Sports

ఒప్పో పోయే బైజూస్ వచ్చే

Byjus Takes Over Oppo On Indian Cricket Jersey

టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై ఒప్పో బ్రాండ్‌కు బదులు త్వరలో కొత్త బ్రాండ్‌ దర్శనమివ్వబోతోంది. వచ్చేనెల ఆగస్టులో వెస్టిండీస్‌ పర్యటన వరకే కోహ్లీసేన జెర్సీలపై ఒప్పో బ్రాండ్‌ కనిపిస్తుంది. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన సెప్టెంబర్‌ 2న పూర్తవుతుంది. సెప్టెంబర్‌ 15న ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటన నుంచి బెంగళూరుకు చెందిన ఆన్‌లైన్‌ ట్యుటోరియల్‌ సంస్థ బైజుస్‌ తన బ్రాండ్‌ను కొనసాగించనుంది.చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ ఒప్పో.. 2017 మార్చిలో టీమిండియా స్పాన్సర్‌షిప్‌ను రూ.1079 కోట్లకు ఐదేళ్ల పాటు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల పత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. ఒప్పో సంస్థ తమ స్పాన్సర్‌షిప్‌ను రద్దు చేసుకుందని, 2017లో అధిక వ్యయానికి ఒప్పందం కుదుర్చుకున్నామనే కారణంతో తప్పుకోవాలని చూస్తోందట. అంత మొత్తంలో తాము చెల్లించలేమనే ఒప్పో వైదొలుగుతున్నట్లు పేర్కొంది. అయితే బైజుస్‌ సంస్థ అదే కాల వ్యవధికి అంతే మొత్తంలో బీసీసీఐకి చెల్లించడానికి ముందుకు వచ్చిందని, దీంతో సెప్టెంబర్‌ నుంచి 2022 మార్చి వరకు బైజుస్‌ స్పాన్సర్‌షిప్‌ చేస్తుందని తెలిపింది. కాగా టీమిండియా ఆడే ద్వైపాక్షిక మ్యాచ్‌లకు ఒప్పో సంస్థ ఒక్క రోజుకు రూ 4.61 కోట్లు చెల్లించగా ఐసీసీ ఈవెంట్లకు రూ.1.56 కోట్లు చెల్లించేది. అంతకుముందు స్టార్‌ ఇండియా ఒక్కో మ్యాచ్‌కు 1.92 కోట్లు చెల్లించగా ఐసీసీ ఈవెంట్లకు రూ.61 లక్షలు మాత్రమే చెల్లించేదని తెలుస్తోంది. విండీస్ టూర్ నుంచి తప్పుకున్న టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశ రక్షణకు అహర్నిశలూ శ్రమించే సైన్యం విధుల్లో తానూ భాగం కావాలని నిర్ణయించుకున్నాడు. లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోనీ పారా మిలటరీ సైనికుడిగా జులై 31 నుంచి ఆగస్ట్ 15వరకూ సేవలందించనున్నాడు. పెట్రోలింగ్, గార్డ్‌గా దేశ సైన్యంలో ధోనీ భాగస్తుడు కాబోతున్నాడు. కశ్మీర్‌ వ్యాలీలోని సైనిక శిబిరాల్లో సైనికులతో కలిసి దేశ రక్షకుడిగా ధోనీ విధులు నిర్వహించనున్నాడు. 2011లో ధోనీ టీమిండియాకు అందించిన సేవలకు గానూ భారత సైన్యం లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ధోనీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సైనిక ఉన్నతాధికారులు అభినందించారు. ధోనీ ఈ నిర్ణయంతో యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.