* ఏపీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను తెదేపా అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని పీఏసీ ఛైర్మన్‌గా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో పయ్యావులను ఎంపిక చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తెదేపా అధికారంలో ఉండగా ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పీఏసీ ఛైర్మన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
*రాజ భవన్ లో గవర్నర్ నరసింహన్తో అమెరికా కాన్సుల్ జనరల్ కేథరీన్ హడ్డా మంగళవారం భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా ఈ సమావేశం జరిగినట్లు అధికారవర్గాలు తెలిపాయి. వారు అమెరికా-భారత్ సంబంధాలు, తెలంగాణ అభివృద్ధి, ఇతర అంశాలను చర్చించినట్లు సమాచారం.
* ఆదాయపు పన్ను చెల్లింపు గడువు తేది పొడిగింపు…….
ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) గడువు తేదీని పొడిగించింది. సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి చివరి తేదీ జులై 31 కాగా..ప్రభుత్వం ఆ గడువు తేదిని ఆగస్టు 31వ తేదీ వరకూ మరో నెల రోజులు పెంచింది. ఇప్పటి వరకు పన్ను చెల్లించని వారుంటే ఆగష్టు 31 లోగా రిటర్నులను సమర్పించాలని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కోరింది. ఈ గడువు లోపు చెల్లించనట్లయితే రూ.5000 ఫైన్ తో డిసెంబర్ 31, 2019 కల్లా రిటర్నులు దాఖలు చేయాలని తెలిపింది.
* ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.10 లక్షల ఎకరాల సాగు తాగు నీరు కు కృషి చేసిన కాటన్ కీర్తి అజరామరం అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జి పేర్కొన్నారు. బుధవారం కాటన్ వర్ధంతి సందర్భంగా.. పాలకొల్లు లాకులు సెంటర్లో కాటన్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
* హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయం దగ్గర ఈ ఉదయం ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం లోని అంకాపూర్ గ్రామస్తులు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అయిన ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు వచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీని ప్రభుత్వం ఇంకా నిలబెట్టుకోలేదంటూ .. క్యాంప్ ఆఫీస్ ముందు నిరసనకు ప్రయత్నించారు. ముందస్తు సమాచారంతో పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు… నిరసన తెలుపుతున్న గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 52 మందిని అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
* పోలవరం గ్రామ సమీపంలో డంపింగ్‌యార్డు నిమిత్తం రైతుల భూముల్లో మట్టి వేసి పర్యావరణానికి విఘాతం కలిగించారంటూ పి.పుల్లారావు వేసిన పిటిషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యులు సందర్శనకు వచ్చారు. కలెక్టర్ ముత్యాలరాజుతో కలిసి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అడిషనల్ డైరెక్టర్ ఎం.మధుసూదన్‌రావు, శాస్త్రవేత్త పాల్‌పండి, రవీంద్రనాథ్ తదితరులు బుధవారం పోలవరంలో పర్యటించారు.
* అసోంబీహార్లో వరద బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 150 మంది మృతి చెందారు. లక్షల మంది నిరాశ్రులయ్యారు. పలు చోట్ల నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముంబైను వరుణుడు మరోసారి ముంచెత్తాడు. నిన్న అర్థరాత్రి నుంచి బుధవారం ఉదయం 7 గంటల వరకు రికార్డు స్థాయిలో 170 మి.మీ. వర్షపాతం నమోదయింది. దీంతో మహానగరం మరోసారి నీటమునిగింది. రోడ్లపై మోకాలు లోతు నీరు నిలిచిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల ప్రభావం సబర్బన్ సర్వీసులపై పడింది. రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షాల ప్రభావంతో మూడు కార్లు ఢీ కొన్న ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురుస్థాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
* కర్ణాటకలో దాదాపు మూడు వారాలపాటు కొనసాగిన హైడ్రామాకు నిన్నటితో తెరపడింది. సుమారు14 నెలలపాటు కొనసాగిన కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. నాటకీయ పరిస్థితుల మధ్య మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంతోషంలో బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య, కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్‌లో తెగ వైరలవుతోంది. రేణాకాచార్య కర్ణాటక దేవంగరే జిల్లా హోన్నాళి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
* భారతకుచెందిన వ్యాపారవేత్త, స్టీల్ మాగ్నేట్ లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం, అధికార దుర్వినియోగం ఆరోపణలతో బోస్నియాలో బుధవారం అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈశాన్య పట్టణం లుకావాక్‌లో ఒక కోకింగ్ ప్లాంట్ కేసుకు సంబంధించి ప్రమోద్ మిట్టల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.
* ఈ నెల 25, 26 తేదీల్లో ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్‌లు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) ఏర్పాట్లు చేస్తున్నది. పోస్టులకు ఎంపికైనవారి ఫొటోలు, ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతున్నది. అనంతరం మెడికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. హైదరాబాద్‌తోపాటు పాత పది జిల్లాకేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. తుది రాతపరీక్షకు హాజరైన సమయంలో అభ్యర్థుల నుంచి సేకరించిన వేలిముద్రలను.. మెడికల్ టెస్ట్‌లకు వెళ్లేముందు సరిపోల్చనున్నారు.
* భారీ వర్షాల కారణంగా ముంబై నగరం సముద్రాన్ని తలపిస్తోంది. మంగళవారం అర్థరాత్రి నుంచి కుండపోత వర్షం కురవడంతో నగరమంతా నీటితో నిండిపోయింది. ప్రధాన రహదారులన్నీ జలమయం అయిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపిపోవడంతో పనులకు వేళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
*తెలంగాణ రాష్ట్రంలో మరో 6 విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. వీటి ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని సంప్రదించింది.
దీనికోసం కన్సల్టెన్సీ ఫీజుగా రూ. 4.5 కోట్లు చెల్లించనున్న ప్రభుత్వం ఇప్పటికే రూ. 1.06 కోట్లను విడుదల చేసింది.
వీటి సాధ్యసాధ్యాలపై నిర్ణయం వెలువడగానే సర్వే పనులు మొదలవుతాయని అధికారులు చెప్పారు.
*గత పదిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలతో అసోం, బీహార్ రాష్ట్రాలను ముంచెత్తిన వరదల వల్ల 174 మంది మరణించారు. 1.09 కోట్ల మంది ప్రజలను వరద ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
*క్షేత్రస్థాయిలో విశేష సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ అది ఎప్పటికి అమలుకు నోచుకుంటుదోననే సందేహం వారిలో ఉంది. దీనిపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు నుంచే రూ.10 వేలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారు.
*కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు జలాశయాలు క్రమంగా జలకళను సంతరించుకుంటున్నాయి. ప్రాణహిత నది నుంచి వస్తున్న నీటితో మేడిగడ్డ బ్యారేజీ సముద్రాన్ని తలపిస్తోంది.
*కశ్మీర్ వివాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వాగతించారు. భారత్, పాక్ ద్వైపాక్షిక చర్చలతో కశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు లేనే లేవని పేర్కొన్నారు.
*వ్యక్తిగత ఆదాయపు పన్ను మదింపు(ఐటీఆర్) పత్రాల దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం మరో నెల వరకు పొడిగించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్ పత్రాలను ఆగస్టు 31వ తేదీ వరకు సమర్పించవచ్చునని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
*రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో మంగళవారం ఘనంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు. సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి దంపతులు, మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. సభాపతి పోచమ్మ ఆలయంలో బోనం సమర్పించారు.
*దేశంలో అత్యంత ప్రముఖులకు(వీఐపీ) కల్పిస్తున్న భద్రతపై కేంద్రం భారీ సమీక్ష నిర్వహించింది. రాజకీయ నాయకులు, చట్టసభల సభ్యులు, పలువురు ప్రముఖుల కుటుంబ సభ్యులు సహా మొత్తం 130 మందికి భద్రతా స్థాయి తగ్గింపు లేదా కేంద్ర బలగాల భద్రత తొలగింపు జరిగినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు.
*అమరావతి నిర్మాణానికి రుణ ప్రతిపాదనపై ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(ఏఐఐబీ) సైతం వెనక్కు తగ్గింది. ‘‘అమరావతి సుస్థిర మౌలిక వసతులు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టుకు రుణ ప్రతిపాదనను రద్దుచేసుకున్నాం.
*కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కొత్తగా ప్రవేశపెట్టిన ‘జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ)’ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్యవిద్యార్థులు ఆందోళన చేపట్టారు. కొత్త బిల్లులో వైద్యవిద్యను ప్రైవేటు వైద్యకళాశాలలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
*హైదరాబాద్ శివారులోని 2,042 ఎకరాల కీసరగుట్ట అభయారణ్యాన్ని తెరాస రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. బుధవారం తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలకు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ బృహత్తర కార్యక్రమానికి పూనుకున్నట్లు మంగళవారం ట్విటర్లో వెల్లడించారు.
*మహిళలపై వివక్ష, దారుణాలను అరికట్టడానికి అంతటా చైతన్యం రావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మహిళలు, బాలల హక్కులు కాపాడడానికి పత్రికలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
*రికార్డుస్థాయిలో విద్యుదీకరణ, కాపలా లేని గేట్ల తొలగింపు అంశాల్లో దక్షిణ మధ్య రైల్వే జాతీయస్థాయిన గుర్తింపు పొందింది. ఈ రెండు విభాగాల్లోనూ ఉత్తమ పనితీరుకు ప్రశంసా పత్రాలను జోన్ జనరల్ మేనేజర్ గజానన్ ఇటీవల అంబాలాలో 64వ రైల్వే వారోత్సవాల సందర్భంగా రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ నుంచి అందుకున్నారు.
*తూర్పు నౌకాదళ వైస్ అడ్మిరల్ అతుల్కుమార్ జైన్ ఈ నెల 25న ఉదయం 11 గంటలకు సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో భేటీ కానున్నారు.
*రాష్ట్ర ఉద్యాన సంస్థ చేపడుతున్న సుగంధ ద్రవ్యాల శుద్ధి కేంద్రానికి కిసాన్ సంపద పథకం కింద రూ.4.28 కోట్లు రాయితీగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఉద్యాన సంస్థ ఛైర్మన్ పార్థసారథి తెలిపారు.
*శంషాబాద్ నుంచి దిల్లీకి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఏటీసీ అధికారులు సర్వీసును అర్ధంతరంగా రద్దు చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ 6ఈ-2513 విమానం మంగళవారం ఉదయం 7.30కు దిల్లీ వెళ్లడానికి ప్రయాణికులను ఎక్కించుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించి ఏటీసీ అధికారులకు సమాచారమిచ్చారు. నిపుణులు పరిశీలించాక విమానాన్ని రద్దు చేశారు. ఎయిర్లైన్స్ యాజమాన్యం 2 గంటలు ఆలస్యంగా మరో విమానంలో ప్రయాణికులను దిల్లీకి పంపింది.
* రైతుబంధు పథకం కింద 5.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.500 కోట్లను వ్యవసాయశాఖ మంగళవారం జమ చేసింది. ఎకరానికి రూ.5 వేల చొప్పున కేటాయించింది. ఖరీఫ్ సీజన్లో గతంలో 33.70 లక్షల మంది ఖాతాల్లో రూ.3430 కోట్లను వేసింది.
*మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్యకళాశాలకు 2020-21 వైద్యవిద్య సంవత్సరానికి మరో 4 కోర్సుల్లో పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే కొద్దిరోజుల కిందట ఈ కళాశాలకు ఫార్మకాలజీ విభాగంలో మూడు పీజీ సీట్లకు భారతీయ వైద్యమండలి(ఎంసీఐ) అనుమతులు మంజూరు చేయగా, తాజాగా అనాటమీలో 3, ఫిజియాలజీలో 3, బయోకెమిస్ట్రీలో 3, ఫోరెన్సిక్ మెడిసిన్లో 2 చొప్పున పీజీ సీట్లను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
*బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, అంతకుముందు గురువారం నుంచి 3 రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడా భారీవర్షాలు కురవవచ్చని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.
*రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి దక్షిణాది జోన్ జోనల్ కౌన్సిల్ సభ్యులుగా ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోష్, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ను, సలహాదారుగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్సింగ్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
*తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) సీఎండీ ఎస్.నాగలక్ష్మిని ఏపీ ట్రాన్స్కో బోర్డు డైరెక్టర్గా నియమిస్తూ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈపీడీసీఎల్ సీఎండీగానూ ఆమె కొనసాగుతారు.
*రాజీవ్గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు ఎంపిక జాబితాను విడుదల చేశారు. సీట్లు పొందిన విద్యార్థుల వివరాలను www,rgukt.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రవేశాల కన్వీనర్ గోపాలరాజు తెలిపారు.
* 1984లో సంచలనం సృష్టించిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు 34 మందికి బెయిల్ మంజూరు చేసింది. సిక్కు అల్లర్ల కేసుకు సంబంధించి గతేడాది ఢిల్లీ హైకోర్టు 34మందికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునివ్వగా… వీరిలో 34 మంది ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం..తాజాగా వారందరికి బెయిల్ మంజూరు చేసింది.
పయ్యావులకు కీలక పదవి – తాజా వార్తలు – 07/24
Related tags :