Movies

కోల్పోయింది

Disha Pathani Loses It

నిన్న, మొన్న ఏం జరిగిందో, ఏం చేశామో మనకు ఒక్కోసారి గుర్తుకు రాకపోతేనే కంగారు పడతాం. అలాంటిది ఓ ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తి కోల్పోతే? సినిమాల్లో ఇలా జరుగుతుంది కానీ నిజజీవితంలో జరుగుతుందా అనుకుంటున్నారా? హీరోయిన్ దిశా పాట్నీ లైఫ్లో ఇలా జరిగింది. తలకు తగిలిన గాయం వల్ల ఆమె ఓ ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ సినిమాలో వరుణ్ తేజ్తో జోడీ కట్టిన ఈ బ్యూటీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్పై దృష్టి సారించారామె. తాను చేస్తున్న సినిమా విశేషాలు, జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియోలు, ఫిట్నెస్ విషయాల గురించి ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. మూడేళ్లుగా దిశా జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.కాగా, ఓసారి జిమ్నాస్టిక్స్ చేస్తున్న సమయంలో ఆమె తల నేలకు తగలడంతో బలమైన గాయం తగిలింది. ఆ గాయం కారణంగా ఆమె ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. ఆ విషయం గురించి దిశా మాట్లాడుతూ – ‘‘ఆర్నెల్ల జీవితాన్ని నేను కోల్పోయాను. ఎందుకంటే అంతకుముందు ఏం జరిగిందో ఆ ఆరు నెలల్లో గుర్తుకు రాలేదు’’ అన్నారు. ట్రీట్మెంట్తో మళ్లీ మామూలు మనిషి అయ్యారామె. ‘‘జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ చేయాలంటే చాలా ధైర్యం, శక్తి, ఓపిక కావాలి. వర్కవుట్స్ చేసే టైమ్లో దెబ్బలు తగిలినప్పుడు మినహా మిగతా అన్నిరోజులూ చేయాల్సిందే. నేనివాళ ఇంత ఫిట్గా ఉండటానికి కారణం క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడమే’’ అన్నారు దిశా.