Sports

మూన్ షూకు భారీ ధర

Nike Moon Shoes Auctioned For High Price - మూన్ షూకు భారీ ధర -

అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ నైక్‌ తయారుచేసిన ఓ బూట్లు వేలంలో రికార్డు ధర పలికాయి. 1972లో ‘మూన్‌ షూ’ పేరుతో తీసుకొచ్చిన ఈ అరుదైన స్నీకర్స్‌ను సోథిబే సంస్థ మంగళవారం వేలం వేసింది. ఇందులో ఈ బూట్లు ఏకంగా 4,37,500 డాలర్లు పలికాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 3కోట్లకు పైమాటే. కెనడాకు చెందిన మైల్స్‌ నాదల్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్‌ వేలంలో వీటిని దక్కించుకున్నారు. నైక్‌కు చెందిన మూన్‌ షూను దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని నాదల్‌ తెలిపారు. 1972 ఒలింపిక్‌ ట్రయల్స్‌లో రన్నర్ల కోసం నైక్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ బోవర్‌మన్‌ ఈ ‘మూన్‌ షూ’ను డిజైన్‌ చేశారు. ఈ మోడల్‌లో కేవలం 12 జతలు మాత్రమే తయారుచేయగా.. అందులో ఒక దాన్ని సోథిబే తాజాగా వేలం వేసింది. కాగా.. వేలంలో అత్యధిక ధరకు అమ్ముడై ఈ స్నీకర్స్‌ సరికొత్త ప్రపంచ రికార్డు నమోదుచేశాయి. 1984 ఒలింపిక్‌ బాస్కెట్‌బాల్‌ ఫైనల్స్‌ సమయంలో బాస్కెట్‌బాల్‌ ఆటగాడు మైఖెల్‌ జోర్డాన్‌ ధరించిన కాన్‌వర్స్‌ స్నీకర్స్‌ను 2017లో సోథిబే వేలం వేసింది. వేలంలో ఆ స్నీకర్స్‌ 1,90,373 డాలర్లు పలికాయి. ఇప్పటివరకు అదే ప్రపంచ రికార్డు కాగా.. తాజాగా నైక్‌ మూన్‌ షూ ఆ రికార్డును బద్దలుకొట్టింది.