పండగలూ, శుభకార్యాలు వస్తే చాలు…అప్పటివరకూ జీన్స్, కుర్తాలు వేసుకునేవాళ్లు కాస్తా…పదహారణాల తెలుగమ్మాయిల్లా మారిపోతారు. బుట్టబొమ్మల్లా కనిపిస్తారు. అలాంటి సంప్రదాయ లుక్ తేవడంలో పరికిణీ ఓణీలే ముందుంటాయి. అలాగని ఒకప్పటిలా వేసుకుంటే కొత్తేముంటుంది చెప్పండి…అందుకే రాబోయే వేడుకల్లో భిన్నంగా ఉండే లెహెంగా, ఓణీలను ప్రయత్నించి చూద్దామా… కంచి, బెనారస్‌లలో లభించే లెహెంగాలు భారీ పనితనంతో ఉంటాయి. పట్టూ, బుటాలతో కనువిందు చేస్తాయి. ఒకప్పుడు పట్టు పరికిణీ, బ్లవుజూ ఒకే రంగులో వచ్చేవి. ఇప్పుడు మూడూ మూడు భిన్నమైన రంగుల్లో రావడమే ట్రెండ్. పూజలూ, పుట్టిన రోజులూ, నిశ్చితార్థాల్లాంటి వాటికి బడ్జెట్ ఫ్రెండ్లీ లెహెంగాలు చాలు. అంటే నెట్ వస్త్రంపై బుటీలూ, ఎక్కువ కుచ్చిళ్లూ, వీలైనంత వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి. అంచు లేకపోతే గనుక అదనంగా ప్రయత్నించొచ్చు. దీనికి మేళవింపుగా భిన్నమైన రంగులో ఓణి ఉండేలా చూసుకోవాలి. లెహెంగాకు తగినట్లుగా బ్లవుజూ ఉండేలా చూసుకోండి చాలు.
* కేవలం పరికిణీ అంచుల్ని హైలేట్ చేసేలా లెహెంగాలు ఎంచుకోవచ్చు. లెహెంగా వస్త్రం అంతా ఏ డిజైనూ లేకుండా చేసుకుని అంచు మాత్రం భారీగా ఉండేలా చూసుకోవాలి. అంచు వస్త్రంతోనే బ్లవుజూ ప్రయత్నించొచ్చు. ఓణీకి కూడా అంచును సన్నగా జత చేసుకోవచ్చు. ఇంకా భిన్నంగా కావాలనుకుంటే ఓణీపై అదనంగా వర్క్ చేయించుకోవచ్చు. జర్దోసితో మగ్గం పనితనం, సీక్వెన్ల వర్క్ ప్రయత్నించొచ్చు.
* మనం ఎంచుకునే లెహెంగా కాస్త ఆడంబరంగా కనిపించాలంటే కంచిపట్టూ, బెనారస్ వస్త్రాలను ప్రయత్నించొచ్చు. లేదంటే ఏ డిజైను లేని పట్టు వస్త్రాన్ని ఎంచుకుని దానిమీద భారీగా మగ్గం పనితనం చేయించుకోవచ్చు. ఇంకా భిన్నంగా కావాలంటే బుటీలు ప్రయత్నించొచ్చు. బుటీలయితే లెహెంగా అంతా వచ్చేలా చూసుకోవాలి. భారీ అంచు వద్దనుకుంటే ఓ తీగలా సన్నగా కనిపించేలా కూడా డిజైను చేయించుకోవచ్చు. సాధారణంగా టీనేజీ అమ్మాయిలకు నెట్ ఓణీలు బాగుంటాయి కానీ… కాస్త పెద్దవారికి అంతగా నప్పవు. కాబట్టి జార్జెట్, షిఫాన్ రకాల్లో ప్రయత్నించొచ్చు. అయితే ఈ ఓణీలపై ఎక్కువ పనితనం అంతగా నప్పదు. ఓణీ భారీ పనితనతంతోనే కావాలనుకుంటే నెట్ దుపట్టాలు బాగుంటాయి.
* రా సిల్క్‌తోనూ లెహెంగాలు కుట్టించుకోవచ్చు. ప్యూర్ రాసిల్క్‌పై మగ్గం పనితనం అదిరిపోతుంది. వీటిపైకి షిఫాన్, జార్జెట్, నెట్ దుపట్టాలు నప్పుతాయి.
**ఎలాంటి వస్త్రాలంటే…
* పట్టూ, నెట్, రాసిల్క్ కాకుండా… ఆర్గాంజా, క్రేప్‌లలోనూ లెహెంగాలు కుట్టించుకోవచ్చు. వీటిమీదకు బ్లవుజు సాదాగా కాకుండా క్రాప్ టాప్ తరహాలో ఉండేలా చూసుకోవాలి. చేతులకు అంచులు పెట్టించుకోవచ్చు. లేదా చేతి అంచులకు మగ్గం పనితనం చేయించుకుంటే హుందాగా ఉంటుంది.
* ఓణీలు కూడా భారీగా కనిపించాలంటే… కంచిపట్టు, ఇకత్, నెట్, షిఫాన్, జార్జెట్లలో ప్రయత్నించి చూడండి.
* పరికిణీ, ఓణీ, బ్లవుజు… ఈ మూడూ మూడు రంగుల్లో వద్దనుకుంటే రెండింటిని ఒకే రంగులో ఎంచుకోవచ్చు. లేదా పాత తరహాలో పరికిణీ అంచులోనే ఓణీని ప్రయత్నించినా మంచిదే.
* బ్లవుజులకు చేతులు కేప్ తరహాలోనూ పెట్టించుకోవచ్చు.
లెహంగామా
Related tags :