీయుని మాట*
“పవిత్రమైన ఆలోచనతో పనిచేసేవానికి నీడలా ఆనందం వెన్నంటే ఉంటుంది.”
*నేటీ మంచి మాట*
“శత్రువుని గెలవడం కన్నా శత్రుత్వాన్ని నిర్మూలించడం క్షేమదాయకం.”
9. నేటి ఆణిముత్యం*
పాముకన్న లేదు పాపిష్టి గుణము
అట్టి పాము చెప్పినట్లు వినును
ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు
విశ్వధాభిరామ వినురమేమ
*తాత్పర్యం:*
ఈ పద్యంలో వేమన మూర్ఖుని గుణమును గురించి వివరించాడు. పాము వంటి పాపిష్టి ప్రాణియైనా చెప్పినట్లు వినును. కానీ మూర్ఖుని బుద్దిని మార్చగల సమర్థులు ఎవ్వరు లేరు
10నేటి సుభాషితం*
*మీ హృదయంలో ఒక్కసారి అసూయకి తావిచ్చారంటే అది మీకు తెలియకుండానే పెరిగి మిమ్మల్ని కృంగదీస్తుంది.కనుక అసూయకు దూరంగా ఉండండి.*
11. నేటి సామెత *
*తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి*
తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి అని కూడా అనటం కద్దు. గురజాడ అప్పారావు కలం నుండి భాషలోకి ప్రవహించిన గొప్ప వాక్యాల్లో ఇది ఒకటి. ఆయన తన రచనల్లో రాసిన ఎన్నో పదాలు నానుడులై, సామెతలై, నుడికారాలై భాష లోకి ఒదిగి పోయాయి. అటువంటి సామెతల్లో అగ్రశ్రేణికి చెందినది కన్యాశుల్కం నాటకం లోని ఈ వాక్యం. అగ్నిహోత్రావధాన్లు అనే ఒక పాత్ర, కన్యాశుల్కం మీది పేరాశతో భార్య ఇష్టానికి వ్యతిరేకంగా, ఆమెకు తెలియకుండా, తమ కూతురుకి ఒక ముసలివాడితో పెళ్ళి నిశ్చయిస్తాడు. దానికి భార్య, బావమరిది అభ్యంతరం చెప్పినపుడు, ఆసక్తికరమైన సంభాషణ వారి ముగ్గురి మధ్య జరుగుతుంది. ఆ సందర్భంలో అగ్నిహోత్రావధాన్లు చేత గురజాడ ఈ మాట అనిపిస్తాడు. తాంబూలాలివ్వడమనేది భారతీయ సాంప్రదాయంలో పెళ్ళి నిశ్చయం చేసుకోవడం. అక్కడి వరకూ వచ్చాక ఇక ఆ పెళ్ళి ఆగటం సాధారణంగా జరగదు, పెళ్ళి దాదాపు జరిగినట్లే. నేను తాంబూలాలు కూడా ఇచ్చేశాను, ఇక మీరెంత గింజుకున్నా ఒరిగేదేమీ లేదని ఆ పాత్ర భావం. చెయ్యాల్సిందంతా చేసేశాను, ఇంక ఎన్ననుకున్నా ఏమీ లాభం లేదు అని చెప్పాల్సిన సందర్భంలో దీనిని వాడతారు. కేవలం ఒక పాత్ర సంభాషణలలో భాగంగా రాసిన సంభాషణ సామెతగా భాషలో ఇంకిపోయింది.
12. నేటి జాతీయం*కాకావికలు*
చెల్లాచెదరు బిడ్డలు పదే పదే పుడుతూ చనిపోతూ ఉన్న తల్లి.కాకి తన గూట్లో ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా కోయిలో, మరో పక్షో, చెట్ల మీదకు పాకే పాముల వల్లనో ఆ గుడ్లన్నీ నశించి పోతుంటాయి
13. మన ఇతిహాసాలు **మేఘనాథుడు – శాపము*
ఓ మునిని మేఘనాథుడు పీడించడంతో పాముల వల్ల, వాటి ప్రభువుల వల్ల మరణం ప్రాప్తిస్తుందని ఆయన శపించాడు. అద్భుత పరాక్రమవంతుడైనన తనను పాములు చంపలేవని విశ్వసించిన ఇంద్రజిత్తు ఓ గురువు సలహా తీసుకుంటాడు. ఆదిశేషుని అంశ భూలోకంలో అవతరిస్తుందని, అతడే నిన్ను సంహరించే ఆస్కారం ఉందని ఆ గురువు తెలిపాడు. దీన్ని నుంచి తప్పించుకోడానికి మేఘనాథుడు సర్పలోక రాజు శేషనాగును జయించి, పరిహారంగా ఆయన కుమార్తె సులోచనను వివాహం చేసుకున్నాడు. లక్ష్మణుడు ఆదిశేషుని అంశే కాబట్టి, ఆయన కుమార్తెను పెళ్లిచేసుకోవడంతో అల్లుణ్ని చంపడానికి వెనుకాడుతాడని ఇంద్రజిత్తు భావించాడు. ఈ విధంగా ఇంద్రజిత్తు లక్ష్మణుడికి అల్లుడని అంటారు.
ఇంద్రజిత్తుకు ఒక శాపం ఉంటుంది. గతంలో ఒక మునీశ్వరుడిని ఇంద్రజిత్తు బాధిస్తాడు. దీంతో ఆయన శపిస్తాడు. నీకు పాములకు ప్రభువైన వ్యక్తి వల్ల మరణం ఉంటుందిని చెబుతాడు. అయితే ఇంద్రజిత్తు ఇందుకు పరిష్కారం ఏమిటని ఆలోచించి సర్ప లోకానికి రాజు అయిన శేషనాగుడిపై విజయం సాధించి ఆయన కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు.
ఇక లక్ష్మణుడు ఆదిశేషుడికి సంబంధించిన వ్యక్తే కాబట్టే తనని చంపడని భావిస్తాడు ఇంద్రజిత్తు. అలా మేఘనాథుడు లక్ష్మణుడికి వరుసకు అల్లుడే అయిన చివరకు లక్ష్మణుడి చేతిలోనే మేఘనాథుడు ప్రాణాలు కోల్పొతాడు. అయితే శ్రీరాముడు ఆదేశించడంతో మేఘనాథున్ని వధించడానికి బయల్దేరుతాడు లక్ష్మణుడు
14. తిరుమల \|/ సమాచారం* *_*ఓం నమో వేంకటేశాయ!!*_
• ఈ రోజు బుధవారం,
*24.07.2019*
ఉదయం 5 గంటల
సమయానికి,
_తిరుమల: *22C° – 30℃°*_
• నిన్న *81,022* మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో గదులన్నీ
భక్తులతో నిండినది, భక్తులు
బైట చేచియున్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*18* గంటలు పట్టవచ్చును
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
నాలుగు గంటల సమయం
పట్టవచ్చును,
• నిన్న *31,142* మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 3.73* కోట్లు,
*_భక్తులకు గమనిక:_*
*_ఉచిత ప్రత్యేక దర్శనం_*
• నేడు 5 సం!! లోపు చంటి
పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి
ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉ: 9,
మ: 1.30 గంటల వరకు
సుపథం మార్గం ద్వారా
దర్శనానికి అనుమతిస్తారు,
*_వయోవృద్దులు మరియు దివ్యాంగుల_*
• ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
*_చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_*
• సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
*శ్రీవేంకటేశ్వర సుప్రభాతం*
_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!_
*తా:* _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_
_కావున లెమ్ము స్వామి_